
చెన్నై: తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలోని ఓల్డ్ పోర్టు వద్ద.. బుధవారం బార్జ్ లోపల బ్యాలస్ట్ ట్యాంక్‌ను శుభ్రం చేస్తుండగా ముగ్గురు పారిశుధ్య కార్మికులు మరణించారు. ట్యాంక్‌లోని విష వాయువును పీల్చడం వల్లనే వారు చనిపోయినట్లు అధికారులు దర్యాప్తులో తెలిపారు.
ఈ ఘటనలో చనిపోయిన కార్మికులు రాజస్థాన్‌కు చెందిన సందీప్ కుమార్ (25), తూత్తుకుడి జిల్లాలోని పున్నకాయల్‌కు చెందిన జెనిసన్ థామస్ (35), తిరునెల్వేలి జిల్లాలోని ఉవరికి చెందిన సిరోన్ జార్జ్ (23)గా గుర్తించారు.
ట్యాంక్‌లో నీరు నిలిచిపోవడం వల్ల విషపూరిత వాయువు పేరుకుపోయాయి. ట్యాంక్‌లోని విషవాయువులను బయటకు పంపించానికి ముందే.. ముగ్గురు వ్యక్తులు సరైన జాగ్రత్తలు తీసుకోకుండానే లోపలికి ప్రవేశించారని భావిస్తున్నారు. అంతే కాకుండా పని అప్పగించడానికి ముందే.. కార్మికులకు ఎటువంటి భద్రతా సామగ్రి ఇవ్వలేదని దర్యాప్తు అధికారులు నిర్ధారించారు.

మొదటి వ్యక్తి లోపలి వెళ్లిన తరువాత ఉలుకూపలుకు లేకుండా ఉండిపోయాడు. అతన్ని వెతుక్కుంటూ వెళ్లిన రెండో వ్యక్తి, రెండో వ్యక్తి కోసం వెళ్లిన మూడో వ్యక్తి.. ముగ్గురు ఈ విషవాయువుల ప్రభావానికి బలయ్యారని అధికారులు వెల్లడించారు. వారి మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తూత్తుకుడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సెంట్రల్ పోలీస్ స్టేషన్‌కు చెందిన డిప్యూటీ సూపరింటెండెంట్ మదన్ నేతృత్వంలోని పోలీసు బృందాలు దర్యాప్తు ప్రారంభించాయి, అయితే ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు.
ఈ సంఘటన తూత్తుకుడి, తిరునల్వేలి జిల్లాల మత్స్యకార గ్రామాలలో ఆగ్రహాన్ని రేకెత్తించింది. పున్నకాయల్, అలందలై, మనప్పాడు, ఉవరి ప్రతినిధులు బార్జ్ యజమాని, కెప్టెన్, బాధ్యులపై హత్య కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌కు ఒక వినతిపత్రం సమర్పించారు. అంతే కాకుండా మృతుల కుటుంబాలు.. మృతదేహాలను స్వీకరించడానికి నిరాకరించాయి. ఒక్కొక్కరికి రూ.4 కోట్లు, మొత్తం రూ.12 కోట్లు పరిహారం చెల్లించాలని పట్టుబట్టారు. కార్మికుల రక్షణ కోసం పరికరాలను అందించడంలో కంపెనీ నిర్లక్ష్యం వహించిందని వారు ఆరోపించారు.