
చర్మాన్ని లోతుగా, సున్నితంగా శుభ్రపరచడానికి, ఎల్లవేళలా తాజాగా ఉంచడానికి సహకరిస్తుంది ఈ సూపర్ ఫేషియల్ వైబ్రేటింగ్ క్లెన్సింగ్ బ్రష్. దీనితో కేవలం క్లీనింగ్ మాత్రమే కాకుండా, మరెన్నో ప్రయోజనాలున్నాయి. ఈ అధునాతన బ్రష్ సున్నితమైన మైక్రో–వైబ్రేషన్‌లను అందిస్తుంది. ఇది చర్మంపై ఉండే మలినాలను పూర్తిగా తొలగిస్తుంది. అంతేకాకుండా, రక్తప్రసరణను ఉత్తేజపరుస్తుంది.
యాంటీ బ్యాక్టీరియల్ సిలికన్‌తో తయారైన ఈ బ్రష్ రీచార్జబుల్ కావడంతో వినియోగించుకోవడం చాలా తేలిక. దీనికి మూడు వైబ్రేషన్ మోడ్‌లు (డీప్ క్లెన్సింగ్, మసాజింగ్, స్కిన్ స్టిమ్యులేటింగ్) ఉండటంతో దీనిని చర్మ సంరక్షణ అవసరాలకు అనుగుణంగా ఉపయోగించుకోవచ్చు. ఎర్గనామిక్ డిజైన్ ఉన్న ఈ మినీ డివైస్ ఆటో–కాంటారింగ్ హెడ్‌తో ప్రత్యేకంగా రూపొందింది.
మేకప్ తొలగించిన తర్వాత, ఈ బ్రష్‌ను తడిపి, నచ్చిన క్లీనింగ్ లోషన్ లేదా క్రీమ్‌ని కొద్దిగా బ్రష్‌కు పూసి అప్లై చేసుకోవాలి. రెండు సెకన్ల పాటు బటన్‌ను నొక్కి ఉంచితే క్లెన్సింగ్ మోడ్ యాక్టివేట్ అవుతుంది. ఆ ఆప్షన్‌తో పరికరం ఆటోమేటిక్‌గా ఆగిపోయే వరకు చర్మాన్ని శుభ్రం చేసుకోవచ్చు. మసాజ్ కోసం, బ్రష్‌ను తిప్పి, బటన్‌ను 2 సెకన్ల పాటు నొక్కి పట్టుకుంటే సరిపోతుంది. అప్పుడే కొన్ని చుక్కల ఫేషియల్ ఆయిల్ అప్లై చేసుకుంటే, ఈజీగా మసాజ్ చేసేస్తుంది. చేతిలో ఇమిడిపోయే ఈ మినీ టూల్ సౌందర్య ప్రియులకు చక్కగా ఉపయోగపడుతుంది.
నిండైన పెదవులకు మెండైన చికిత్స
ఈ రోజుల్లో దొండపండులాంటి నిండైన పెదవుల కోసం అట్టే శ్రమించనక్కర్లేదు. కావాలనుకుంటే, ఇట్టే పొందవచ్చు. ‘ఇంజెక్టబుల్ లిప్ ఫిల్లర్స్’ అనే కాస్మెటిక్ చికిత్సతో కోరిన పెదవులను సొంతం చేసుకోవచ్చు.
జన్యుపరంగా పెదవులు సన్నగా ఉన్నవారికి ఈ చికిత్స మంచి అవకాశమనే చెప్పుకోవాలి. ఈ ఫిల్లర్లలో సాధారణంగా హైయలురోనిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మానికి సహజంగా తేమను అందించి, పెదవులు నిండుగా కనిపించేలా చేస్తుంది. ఈ చికిత్సలో, ముందుగా పెదవులకు మత్తు ఇస్తారు. ఆపై సన్నని సూదితో ఫిల్లర్‌ను పెదవి లోపలికి జాగ్రత్తగా ఇంజెక్ట్ చేస్తారు.
ఇది పెదవుల పరిమాణాన్ని పెంచడమే కాకుండా, వాటి ఆకృతిని మెరుగుపరచడానికి, చిన్న చిన్న ముడతలను తగ్గించడానికి సహాయపడుతుంది. చికిత్స తర్వాత కొద్దిపాటి వాపు కనిపిస్తుంది. కానీ అదంతా కొన్ని రోజుల్లో తగ్గిపోతుంది. ఈ లిప్ ఫిల్లర్ల ప్రభావం సుమారు 6 నుంచి 12 నెలల వరకు ఉంటుంది. అర్హత కలిగిన వైద్య నిపుణులతో మాత్రమే ఈ చికిత్స చేయించుకోవడం క్షేమం.
(చదవండి: చిరునవ్వే సిగ్నేచర్ లుక్!)