‘ఆప్‌ది నీచ సంస్కృతి’

On Swastik, Broom Tweet Bjp and Netizans Fired On Kezriwal - Sakshi

న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ బీజేపీని చిత్తుగా ఓడిస్తుందనే అర్థం వచ్చేలా ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తమ పార్టీ గుర్తు చీపురు, హిందూ స్వస్తిక్‌ చిహాన్ని తరుముతున్నట్టుగా ఉన్న ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేయడంపై సోషల్‌ మీడియాలో దుమారం రేగుతోంది. బీజేపీ శ్రేణులే గాక చాలా మంది నెటిజన్లు కేజ్రీవాల్‌ను విమర్శిస్తున్నారు. ఇది ఆప్‌ నీచ సంస్కృతికి నిదర్శనమని పలువురు బీజేపీ నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. ‘అది హిందువుల స్వస్తిక్‌ గుర్తు కాదు.. నిరకుంశ పాలనకు చిహ్నమైన నాజీ చిహ్నమని’ ఆప్‌ దీనిపై వివరణ ఇచ్చినప్పటికీ ఆ పార్టీపై విమర్శల తాకిడి తగ్గకపోవడం విశేషం.

‘అవసరం ఉన్నప్పుడు హిందువులను అక్కున చేర్చుకోవడం.. లేనప్పడు వారిని దూషించడం ఆప్‌కు అలవాటేన’ని బీజేపీ ఎంపీ మనోజ్‌ తివారీ మండిపడ్డారు. హిందువులుగా ఎప్పుడూ శాంతియుతంగానే జీవిస్తామని.. అనవసర ప్రచార ఆర్భాటాలకు తాము ఎక్కువ విలువివ్వమని మనోజ్‌ అన్నారు. ఎంపీ ఎన్నికలు ఉండటంతో ఓటు రాజకీయాల కోసం కేజ్రీవాల్‌ ఇలాంటి దుశ్చర్యలకు దిగుతుంటారని, ఇది ఆయన అధికార దాహాన్ని తెలియజేస్తోందని మనోజ్‌ తివారీ అభిప్రాయపడ్డారు. ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి తజిందర్‌ బగ్గా మాట్లాడుతూ.. ‘కేజ్రీవాల్‌.. మీరు విమర్శించాలనుకుంటే బీజేపీని, ప్రధాని మోదీని, మమ్మల్ని విమర్శించండి.. కానీ హిందూయిజాన్ని అగౌరవపరచకండి. స్వస్తిక్‌ మా హిందువుల పవిత్ర చిహ్నం, మేం దాన్ని ప్రాణపదంగా పూజిస్తామ’ని అన్నారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్‌తో తమ పార్టీ ఎలాంటి పొత్తులు పెట్టుకోబోదని కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌తో జట్టుకు తాము  ప్రయత్నించిగా.. ఆ పార్టీ తమను సరిగా అర్థం చేసుకోలేదని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కవని కేజ్రీవాల్‌ అన్నారు. 

ఢిల్లీలోని 7 లోక్‌సభ స్థానాల్లో పోటీచేసే అభ్యర్థుల వివరాలను వెల్లడించింది. 
ఆ వివరాలు..   

లోక్‌సభ నియోజకర్గం అభ్యర్థి
తూర్పు ఢిల్లీ అతీషీ
ఉత్తర ఢిల్లీ గుగ్గన్‌ సింగ్‌
దక్షిణ ఢిల్లీ రాఘవ్‌ చద్దా
ఈశాన్య ఢిల్లీ దిలిప్‌ పాండే
చాందినీ చౌక్‌ పంకజ్‌ గుప్తా
న్యూఢిల్లీ బ్రిజేష్‌ గోయల్‌
పశ్చిమ ఢిల్లీ బల్బీర్‌ సింగ్‌ జఖ్ఖర్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top