జల ప్రళయంలో జాలర్లు | New system to bring heavy rain to Chennai from Tuesday | Sakshi
Sakshi News home page

జల ప్రళయంలో జాలర్లు

Dec 3 2017 2:10 AM | Updated on Dec 3 2017 3:04 AM

New system to bring heavy rain to Chennai from Tuesday - Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై/తిరువనంతపురం: ఓక్కి తుపాను కేరళ, తమిళనాడుల్లోని మత్స్యకారకుటుంబాల్లో పెను ప్రళయాన్ని నింపింది. సముద్రంలో వేటకెళ్లిన చాలామంది జాలర్ల జాడ తెలియటం లేదు. దీంతో వీరి కుటుంబాల్లో పెను విషాదం నెలకొంది. ఇప్పటివరకు ఇరురాష్ట్రాల్లో కలసి 513 మంది మత్స్యకారులను కాపాడినట్లు అధికారులు తెలిపారు. ఒక్క తమిళనాడు నుంచే మరో 400 మంది సముద్రంలో చిక్కుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. వీరిని కాపాడేందుకు నేవీ, ఎయిర్‌ఫోర్స్, కోస్టుగార్డ్‌ సమన్వయంతో పనిచేస్తున్నాయి.

సముద్రంలో ఇంత భయానక పరిస్థితులను ఎప్పుడూ చూడలేదని ప్రాణాలతో బయటపడ్డవారంటున్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో పడవలు బోల్తాపడి చాలా మంది గల్లంతయ్యారు. ఆధారం దొరికిన వారు రాకాసి అలల మధ్య తిండీతిప్పల్లేకుండా సాయం కోసం అర్థిస్తూ నిరాశ, నిస్పృహలతో వేచిచూశారు. 60 మందిని జపాన్‌కు చెందిన కార్గోనౌక రక్షించింది. వీరందరినీ ఆసుపత్రుల్లో చేర్పించి చికిత్సనందిస్తున్నా షాక్‌నుంచి ఇంకా తేరుకోలేదని అధికారులు తెలిపారు.

మరోవైపు, దక్షిణ తమిళనాడులోని జిల్లాల్లో ఈదురుగాలులు తగ్గినా వర్షం కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గల్లంతైన వారి జాడ కోసం 8 యుద్ధనౌకలు, 6 విమానాలు, 2 హెలికాప్టర్లు గాలిస్తున్నాయని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. కేరళలో ఓక్కి ప్రభావంతో మృతిచెందిన వారి సంఖ్య 9కి పెరిగింది. మరోవైపు, ఓక్కి ప్రభావంతో తమిళనాడు, కేరళకు చెందిన 66 బోట్లు మహారాష్ట్ర తీరానికి కొట్టుకొచ్చాయని.. ఇందులోని 952మంది క్షేమంగానే ఉన్నారని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

పొంచిఉన్న ‘సాగర్‌’ ముప్పు
దక్షిణ తమిళనాడును వణికించిన ఓక్కి తుపాను తీరందాటగానే ఉత్తర తమిళనాడుకు ‘సాగర్‌’ తుపాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడుతున్న మరో వాయుగుండం తుపానుగా మారి ఈనెల 4, 5, 6 తేదీల్లో చెన్నై తీరాన్ని తాకనుందని చెన్నై వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ సమయంలో ఉత్తర తమిళనాడులో భారీ, అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఓక్కి కారణంగా దక్షిణ తమిళనాడులో వేల ఎకరాల్లో పంటనష్టం జరిగింది. సాగర్‌ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

వణుకుతున్న లక్షద్వీప్‌
తమిళనాడు, కేరళలను వణికించిన ఓక్కి తుపాను లక్షద్వీప్‌ ద్వీపాన్నీ అతలాకుతలం చేసింది. ఈదురుగాలుల కారణంగా తీరప్రాంతాల్లోని ఇళ్లన్నీ తీవ్రంగా ధ్వంసమవగా కొబ్బరిచెట్లు కూకటి వేళ్లతో సహా నేలకూలాయి. గాలులతోపాటు భారీ వర్షం కారణంగా లక్షద్వీప్‌లోని దాదాపు అన్ని దీవుల్లో సమాచార వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. మరో 24 గంటలపాటు ఇవే పరిస్థితులు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరించింది.  

56 ఏళ్ల తర్వాత
సహజంగా కన్యాకుమారి సముద్రతీరంలో వాయుగుండం ఏర్పడదు. 1962లో మన్నార్‌వలైకుడాలో ఏర్పడిన వాయుగుండం ధనుష్కోటిని తాకి మొత్తం దక్షిణ తమిళనాడును కుదిపేసి భారీనష్టానికి దారితీసింది. ఇప్పుడు.. 56 ఏళ్ల తరువాత ఓక్కి తుపాను కన్యాకుమారి సహా పలు జిల్లాలను బాధించింది. కాగా, తుపాను నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడు సీఎం పళనిస్వామితో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితప్రాంతాలు కోలుకునేలా కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తుందని మోదీ భరోసా ఇచ్చారు. అటు కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్, నిర్మలా సీతారామన్‌ కూడా తమిళ ప్రభుత్వానికి అండగా నిలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement