breaking news
Scavengers
-
‘మురుగున’ పడ్డ జీవితాల్లో వెలుగు
మారుతున్న ఈ దేశంలో మారాల్సినవి ఇంకా ఉన్నాయి. మానవ వ్యర్థాలను ఎత్తి పోసే పాకీ పనిని నిషిద్ధం చేయగలిగినా మ్యాన్‌హోల్స్ శుభ్రతకు మురుగు నీటి వ్యవస్థ మరమ్మత్తులకు మనుషులనే ఉపయోగించడం వల్ల వారు అనారోగ్యం పాలై మృత్యువాత పడుతున్నారు. వారిలో చైతన్యం, పొందాల్సిన హక్కుల కోసం పని చేస్తోంది హేమలత కన్సోటియా. ఢిల్లీలో మొదలైన ఈమె ఉద్యమం ఇప్పుడు రాజస్థాన్‌కు చేరి మంచి ఫలితాలను ఇస్తోంది. హేమలత పరిచయం..‘జూన్‌లో బికనీర్‌లో ముగ్గురు స్కావెంజర్లు మరణించారు... సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తూ. విష వాయువుల వల్ల ఇలా జరిగింది. కేసు ఏం పెట్టలేదు. కొద్ది డబ్బుతో వదిలించుకున్నారు. ఇలా ఎన్నిచోట్ల జరుగుతున్నదో చెప్పలేము. ఈ పరిస్థితి మారాలి’ అంటుంది హేమలత.ఢిల్లీకి చెందిన హేమలత ప్రస్తుతం రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఉంటూ మాన్యువల్ స్కావెంజర్ల కోసం పని చేస్తోంది. గతంలో ‘మాన్యువల్ స్కావెంజర్స్’ అంటే మానవ వ్యర్థాలను శుభ్రం చేసే వారిని అనేవారు. ఇప్పుడు మ్యాన్‌హోల్స్‌ను, సెప్టిక్ ట్యాంకులను, మురుగు కాల్వలను శుభ్రం చేసే వారికి కూడా వాడుతున్నారు. మొత్తంగా పారిశుధ్య కార్మికుల పనిలో యంత్ర ప్రమేయం అవసరం గురించి హేమలత పోరాటం సాగిస్తున్నారు. ఆమె వాదన వింటే ఎవరికైనా సరే పారిశుద్ధ్య కార్మికుల గురించి ఆలోచన మొదలవుతుంది.చిన్న వయసు నుంచేఢిల్లీకి చెందిన హేమలతకు పద్నాలుగేళ్ల వయసులో చెవి వైద్యం చేయిస్తే అది వికటించి ముఖానికి పాక్షిక పక్షవాతం వచ్చింది. దాంతో ఆమెను తల్లిదండ్రులు పెళ్లి పేరుతో వదిలించుకున్నారు. ఆ పెళ్లి నిలువలేదు. హేమలత భవన నిర్మాత కూలీలతో పని చేస్తూ ఎం.ఏ చదివి కార్మికుల హక్కుల కోసం పని మొదలెట్టింది. 1998 నుంచి ఆమె ఈ పనిలో ఉన్నా 2007లో ఓ కేసు ఆమె దృష్టిని మార్చింది. ఓ నిర్మాణంలో జరిగిన ప్రమాదం కారణంగా ముగ్గురు మరణించారని ఆమెకు చెప్పారు. ఆమె అక్కడికి వెళ్లి చూశాక అసలు విషయం అర్థమైంది. అక్కడ మ్యాన్ హోల్ శుభ్రం చేసేందుకు వెళ్లి విషవాయువులు పీల్చి ఆ ముగ్గురూ మరణించారు. ఆ ఘటన ఆమె మనసును కదిలించింది. దేశంలో ఇంకా ఇలాంటి ఘటనలు జరుగుతుండటమేమిమటే ప్రశ్న మొదలైంది. పొట్టకూటి కోసం కార్మికులు ఈ ప్రమాదకరమైన పని చేస్తూ మృత్యువు పాలవుతున్నారని ఆమె గుర్తించింది. వారి కుటుంబాలకు నష్టపరిహారం సైతం అందడం లేదనే విషయం ఆమెకి తెలిసింది. ఈ పనులకు ముగింపు పలకాలని భావించి అదే సంవత్సరం దిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసింది. సమాజం మారాలి‘ప్రభుత్వ విధానాలు పేపర్ల మీద ఉంటాయి. కాని అవి వాస్తవరూపం దాల్చితేనే ఫలితం’ అంటుంది హేమలత. మ్యాన్‌హోల్స్ శుభ్రం చేస్తూ మరణించిన వారి కుటుంబాలకు ఆమె అండగా నిలబడ్డారు. వారి కాళ్ల మీద వారు నిలబడేలా సాయం అందించాలని భావించారు. అందుకు తగ్గ పనులు