
జ్యుడిషియల్ కస్టడీకి తరలిన మహా ఎమ్మెల్యే
ముంబై : ఇంజనీర్‌పై బురద చల్లి అవమానపరిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే నితీష్ రాణే, 18 మంది ఆయన సహచరులను మహారాష్ట్రలోని కంకవలి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి తరలించింది. పీడబ్ల్యూడీ ఇంజనీర్‌ను వేధించి, ఆయనపై బురద విసిరినందుకు అరెస్ట్ చేసిన ఎమ్మెల్యే, ఆయన అనుచరులను జులై 9 వరకూ పోలీస్ కస్టడీకి అప్పగించిన సంగతి తెలిసిందే. కస్టడీ గడువు ముగిసిన అనంతరం మంగళవారం వీరిని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టగా జ్యుడిషియల్ కస్టడీకి న్యాయస్ధానం తరలించాలని ఆదేశించింది. కోర్టు నిర్ణయంతో వీరు బెయిల్‌కు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు లభించింది.
గత వారం ప్రభుత్వ అధికారులు నిర్వహిస్తున్న పనులను పర్యవేక్షించేందుకు తన అనుచరులతో కంకవలి హైవేకు ఎమ్మెల్యే చేరుకున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. పనులు సాగుతున్న తీరుపై ఇంజనీర్ ప్రకాష్ కదేకర్‌ను ఎమ్మెల్యే దూషించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాణే అనుచరులు ఇంజనీర్‌ను హైవే రెయిలింగ్‌కు కట్టివేసి బకెట్లతో బురుద నీటిని చల్లడం వీడియోలో కనిపించింది. అనంతరం వీరి చర్యపై ఇంజనీర్ ప్రకాష్ ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.