ఏ దేశమూ అలా పంపదు

No Country Sends its People to Gas Chambers to Die: Supreme Court - Sakshi

పారిశుద్ధ్య మరణాలపై సుప్రీం సీరియస్‌

న్యూఢిల్లీ: పారిశుద్ధ్య కార్మికులకు పనివేళల్లో మాస్క్‌లు, ఇతర భద్రతా పరికరాలు, దుస్తులు అందించడంలో విఫలమవుతున్న కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. విష వాయువులు పీల్చి చనిపోవాల్సిందిగా ఏ దేశమూ తన పౌరులను పంపదని విమర్శించింది. పారిశుద్ధ్య కార్మికులకు తగిన రక్షణ ఏర్పాట్లు ఎందుకు కల్పించడంలేదని అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ను కోర్టు ప్రశ్నించింది. ‘మ్యాన్‌హోల్స్‌లో దిగే కార్మికులకు ఆక్సిజన్‌ సిలిండర్లు ఎందుకు ఇవ్వట్లేరు? మురికికాలువలు, మలమూత్రాలను ఎత్తే కార్మికులకు మాస్క్‌లు, ఇతర కనీస పరికరాలను ఎందుకు ఇవ్వట్లేరు? ఏ దేశమూ ఇలా తమ పౌరులను విషవాయువులతో నిండిన (గ్యాస్‌ ఛాంబర్లలో) మ్యాన్‌హోల్స్‌లో చనిపోవాలని తమ పౌరులను పంపించదు’ అని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది.

రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు ఇచ్చిందని పారిశుద్ధ్య కార్మికులకు అవసరమైన సదుపాయాలను పాలకులు కల్పించడం లేదని జస్టిస్‌ అరున్‌ మిశ్రా నేతృత్వంలోని జస్టిస్‌ ఎంఆర్‌ సాహా, బీఆర్‌ గవాయ్‌లతో కూడిన బెంచ్‌ వ్యాఖ్యానించింది. పారిశుద్ధ్య కార్మికుల పట్ల అమానవీయంగా వ్యవహరిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై గతేడాది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కేంద్రం వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీం బెంచ్‌ ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.

పారిశుద్ధ్య కార్మికులు చేసే పనిని నివారించే చట్టాలేవి లేవని కోర్టుకు అటార్ని జనరల్‌ తెలపగా.. ‘మనుషుల్ని ఈవిధంగా చూడటం అమానవీయం’ అంటూ బెంచ్‌ మండిపడింది. దేశంలో అంటరానితనం కొనసాగుతుండడం పట్ల కూడా న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘దేశంలో అంటరానితనాన్ని రాజ్యాంగం నిషేధించింది. పారిశుద్ధ్య కార్మికులకు మీరు షేక్‌హ్యాండ్‌ ఇస్తారా నేను అడిగితే.. ఇవ్వను అనే సమాధానం వస్తుంది. అలాంటి మార్గంలో మనం పయనిస్తున్నాం. ఈ పరిస్థితులు మారాలి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు గడిచినా అంటరానితనం లాంటి దురాచారాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయ’ని జస్టిస్‌ మిశ్రా ఆవేదన వ్యక్తం చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top