మొదలుపెట్టారు. అందుకూ ఆమెకు సమాచార హక్కు చట్టమే తోడ్పాటుగా నిలిచింది. ఆమె కృషి ఫలితంగా ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. మ్యాన్ హోల్స్ శుభ్రం చేస్తూ మరణించిన వారి కుటుంబాలకు సాయం అందించేందుకు సిద్ధమైంది. దీంతోపాటు ఏళ్లుగా ఈ పనిలోనే ఉన్నవారిని ఆ పని మాన్పించి, కొత్త పనులు చేపట్టేలా ప్రభుత్వ పథకాలను వారికి చేరువ చేశారు హేమలత. ఇది మాత్రమే కాదు, నిరుపేద కుటుంబాలకు విద్య, వైద్యం, మౌలిక వసతులు అందే విషయంలోనూ ఆమె క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. సుమారు రెండు వేల మంది చిన్నారులకు సక్రమంగా పోషకాహారం అందేందుకు ఆమె పాటుపడ్డారు. ‘మ్యాన్ హోల్లో ఎవరో ఒకరు దిగి శుభ్రం చేయక పోతే ఊళ్లు శుభ్రంగా ఎలా ఉంటాయి?’ అని చాలామంది హేమలతతో వాదిస్తుంటారు. ‘మనిషి జన్మ ఎత్తినవారెవరూ ఇటువంటి పనులు చేయకూడదు. అలా చేయకుండా చూడాల్సిన బాధ్యత సమాజానిది. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఇంత అభివృద్ధి సాధించాం. మురుగు కాల్వ శుభ్రం చేయడానికి ఆ అభివృద్ధిని ఉపయోగించలేమా?’ అని ఆమె ప్రశ్నిస్తారు. యంత్రాలను తీసుకొచ్చి, ఆ కార్మికులకు శిక్షణ ఇచ్చి, వారికి ఉపాధి కల్పించాలని ఆమె అంటున్నారు. తద్వారా దేశం నిజమైన అభివృద్ధి సాధిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మనిషి దిగొద్దుసామాజిక కార్యకర్త బెజవాడ విల్సన్ తదితరుల కారణంగా అప్పటిదాకా పాకీ పని చేసేవారి గురించి దేశవ్యాప్తంగా చర్చ సాగింది. అయితే మ్యాన్ హోల్స్‌లో దిగి శుభ్రం చేసేవారి గురించి, వారి భద్రత గురించి హేమలత వల్ల తొలిసారి చర్చ మొదలైంది. ఈ క్రమంలో అనేక ప్రాంతాలు తిరిగి అక్కడి కార్మికులతో మాట్లాడారు హేమలత. మురుగుకాల్వలు, మ్యాన్ హోల్స్ వంటి చోట్ల పనిచేసేవారి పట్ల సమాజం ఎంత వివక్షపూరితంగా ఉందనేది తెలిసింది. వారి ప్రాణాలు గాల్లో దీపాలుగా మారాయన్న విషయం వెలుగులోకి వచ్చింది. కోర్టులో సుదీర్ఘ వాదనల అనంతరం 2010లో దిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించింది. మ్యాన్ హోల్స్‌లోకి దిగి మురుగును శుభ్రం చేయడం చట్టవ్యతిరేక చర్య అని ప్రకటించింది. -
సఫాయి కార్మికుల కుటుంబాలకు రూ.30 లక్షల పరిహారమివ్వాలి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సఫాయి కార్మికులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు రూ.30 లక్షల పరిహారం చెల్లించాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించింది. అదేవిధంగా, డ్రెయినేజీలను శుభ్రం చేస్తూ శాశ్వత వైకల్యానికి గురయ్యే వారికి కనీసంగా రూ.20 లక్షల పరిహారం చెల్లించాలని కూడా పేర్కొంది. మాన్యువల్ స్కావెంజింగ్ విధానాన్ని పూర్తిగా లేకుండా చేయాలని జస్టిస్ ఎస్.రవీంద్ర భట్, జస్టిస్ అరవింద్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఒకవేళ సఫాయి కార్మికులు విధుల్లో ఇతర అవకరాలకు గురయిన సందర్భాల్లో రూ.10 లక్షలను పరిహారంగా చెల్లించాలని కూడా ఈ సందర్భంగా జస్టిస్ భట్ పేర్కొన్నారు. -
షేక్‌హ్యాండ్ ఎందుకివ్వరు.. పరిస్థితి మారాలి
న్యూఢిల్లీ: పారిశుద్ధ్య కార్మికులకు పనివేళల్లో మాస్క్‌లు, ఇతర భద్రతా పరికరాలు, దుస్తులు అందించడంలో విఫలమవుతున్న కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. విష వాయువులు పీల్చి చనిపోవాల్సిందిగా ఏ దేశమూ తన పౌరులను పంపదని విమర్శించింది. పారిశుద్ధ్య కార్మికులకు తగిన రక్షణ ఏర్పాట్లు ఎందుకు కల్పించడంలేదని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌ను కోర్టు ప్రశ్నించింది. ‘మ్యాన్‌హోల్స్‌లో దిగే కార్మికులకు ఆక్సిజన్ సిలిండర్లు ఎందుకు ఇవ్వట్లేరు? మురికికాలువలు, మలమూత్రాలను ఎత్తే కార్మికులకు మాస్క్‌లు, ఇతర కనీస పరికరాలను ఎందుకు ఇవ్వట్లేరు? ఏ దేశమూ ఇలా తమ పౌరులను విషవాయువులతో నిండిన (గ్యాస్ ఛాంబర్లలో) మ్యాన్‌హోల్స్‌లో చనిపోవాలని తమ పౌరులను పంపించదు’ అని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు ఇచ్చిందని పారిశుద్ధ్య కార్మికులకు అవసరమైన సదుపాయాలను పాలకులు కల్పించడం లేదని జస్టిస్ అరున్ మిశ్రా నేతృత్వంలోని జస్టిస్ ఎంఆర్ సాహా, బీఆర్ గవాయ్‌లతో కూడిన బెంచ్ వ్యాఖ్యానించింది. పారిశుద్ధ్య కార్మికుల పట్ల అమానవీయంగా వ్యవహరిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై గతేడాది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కేంద్రం వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీం బెంచ్ ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. పారిశుద్ధ్య కార్మికులు చేసే పనిని నివారించే చట్టాలేవి లేవని కోర్టుకు అటార్ని జనరల్ తెలపగా.. ‘మనుషుల్ని ఈవిధంగా చూడటం అమానవీయం’ అంటూ బెంచ్ మండిపడింది. దేశంలో అంటరానితనం కొనసాగుతుండడం పట్ల కూడా న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘దేశంలో అంటరానితనాన్ని రాజ్యాంగం నిషేధించింది. పారిశుద్ధ్య కార్మికులకు మీరు షేక్‌హ్యాండ్ ఇస్తారా నేను అడిగితే.. ఇవ్వను అనే సమాధానం వస్తుంది. అలాంటి మార్గంలో మనం పయనిస్తున్నాం. ఈ పరిస్థితులు మారాలి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు గడిచినా అంటరానితనం లాంటి దురాచారాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయ’ని జస్టిస్ మిశ్రా ఆవేదన వ్యక్తం చేశారు. -
‘మమ్మల్ని చంపడం ఆపండి’
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఈ ఒక్క నెలలోనే 11 మంది పారిశుద్ధ్య కార్మికులు విధి నిర్వహణలో మరణించడంతో పారిశుద్ధ్య కార్మికులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. వారంతా ఛలో ఢిల్లీ అంటూ మంగళవారం ఢిల్లీకి చేరుకొని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేశారు. ‘మమ్మల్ని చంపడం ఆపండి’ అంటూ నినదించారు. వీధుల్లోని, కాలనీల్లోని, గృహ సముదాయాల్లోని మాన్హోల్స్, సెప్టిక్ ట్యాంకులను శుభ్రం చేయడం కోసం వాటిలోకి దిగుతూ పారిశుద్ధ్య కార్మికులు అర్ధంతరంగా మరణిస్తున్నారు. ఈ నెల మొదట్లో ఢిల్లీలోని మోతీ నగర్లో ఓ సెప్టిక్ ట్యాంక్‌లోకి దిగి ఐదుగురు పారిశుద్ధ్య కార్మికులు మరణించిన విషయం తెల్సిందే. గత ఐదేళ్లలోనే ఒక్క ఢిల్లీలోనే ఇలా 2,403 మంది పారిశుద్ధ్య కార్మికులు మరణించారు. ఆ ఐదుగురు మరణానికి బాధ్యలైన వారిని కఠినంగా శిక్షిస్తామని, బాధితుల కుటుంబాలకు తగిన నష్టపరిహారం చెల్లిస్తామని అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించినా ఏ ప్రభుత్వం ఇంతవరకు మాట నిలబెట్టుకోలేదు. ఈ విషయంలో న్యాయం చేయాల్సిందిగా కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయానికి వినతి పత్రం అందజేశామని, స్వచ్ఛ భారత్ కోరుకునే మోదీ తప్పకుండా తమకు న్యాయం చేస్తామని భావించి రెండు వారాలకుపైగా నిరీక్షించామని, ఆయన నుంచి గానీ, ఆయన ప్రభుత్వం నుంచిగానీ ఎలాంటి స్పందన రాకపోవడంతో జంతర్ మంతర్ వద్ద ఈ ఆందోళన నిర్వహిస్తున్నామని ‘సఫాయి కర్మచారి ఆందోళన్’కు చెందిన బెజవాడ విల్సన్ తెలిపారు. సఫాయి కర్మచారి ఆందోళన్ పిలుపు మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి పారిశుద్ధ్య కార్మికులు ఢిల్లీకి తరలి వచ్చారు. మానవ పారిశుద్ధ్య కార్మిక వ్యవస్థను దేశంలో 2013లోనే భారత్ నిషేధించిన ఈ వ్యవస్థ ఇంకా కొనసాగడం శోచనీయమైతే పారిశుద్ధ్య పనిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అదే సంవత్సరం జాతీయ మానవ హక్కుల కమిషన్ మార్గదర్శకాలను సూచించినా వాటిని కాంట్రాక్టులుగానీ, యజమానులుగానీ, ప్రభుత్వంగానీ పాటించక పోవడం మరీ దారుణం. దేశంలో ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమం కోసం ఈ ఏడాది బడ్జెట్లో 17,843 కోట్ల రూపాయలను కేటాయించిన నరేంద్ర మోదీ ప్రభుత్వం పారిశుద్ధ్య పనివారల భద్రత కోసం ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం అన్యాయమని ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న సీపీఐ నాయకుడు డీ. రాజా విమర్శించారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం కూడా ఓ ఆడంబరమే తప్ప ఆచరణలో ఏమీ జరగడం లేదని ఆయన ఆరోపించారు. పారిశుద్ధ్య కార్మికుల భద్రత కోసం చట్టాలను కఠినంగా అమలు చేయాలని ఆయన మోదీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ‘ఐదు వేల సంవత్సరాలుగా ఈ దేశాన్ని శుభ్రం చేస్తున్నా మా పారిశుద్ధ్య కార్మికుల గోడును పట్టించుకోనప్పుడు ఇంకెలా స్వచ్ఛ భారత్ సాధ్యం అవుతుంది’ అని బేజ్వాడ విల్సన్ వ్యాఖ్యానించారు. కుల వ్యవస్థకు అంటుకున్న అంటరానితనం వల్ల తమకు ఇతర పనులేమీ దొరకడం లేదని, విధిలేకే ఈ వృత్తి మీద ఆధారపడి బతకాల్సి వస్తోందని వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన పారిశుద్ధ్య కార్మికులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. చదవండి: ఈ ఐదుగురు చావుకు ఎవరు బాధ్యులు? -
స్కావెంజర్లే సార్లు..!
నిజాంసాగర్(జుక్కల్): ప్రభుత్వ పాఠశాలల్లోని మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్వహణతో పాటు పాఠశాలల పరిశుభ్రత కోసం నియమించిన స్కావెంజర్లే ఇప్పుడు టీచర్లు అయ్యారు. ఉపాధ్యాయులు లేని జీరో పాఠశాలల్లో స్కావెంజర్లు సార్లుగా మారి విద్యార్థులకు చదువు చెబుతున్నారు. 2018–19 విద్యాసంత్సరం ప్రారంభమై 20 రోజులవుతున్నా ప్రభుత్వం మాత్రం వీవీలను నియమించలేదు. దాంతో జీరో పాఠశాలల్లో విద్యార్థులకు చదువులు అందని ద్రాక్షగా మారాయి. సదరు జీరో పాఠశాలలకు స్థాని రిసోర్స్ పర్సన్లు, ఉపాధ్యాయులకు ఇన్చార్జి అప్పగించారు. అయితే వారెవరు జీరో పాఠశాలలకు సక్రమంగా హాజరు కాకపోవడంతోనే ఈ దుస్థితి దాపురిస్తోంది. రెండేళ్లుగా అదే దుస్థితి నిజాంసాగర్ మండలంలోని జక్కాపూర్, మల్లూర్ తండాలోని ప్రభుత్వ ప్రాథమిక జీరో పాఠశాలల్లో బుధవారం ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. ఆ రెండు పాఠశాలల్లో కొన్నేళ్లుగా ఉపాధ్యాయుల భర్తీ కావడం లేదు. రెండేళ్ల నుంచి వీవీలతోనే నెట్టుకొస్తున్నారు. ఈ విద్యాసంవత్సరంలో ఇంకా వీవీల నియామకం చేపట్టలేదు. దీంతో చదువులు చెప్పేవారు కరువయ్యారు. జీరో పాఠశాలలు మూత పడకుండా ఎంఈవోలు రిసోర్స్ పర్సన్లను, పక్క పాఠశాలల టీచర్లకు డ్యూటీలు వేస్తూ నడిపిస్తున్నారు. అయితే సదరు రిసోర్స్పర్సన్లు, ఉపాధ్యాయులు జీరో పాఠశాలలను నిర్లక్ష్యం చేస్తున్నారు. అంతేకాకుండా ఎంఈవోల పర్యవేక్షణ లేక జీరో పాఠశాలల్లో చదువులు గాడి తప్పుతున్నాయి. గాడితప్పుతున్న విద్యావ్యవస్థ జిల్లాలోని నిజాంసాగర్, పిట్లం, పెద్దకొడప్గల్, మద్నూర్, బిచ్కుంద, జుక్కల్ మండలాల్లో ప్రభు త్వ పాఠశాలలు మారుమూల ప్రాంతాన ఉన్నా యి. మారుమూల గ్రామీణ, గిరిజన తండాల్లోని విద్యార్థులు చదువులకు దూరమవుతున్నారు. ఆయా మండలాల్లోని జీరో పాఠశాలల్లో విద్యావ్యవస్థ గాడితప్పుతోంది. ఆయా మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు కొరతతో విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల లేమితో పాటు ఉపాధ్యాయులు అందుబాటుల లేక ప్రైవేట్ పాఠశాలల వైపు గ్రామీణులు ఆసక్తి చూపిస్తున్నారు. నిజాంసాగర్ మండలంలోని మర్పల్లి, లింగంపల్లి, జక్కాపూర్, తుర్కపల్లి, మల్లూర్‌తండా, పిప్పిరేగడి తండా, నల్లగుట్ట, చెరువుముందుతండా పాఠశాలలు జీరో పాఠశాలలు ఉన్నాయి. పిట్లం మండలంలోని కాటెపల్లి ఉర్దూమీడియం, చిల్లర్గి ఉర్దూమీడియం, మద్నూర్ మండలంలోని మారెపల్లి, జుక్కల్ మండలంలోని బాబుల్‌గావ్, కత్తల్వాడి పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేరు. వీవీల నియామకమెప్పుడో..! జిల్లాలో 1,062 ప్రభుత్వ పాఠశాలలకు 4,916 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. పలు పాఠశాలల్లో 816 టీచర్ పోస్టులు ఖాళీగా ఉండగా గతేడాది 440 వీవీలను ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే గతేడాది 436 మంది వీవీలు మాత్రం పనిచేశారు. ప్రస్తుత విద్యాసంవత్సరం ప్రారంభమైన 20 రోజులు కావస్తున్నా వీవీల ఊసేత్తడం లేదు. దాంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న జీరో పాఠశాలల్లో విద్యాబోధన విద్యార్థులకు అందని ద్రాక్షగా మారింది. -
చెత్త కుప్ప.. ఆదాయం గొప్ప
పాలకవర్గం, అధికారులు దృష్టి సారిస్తే మరింత ఆదాయం అగ్గిపుల్ల.. సబ్బుబిల్ల.. కుక్కపిల్ల.. కవితకు కాదేది అనర్హం అన్నట్లుగా.. సమాజంలో ప్రజలు వినియోగించే ప్రతి వస్తువును తిరిగి ఉపయోగించుకోవచ్చని శాస్త్రవేత్తలు ఏనాడో చెప్పారు. నిత్యం ఇళ్లలో వెలువడే చెత్తను ఊరికి పారేయకుండా పోగు చేసుకుంటే ఆర్థిక లాభాలు ఉంటాయని ఇప్పుడు గ్రేటర్ వరంగల్ పారిశుద్ధ్య కార్మి కులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో అమలువుతున్న తడిపొడి చెత్త సేకరణ, ఆదాయ మార్గాలపై ప్రత్యేక కథనం. వరంగల్ అర్బన్ : ప్రస్తుత కాలంలో సగటు మానవుడి జీవితం యంత్రమయంగా మారింది. ప్రతి పనికి ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్, కాగితపు వినియోగం పెరిగిపోయింది. అయితే వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా మార్కెట్లోకి రోజురోజుకు కొత్త వస్తువులు ప్రవేశిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో రోజు నివాసాల్లో వెలువడే చెత్తతో పాటు పాత వస్తువులు కూడా నిరుపయోగంగా మారుతున్నాయి. ఫలితంగా ఇళ్లలో ఏడాదికి టన్నుల కొద్ది చెత్త పోగవుతోంది. అయితే పనికిరాదని పడేస్తున్న చెత్తను ప్రక్షాళన చేస్తుండడం ద్వారా బల్దియా పారిశుద్ధ్య కార్మికులకు ఆర్థిక భరోసా కలుగుతోంది. రోజు 180 మెట్రిక్ టన్నుల చెత్త డంపింగ్ వరంగల్ మహా నగరపాలక సంస్థ 400 చదరపు కిలోమీటర్లకు పైచిలుకు విస్తరించింది. గ్రేటర్ పరిధిలో 10 లక్షలకు పైచిలుకు జనాభా నివసిస్తున్నారు. వీరంతా నిత్యం ప్లాస్టిక్ వస్తువులు, కాగితం, సీసాలు, ఎలక్ట్రానిక్, ఇనుము విరివిగా వినియోగిస్తున్నారు. దీంతో నగరం నుంచి ప్రతిరోజు మడికొండ డంపింగ్ యార్డుకు 160 నుంచి 180 మెట్రిక్ టన్నుల చెత్త చేరుతోంది. 2000లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అన్ని నగరాల్లో ఘనవ్యర్థాల యాజమాన్యం పేరుతో కేంద్రం కొన్ని మార్గదర్శకాలను రూపొందిం చింది. కాగా, 2012 అక్టోబర్‌లో ఆ నిబంధనలు వరంగల్ క్లిన్‌సిటీ పేరుతో కార్యరూపం దాల్చింది. ఈ క్రమంలో అప్పటి కమిషనర్ వివేక్‌యాదవ్ బదిలీకావడంతో కార్యాచరణ క్రమేపీ నీరుగారింది. 2015 నవంబర్‌లో ఖమ్మం జిల్లా ఐటీసీ లిమిటెడ్ సామా జిక బాధ్యతగా శ్రీఫౌండేషన్, గ్రేటర్ వరంగల్ అధికార యంత్రాంగంతో కలిసి బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఫలి తాలు సాధిస్తోంది. 1.40 లక్షల కుటుంబాలకు అవగాహన గత ఏడాది నవంబర్ నుంచి శ్రీఫౌండేషన్, బల్దియా అధికారులు కలిసి గ్రేటర్ పరిధిలో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఎస్ఎల్ఎఫ్ మహిళలు 18 మందికి శిక్షణ ఇచ్చారు. అనంతరం 18 డీఆర్సీ సెంటర్ల ద్వారా పొడి చెత్త కొనుగోలుకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ఇంటింటా తడి, పొడి చెత్తను వేరు చేసేందుకు సుమారు 1.40 లక్షల కుటుంబసభ్యులకు అవగాహన కల్పిం చారు. అలాగే 900 మంది పారిశుద్ధ్య కార్మికులకు పొడి, తడి చెత్త సేకరణలో సుశిక్షితులుగా తీర్చిదాద్దారు. పర్యావరణానికి దోహదం ఇంటిలో ప్రతి రోజు వెలువడే చెత్తలో ఎక్కువ శాతం పొడి చెత్తనే ఉంటుంది. ఇందులో ప్లాస్టిక్ కవర్లు, చిత్తు కాగితాలే అధికంగా ఉంటాయి. వీటిని రీసైక్లింగ్ చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ఎంతో దోహదపడుతోంది. ఇవే కాకుండా పాత ప్లాస్టిక్ డబ్బాలు, సీసాలను రోజు వారీగా సేకరించి డీఆర్సీ సెంటర్లలో విక్రయిస్తున్నారు. గత ఎనిమిది నెలల్లో ఆయా డీఆర్సీ సెంటర్లలో 420 మెట్రిక్ టన్నుల పొడి చెత్తను కొనుగోలు చేశారు. ఇందులో పొడి చెత్తను రూ. 21 లక్షలకు విక్రయించారు. దీంతో సుమారు 600 మంది పారిశుద్ధ్య కార్మికులకు లబ్ధి చేకూ రింది. అలాగే డీఆర్సీ సెంటర్లలో పొడిచెత్త తూకం వేస్తున్న 18 మంది మహిళలు నెలకు ఒకరు మార్జిన్ మనీగా రూ.5 నుంచి 6 వేల ఆదాయం పొందుతున్నారు. వివిధ కంపెనీల నిర్వాహకులు పొడి చెత్తను కొనుగోలు చేసి తరలించుకుపోతున్నారు. బల్దియా దృష్టి సారిస్తే రూ. కోట్ల ఆదాయం గ్రేటర్ పరిధిలో నిత్యం 160 నుంచి 180 మెట్రిక్ టన్నుల చెత్త వెలువడుతోంది. ప్రధానంగా ట్రైసిటీలోని హన్మకొండ, కాజీ పే ట, వరంగల్ ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్మికులు తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరిస్తున్నారు. ఇందులో కేవలం రెండు మెట్రిక్ టన్నుల చెత్తను మాత్రమే ఆయా డీఆర్సీ సెంటర్లలో విక్రయిస్తున్నారు. అంటే సుమారు రెండు టన్నుల చెత్తకు రూ.10 వేల ఆదాయం పొందుతున్నారు. వాస్తవంగా 36 టన్నుల పొడి చెత్తను సేకరించడం ద్వారా రోజు 1.70 లక్షల ఆదాయం పొందవచ్చు. అంటే సగటున రోజు ఆదాయం వచ్చే 34 మెట్రిక్ టన్నుల చెత్తను మడికొండ డంపింగ్ యార్డులోని గుట్టల్లో వృథాగా కలిపేస్తున్నారు. నగరవాసులకు తడి, పొడి చెత్తపై కొరవడిన అవగాహన, అధికారుల నిర్లక్ష్యం, కొంత మంది బల్దియా పారిశుద్ధ్య సిబ్బంది అలసత్వంతో చెత్త సేకరణ విజయవంతం కావడం లేదని తెలుస్తోంది. కాగా, మడికొండ డంపింగ్ యార్డులో చెత్త గుట్టలుగా పేరుకుపోయి వాతావారణ కాలుష్యాన్ని దెబ్బతీస్తుందని పర్యావరణ వేత్తలు వాపోతున్నారు. అంతేకాకుండా బల్దియాకు నిత్యం వాహనాల ద్వారా చెత్త తరలింపు వ్యయం పెనుభారంగా మారుతోంది. బల్దియా పాలకులు, అధికారులు దృష్టి సారించి ప్రజలకు తడి, పొడి చెత్తపై అవగాహన కల్పిస్తే రూ.కోట్ల లాభాలు వచ్చే అవకాశాలున్నాయి. ప్రజల సహకారంతో విజయవంతం తడి, పొడి చెత్త సేకరణ సామాజిక బాధ్యతతో చేపడుతున్నాం. తడి, పొడి చెత్తను ఇళ్లలోనే వేర్వేరు సంచుల్లో వేసి పారిశుద్ధ్య కార్మికులకు అందజేయాలి. 1.40 లక్షల ఇళ్లల్లో పొడి చెత్త కోసం సంచులను అందజేశాం. నగరంలో ఇప్పటివరకు 900 అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. పొడి చెత్త కొనుగోలుకు ప్రస్తుతం 18 డీఆర్సీలు ఉన్నాయి. మరో 12 సెంటర్లను బల్దియా ఏర్పా టు చేస్తోంది. ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను వేరు చేస్తే కార్యక్రమం విజయవంతమవుతోంది. –గొడిశాల రమేష్, పొడి చెత్త ఆపరేషన్ మేనేజర్