భారీ అగ్ని ప్రమాదం : 17 మంది మృతి | Nine Killed as Fire Breaks out in Cracker Factory in Delhi | Sakshi
Sakshi News home page

17 మంది ఆహుతి

Jan 20 2018 8:33 PM | Updated on Sep 5 2018 9:47 PM

Nine Killed as Fire Breaks out in Cracker Factory in Delhi - Sakshi

న్యూఢిల్లీ: రాజధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. బవానా పారిశ్రామిక ప్రాంతంలోని ఓ బాణ సంచా కర్మాగారంలో శనివారం సాయంత్రం మంటలు ఎగిసిపడి 17 మంది మృత్యువాతపడ్డారు. ఇందులో 10 మంది మహిళలు ఉన్నారు. మరో 30 మంది గాయాలపాలయ్యారు. ఊపిరాడక లేదా మంటల్లో సజీవంగా దహనమై వారు చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన భవనం నుంచి 17 మృతదేహాలను వెలికితీశామని అగ్నిమాపక అధికారి ఒకరు తెలిపారు. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు.

సహాయక చర్యలకు 10 ఫైరింజన్లు...
బాణసంచా నిల్వ ఉంచిన గోదాములో మొదలైన మంటలు దాని పైఅంతస్తులో ఉన్న రబ్బరు ఫ్యాక్టరీలోకి విస్తరించినట్లు తెలిసింది. ప్రమాదానికి కారణం ఇంకా తెలియరాలేదు. సహాయక చర్యలను ముమ్మరం చేసిన అగ్నిమాపక శాఖ సిబ్బంది కర్మాగారంలో పనిచేస్తున్న కార్మికులను బయటికి పంపించారు. ప్రస్తుతానికైతే మంటలను పూర్తిగా అదుపుచేశామని అగ్ని మాపక శాఖ అధికారులు తెలిపారు. బవానా పారిశ్రామిక ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు సాయంత్రం 6.20 గంటలకు తమకు సమాచారం అందిందని, వెంటనే సంఘటనా స్థలికి 10 ఫైరింజన్లను పంపినట్లు వెల్లడించారు.

మంటలను ఆర్పివేయడానికి సుమారు 3 గంటలు పట్టిందని పేర్కొన్నారు. ఆ భవనంలో సెల్లార్, గ్రౌండ్‌ ఫ్లోర్, దానిపైన మరో రెండు అంతస్తులున్నాయి. సెల్లార్‌లో ఒక మృతదేహం, గ్రౌండ్‌ ఫ్లోర్‌లో మూడు, మొదటి అంతస్తులో 13 మృతదేహాలను కనుగొన్నట్లు ఢిల్లీ ఫైర్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ జీసీ మిశ్రా వెల్లడించారు. మంటలు ఎగిసిపడిన సెక్టార్‌5 లోని ఎఫ్‌–83కి పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది, అంబులెన్స్‌లను తరలించామని, ప్రమాదానికి నిర్దిష్ట కారణం ఇంకా తెలియరాలేదని డీసీపీ రజనీశ్‌ గుప్తా తెలిపారు. ప్రాణాలు కాపాడుకోవడానికి రెండో అంతస్తు నుంచి దూకిన ఓ వ్యక్తి గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఉత్తర ఢిల్లీ మేయర్‌ ప్రీతి అగర్వాల్‌ ప్రమాదం జరిగిన చోటును సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. అగ్ని ప్రమాదంపై సమగ్ర విచారణకు ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.  

మోదీ, కేజ్రీవాల్‌ విచారం...
ఈ సంఘటనపై విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ..మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని మోదీ ఆకాంక్షించారు. ప్రమాదంలో మృతుల సంఖ్య ఎక్కువగా ఉండటం దురదృష్టకరమని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement