ఆధారాలు లేవు.. కాబట్టి వారంతా నిర్దోషులే! | Nasik Sessions Court Verdict On Fake Stamp Scam Case Says Abdul karim Telgi Acquitted | Sakshi
Sakshi News home page

తెల్గీ సహా అందరూ నిర్దోషులే!

Jan 1 2019 9:38 AM | Updated on Jan 1 2019 9:44 AM

Nasik Sessions Court Verdict On Fake Stamp Scam Case Says Abdul karim Telgi Acquitted - Sakshi

కూరగాయల వ్యాపారం నుంచి వేల కోట్ల స్థాయికి ఎదిగిన కరీం తెల్గీ

సాక్షి, ముంబై : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వేల కోట్ల రూపాయల నకిలీ స్టాంపు పేపర్ల కుంభకోణం నిందితులంతా నిర్దోషులేనని నాసిక్‌ సెషన్స్‌ కోర్టు తీర్పునిచ్చింది. సీబీఐ దర్యాప్తు చేస్తున్న ఈ కేసులో ప్రధాన నిందితుడు అబ్దుల్‌ కరీం తెల్గీ, మరో ఏడుగురికి వ్యతిరేకంగా సరైన ఆధారాలు లభించలేదని పేర్కొంది. 2004లో నకిలీ స్టాంపుల రాకెట్‌ నడుపుతున్నాడన్న ఆరోపణలపై తెల్గీని పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో సుమారు రూ.32 వేల కోట్ల మేర స్టాంపుల విక్రయం జరిగింది. కాగా, వేరే కేసుల్లో దోషిగా తేలడంతో కోర్టు 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తెల్గీ గతేడాది బెంగళూరులోని జైలులో చనిపోయాడు.

జైలు జీవితం నేర్పిన ఫోర్జరీ పాఠాలు
సాధారణ రైల్వే ఉద్యోగి కుమారుడైన కరీం తెల్గీ 2001లో అరెస్టయ్యే వరకూ రాజకీయ నాయకులు, పోలీసుల సాయంతో అనేక రాష్ట్రాల్లో అక్రమ సామ్రాజ్యాన్ని విస్తరించాడు. అతడి నకిలీ అక్రమాల విలువ దాదాపు రూ.20వేల కోట్లు. దేశ ఆర్థిక మార్కెట్లను కుదిపేసిన ఈ అక్రమాల తీవ్రత దాదాపు రూ.33వేలకోట్లు. కర్ణాటకలోని బెలగావి జిల్లా ఖానాపూర్‌కు చెందిన తెల్గీ చిన్నతనంలో రైళ్లలో కూరగాయలు, పళ్లు అమ్మేవాడు. బెలగావి కాలేజీ నుంచి బీకాం డిగ్రీ సంపాదించాక సౌదీకి వెళ్లాడు. అక్కడ దాదాపు ఏడేళ్లు గడిపి తిరిగి ముంబైకి చేరాక అండర్‌ వరల్డ్‌ మాఫియాతో సంబంధాలు పెట్టుకున్నాడు. యువకులను దుబాయ్‌ పంపిస్తానని మోసగించిన కేసులో ముంబై పోలీసులు 1991లో తెల్గీని అరెస్ట్‌ చేశారు. అక్కడే అతని జీవితం మలుపు తిరిగింది. నకిలీ షేర్ల కేసులో శిక్ష పడ్డ రామ్‌ రతన్‌ సోనీ నుంచి తెల్గీ ఫోర్జరీ మెళకువలు నేర్చుకున్నాడు. జైలునుంచి బయటికొచ్చేందుకు అధికారులకు లంచమిచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి.

తెల్గీ అక్రమ సామ్రాజ్య విస్తరణ
రాజకీయ నాయకులు,  సెక్యూరిటీ ప్రెస్‌ అండతో 1994లో స్టాంప్‌ పేపర్‌ లైసెన్స్‌ సంపాదించిన తెల్గీ ముంబై మింట్‌ రోడ్డులో కార్యాలయాన్ని ఏర్పాటు చేశాడు. రెవెన్యూ శాఖ, స్టాంప్‌ కార్యాలయం, నాసిక్‌ సెక్యూరిటీ ప్రెస్‌లోని అధికారులతో స్నేహం పెంచుకున్నాడు. తనకున్న రాజకీయ సాన్నిహిత్యంతో నాసిక్‌ ప్రెస్‌లో యంత్రాల్ని పనికిరానివిగా ప్రకటించేలా చేసి వాటిని సొంతం చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. వాటిని కొని ముంబైలోని తన కార్యాలయంలో స్టాంపు పేపర్ల ముద్రణ ప్రారంభించాడు. నాసిక్‌ ప్రెస్‌ భద్రతా అధికారుల సాయంతో స్టాంపుల ముద్రణ రంగుల్ని సంపాదించిన తెల్గీ... 350 మంది ఏజెంట్ల సాయంతో భారీ స్థాయిలో నకిలీ స్టాంపుల కుంభకోణాన్ని కొనసాగించాడు. వారు బ్యాంకులు, బీమా కంపెనీలు, స్టాక్‌ బోక్రరేజ్‌ సంస్థలు, కార్పొరేట్‌ కార్యాలయాలకు పెద్ద మొత్తంలో నకిలీ స్టాంపుల్ని విక్రయించేవారు. అధికారంలో ఉన్న నేతలు, పోలీసు అధికారుల సహకారంతో తెల్గీ ఈ వ్యాపారాన్ని నిరాటంకంగా కొనసాగించినట్లు దర్యాప్తు సంస్థల విచారణలో తేలింది. నార్కో పరీక్షల్లో అతడు అనేకమంది ప్రముఖుల పేర్లను కూడా వెల్లడించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement