
పోరాటం
మారుతున్న ఈ దేశంలో మారాల్సినవి ఇంకా ఉన్నాయి. మానవ వ్యర్థాలను ఎత్తి పోసే పాకీ పనిని నిషిద్ధం చేయగలిగినా మ్యాన్‌హోల్స్ శుభ్రతకు మురుగు నీటి వ్యవస్థ మరమ్మత్తులకు మనుషులనే ఉపయోగించడం వల్ల వారు అనారోగ్యం పాలై మృత్యువాత పడుతున్నారు. వారిలో చైతన్యం, పొందాల్సిన హక్కుల కోసం పని చేస్తోంది హేమలత కన్సోటియా. ఢిల్లీలో మొదలైన ఈమె ఉద్యమం ఇప్పుడు రాజస్థాన్‌కు చేరి మంచి ఫలితాలను ఇస్తోంది. హేమలత పరిచయం..
‘జూన్‌లో బికనీర్‌లో ముగ్గురు స్కావెంజర్లు మరణించారు... సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తూ. విష వాయువుల వల్ల ఇలా జరిగింది. కేసు ఏం పెట్టలేదు. కొద్ది డబ్బుతో వదిలించుకున్నారు. ఇలా ఎన్నిచోట్ల జరుగుతున్నదో చెప్పలేము. ఈ పరిస్థితి మారాలి’ అంటుంది హేమలత.
ఢిల్లీకి చెందిన హేమలత ప్రస్తుతం రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఉంటూ మాన్యువల్ స్కావెంజర్ల కోసం పని చేస్తోంది. గతంలో ‘మాన్యువల్ స్కావెంజర్స్’ అంటే మానవ వ్యర్థాలను శుభ్రం చేసే వారిని అనేవారు. ఇప్పుడు మ్యాన్‌హోల్స్‌ను, సెప్టిక్ ట్యాంకులను, మురుగు కాల్వలను శుభ్రం చేసే వారికి కూడా వాడుతున్నారు. మొత్తంగా పారిశుధ్య కార్మికుల పనిలో యంత్ర ప్రమేయం అవసరం గురించి హేమలత పోరాటం సాగిస్తున్నారు. ఆమె వాదన వింటే ఎవరికైనా సరే పారిశుద్ధ్య కార్మికుల గురించి ఆలోచన మొదలవుతుంది.
చిన్న వయసు నుంచే
ఢిల్లీకి చెందిన హేమలతకు పద్నాలుగేళ్ల వయసులో చెవి వైద్యం చేయిస్తే అది వికటించి ముఖానికి పాక్షిక పక్షవాతం వచ్చింది. దాంతో ఆమెను తల్లిదండ్రులు పెళ్లి పేరుతో వదిలించుకున్నారు. ఆ పెళ్లి నిలువలేదు. హేమలత భవన నిర్మాత కూలీలతో పని చేస్తూ ఎం.ఏ చదివి కార్మికుల హక్కుల కోసం పని మొదలెట్టింది. 1998 నుంచి ఆమె ఈ పనిలో ఉన్నా 2007లో ఓ కేసు ఆమె దృష్టిని మార్చింది. ఓ నిర్మాణంలో జరిగిన ప్రమాదం కారణంగా ముగ్గురు మరణించారని ఆమెకు చెప్పారు. ఆమె అక్కడికి వెళ్లి చూశాక అసలు విషయం అర్థమైంది.
అక్కడ మ్యాన్ హోల్ శుభ్రం చేసేందుకు వెళ్లి విషవాయువులు పీల్చి ఆ ముగ్గురూ మరణించారు. ఆ ఘటన ఆమె మనసును కదిలించింది. దేశంలో ఇంకా ఇలాంటి ఘటనలు జరుగుతుండటమేమిమటే ప్రశ్న మొదలైంది. పొట్టకూటి కోసం కార్మికులు ఈ ప్రమాదకరమైన పని చేస్తూ మృత్యువు పాలవుతున్నారని ఆమె గుర్తించింది. వారి కుటుంబాలకు నష్టపరిహారం సైతం అందడం లేదనే విషయం ఆమెకి తెలిసింది. ఈ పనులకు ముగింపు పలకాలని భావించి అదే సంవత్సరం దిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసింది.
