సీఎం నివాసాన్ని తాకిన క‌రోనా

Nitish Kumar NieceStaying At His Official Residence,Tests Positive For corona - Sakshi

సీఎం నితీష్ కుమార్ నివాసంలో కరోనా ప్రకంపనలు 

సీఎం మేనకోడలు ఆసుపత్రికి తరలింపు

వెంటిలేటర్ తో కూడిన తాత్కాలిక ఆసుపత్రి

సాక్షి, పట్నా: బిహార్‌లో ఒకపక్క కరోనా వైరస్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండగా స్వయంగా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నివాసంలో వైరస్ ఉనికి ఆందోళనకు తావిచ్చింది. పట్నాలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో ఉంటున్న ఆయన దగ్గరి బంధువుకు కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు అప్రమత్తయ్యారు. (నితీష్‌ కుమార్‌కు కరోనా పరీక్షలు)

సీఎం మేనకోడలికి క‌రోనా పాజిటివ్‌ రావడంతో ఆమెను పట్నా ఎయిమ్స్ లోని ఐసోలేషన్ వార్డుకు త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. సీఎం అధికారిక నివాసాన్ని పూర్తిగా శానిటేష‌న్ చేయించామనీ, ఈ ప్రక్రియ కొనసాగుతుందని సమాచారం. త్వరలోనే సీఎం కుటుంబ స‌భ్యులంద‌రికీ క‌రోనా ప‌రీక్షలు చేయనున్నారు. అలాగే పట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (పిఎంసిహెచ్) నుండి మూడు వేర్వేరు బృందాలను ముఖ్యమంత్రి నివాసానికి తరలించారు. ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి ఉత్తర్వుల ప్రకారం, వెంటిలేటర్‌తో కూడిన తాత్కాలిక ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. వైద్యులు, నర్సులు మూడు షిఫ్టులలో ఇక్కడ పని చేయనున్నారు.

మ‌రోవైపు బిహార్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ చైర్‌పర్సన్ అవధేశ్‌ నారాయణసింగ్ కరోనా బారిన పడటంతో సీఎం నితీష్‌ కుమార్‌ కు ఇటీవల కరోనా పరీక్షలు నిర్వహించారు. శనివారం సీఎంకు కరోనా నెగిటివ్ రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్న సంగతి  తెలిసిందే. కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులలో ఒకరైన నితీష్ కుమార్ నేతృత్వంలోని జెడి (యు) కు చెందిన గులాం ఘౌస్ కూడా  కరోనా పాజిటివ్  వచ్చింది. 

కాగా వైరస్ విజృంభణ నేపథ్యంలో స్పందించిన ప్రతిపక్ష నాయకుడు, ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్ సీఎం నమూనా పరీక్షా ఫలితాలు రెండు గంటల్లో వచ్చేసాయి. కానీ సాధారణ ప్రజలకు  5-7 రోజులు పడుతోందని ఆరోపించారు. పేద ప్రజలు వైద్య సదుపాయాలు లేక అల్లాడుతోంటే, సీఎం నివాసాన్ని ఏకంగా ఆసుపత్రిగా మార్చేసారని విమర్శించారు. రాష్ట్రంలో అటు పరీక్షలూ, ఇటు చికిత్సలు లేవంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. కేసులు విపరీతంగా పెరుగుతున్నా ప్రభుత్వానికి చింత లేదనీ, ఎన్నికలకు సన్నద్ధమవుతోందంటూ ఆరోపించారు. కేసులకు సంబంధించి డేటాను దాచిపెడుతోందని కూడా ఆయన విమర్శించారు. ఇప్పటికైనా స్పందించకపోతే ఆగస్టు-సెప్టెంబర్ నాటికి పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top