
న్యూఢిల్లీ: సీనియర్ ఐఏఎస్‌ల పనితీరు మదింపునకు కేంద్రం త్వరలో కొత్త విధానాన్ని తీసుకురానుంది. దీనిపై రూపొందించిన ముసాయిదాను కేంద్ర సిబ్బంది మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్య కార్యదర్శులకు పంపించింది. దీని ప్రకారం.. కార్యదర్శులు, అదనపు కార్యదర్శుల స్థాయి అధికారుల పనితీరు అంచనాకు ఇతర అంశాలతోపాటు సమాజంలోని బలహీన వర్గాల ప్రజలతో వ్యవహరించేటప్పుడు వారి వైఖరిని కూడా పరిగణనలోకి తీసుకోనుంది. సమయానుకూలంగా, ప్రభావవంతంగా నిర్ణయాలు తీసుకోవటంలో వారి సామర్థ్యాన్ని లెక్కలోకి తీసుకోనుంది. విధుల పట్ల బాధ్యతగా వ్యవహరించటం, నమ్మిన అంశాలకు ధైర్యంగా కట్టుబడి ఉండటం, వినూత్నంగా ఆలోచించటం, నాయకత్వ లక్షణాలు, సహకారం, సమన్వయం అంశాలకు సంబంధించి 50 పదాలకు మించకుండా వారి నుంచి అభిప్రాయాల్ని సేకరించనుంది.