సమాజం మారాలి
‘ప్రభుత్వ విధానాలు పేపర్ల మీద ఉంటాయి. కాని అవి వాస్తవరూపం దాల్చితేనే ఫలితం’ అంటుంది హేమలత. మ్యాన్‌హోల్స్ శుభ్రం చేస్తూ మరణించిన వారి కుటుంబాలకు ఆమె అండగా నిలబడ్డారు. వారి కాళ్ల మీద వారు నిలబడేలా సాయం అందించాలని భావించారు. అందుకు తగ్గ పనులు మొదలుపెట్టారు. అందుకూ ఆమెకు సమాచార హక్కు చట్టమే తోడ్పాటుగా నిలిచింది. ఆమె కృషి ఫలితంగా ప్రభుత్వ యంత్రాంగం కదిలింది.
మ్యాన్ హోల్స్ శుభ్రం చేస్తూ మరణించిన వారి కుటుంబాలకు సాయం అందించేందుకు సిద్ధమైంది. దీంతోపాటు ఏళ్లుగా ఈ పనిలోనే ఉన్నవారిని ఆ పని మాన్పించి, కొత్త పనులు చేపట్టేలా ప్రభుత్వ పథకాలను వారికి చేరువ చేశారు హేమలత. ఇది మాత్రమే కాదు, నిరుపేద కుటుంబాలకు విద్య, వైద్యం, మౌలిక వసతులు అందే విషయంలోనూ ఆమె క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. సుమారు రెండు వేల మంది చిన్నారులకు సక్రమంగా పోషకాహారం అందేందుకు ఆమె పాటుపడ్డారు.
‘మ్యాన్ హోల్‌లో ఎవరో ఒకరు దిగి శుభ్రం చేయక పోతే ఊళ్లు శుభ్రంగా ఎలా ఉంటాయి?’ అని చాలామంది హేమలతతో వాదిస్తుంటారు. ‘మనిషి జన్మ ఎత్తినవారెవరూ ఇటువంటి పనులు చేయకూడదు. అలా చేయకుండా చూడాల్సిన బాధ్యత సమాజానిది. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఇంత అభివృద్ధి సాధించాం. మురుగు కాల్వ శుభ్రం చేయడానికి ఆ అభివృద్ధిని ఉపయోగించలేమా?’ అని ఆమె ప్రశ్నిస్తారు. యంత్రాలను తీసుకొచ్చి, ఆ కార్మికులకు శిక్షణ ఇచ్చి, వారికి ఉపాధి కల్పించాలని ఆమె అంటున్నారు. తద్వారా దేశం నిజమైన అభివృద్ధి సాధిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మనిషి దిగొద్దు
సామాజిక కార్యకర్త బెజవాడ విల్సన్ తదితరుల కారణంగా అప్పటిదాకా పాకీ పని చేసేవారి గురించి దేశవ్యాప్తంగా చర్చ సాగింది. అయితే మ్యాన్ హోల్స్‌లో దిగి శుభ్రం చేసేవారి గురించి, వారి భద్రత గురించి హేమలత వల్ల తొలిసారి చర్చ మొదలైంది. ఈ క్రమంలో అనేక ప్రాంతాలు తిరిగి అక్కడి కార్మికులతో మాట్లాడారు హేమలత. మురుగుకాల్వలు, మ్యాన్ హోల్స్ వంటి చోట్ల పనిచేసేవారి పట్ల సమాజం ఎంత వివక్షపూరితంగా ఉందనేది తెలిసింది. వారి ప్రాణాలు గాల్లో దీపాలుగా మారాయన్న విషయం వెలుగులోకి వచ్చింది. కోర్టులో సుదీర్ఘ వాదనల అనంతరం 2010లో దిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించింది. మ్యాన్ హోల్స్‌లోకి దిగి మురుగును శుభ్రం చేయడం చట్టవ్యతిరేక చర్య అని ప్రకటించింది.