ఎమ్మెల్యేలపై వేటు; నూతన సీఈసీ ఆసక్తికర వ్యాఖ్యలు

new CEC Om Prakash Rawat comments on AAP MLAs disqualification - Sakshi

న్యూఢిల్లీ : రాజకీయంగా పెనుదుమారం రేపిన ‘20 మంది ఆప్‌ ఎమ్మెల్యేల అనర్హత’ వ్యవహారంపై నూతన ఎన్నికల ప్రధానాధికారి(సీఈసీ) ఓం ప్రకాశ్‌ రావత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘కనీసం మేం చెప్పేది ఆలకించకుండా వేటు వేశార’న్న ఆప్‌ వాదనను ఆయన తోసిపుచ్చారు. ‘‘వివరణ ఇవ్వాల్సిందిగా ఈసీ ఇచ్చిన రెండు అవకాశాలను వారు(ఆప్‌) వినియోగించుకోలేదు’’ అని కుండబద్దలుకొట్టారు. మంగళవారం పదవీబాధ్యతలు చేపట్టనున్న రావత్‌.. సోమవారం పలు జాతీయ వార్తా సంస్థలతో మాట్లాడారు.

రెండు ప్లస్‌ రెండు నాలుగే : సీఈసీ రావత్‌ చెప్పినట్లు.. అనర్హత అంశంపై వివరణ కోరుతూ ఈసీ.. 20 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు పంపింది. 2017 సెప్టెంబర్‌ 28న మొదటి, నవంబర్‌2న రెండోసారి నోటీసులు జారీ అయ్యాయి. కాగా, ఆమ్‌ ఆద్మీ పార్టీ.. ఈసీ  నోటీసులకు బదులివ్వకుండా, ఏకంగా కేసు విచారణనే నిలిపేయాలని కోరింది. సరిగ్గా ఈ సాంకేతిక అంశమే ఈసీ కఠిననిర్ణయానికి దోహదపడింది. ‘‘నోటీసులకు సమాధానం చెప్పకుండా వాళ్లు(ఆప్‌).. మమ్మల్ని(ఈసీని) నిలువరించే ప్రయత్నం చేశారు. ఆ విధంగా వారు రెండు సార్లూ అవకాశాలను వదులుకున్నారు. ముందు మాకు చెప్పాల్సింది చెప్పి, వారు కోరేది అడగొచ్చు. కానీ అలా జరగలేదు. రెండుకు రెండు తోడైతే నాలుగే అవుతుంది కదా! అసలు విచారణే వద్దని వాదించడం సమంజసం కాదు కదా!’ అని సీఈసీ రావత్‌ వ్యాఖ్యానించారు.

అసలేం జరిగింది? బ్రీఫ్‌గా.. : 2015 జనవరిలో బంపర్‌ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన ఆప్‌.. నిబంధనల ప్రకారం ఏడుగురికి మాత్రమే మంత్రి పదవులిచ్చి, మరో 20 మంది ఎమ్మెల్యేలను మంత్రులకు పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించింది. అయితే, ఆ నియామకాలు చెల్లబాటుకావంటూ ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పడంతో.. ఆరు నెలలు తిరగముందే ఆ 20 మంది అదనపు పదవులు ఊడిపోయాయి. ‘పార్లమెంటరీ కార్యదర్శులను తొలగించరాదం’టూ ఢిల్లీ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని సైతం రాష్ట్రపతి కొట్టివేశారు. కాగా, కొంతకాలమే అయినా వారు లాభదాయక పదవులు నిర్వహించారు కాబట్టి ఆ 20 మందిని అనర్హులుగా ప్రకటించాలని యువన్యాయవాది ప్రశాంత్‌ పటేల్‌.. నాటి రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. విచారణ నిమిత్తం రాష్ట్రపతి ఆ ఫిర్యాదును ఈసీకి పంపారు. నాటి సీఈసీ నదీం జైదీ నేతృత్వంలో పూర్తి ప్యానెల్‌(జైదీతోపాటు ఈసీలు ఏకే జోతి, ప్రకాశ్‌ రావత్‌) ఆప్‌ ఎమ్మెల్యేల కేసును విచారించింది. అయితే, ప్రకాశ్‌ రావత్‌ బీజేపీ మనిషని, ఆయన పక్షపాతంతోనే వ్యవహరిస్తారని ఆప్‌ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ సంచలన ఆరోపణలు చేశారు. విమర్శల నేపథ్యంలో రావత్‌.. విచారణ నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నారు. జైదీ పదవీ విరమణ తర్వాత జోతి సీఈసీ కావడంతో రెండో స్థానంలో ఉన్న రావత్‌ మళ్లీ తప్పనిసరిగా కేసు విచారణలో పాల్గొనాల్సివచ్చింది. చివరికి జోతి పదవీవిరమణకు రెండు రోజుల ముందు.. ఈసీ విచారణను ముగించింది. 20 మంది ఆప్‌ ఎమ్మెల్యేలపై వేటు వేయాలంటూ రాష్ట్రపతికి సూచించింది. అలా అనర్హులైన 20 మంది.. సుప్రీంకోర్టును ఆశ్రయించే ప్రయత్నంలో ఉన్నారు. జోతి వారసుడిగా రావత్‌ సీఈసీ పదవిని చేపడతారు. ఆనయ నేతృత్వంలోనే ఖాళీ అయిన ఆ 20 స్థానాలకు 6నెలల్లోపు ఉప ఎన్నికలు జరుగుతాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top