దోచుకున్నది కక్కిస్తాం!

దోచుకున్నది కక్కిస్తాం! - Sakshi


ప్రజల సొమ్మును లూటీ చేసిన వారిని వదలం

► పన్ను ఎగవేసే కంపెనీలకు ప్రధాని హెచ్చరిక

►  సీఏల సంతకం విలువైంది.. దుర్వినియోగం చేయొద్దు




న్యూఢిల్లీ: ప్రజల సొమ్మును లూటీచేసిన వారంతా తిరిగి ప్రజలకు ఆ మొత్తాన్ని అందజేయాల్సిందేనని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఇకపై తప్పుడు లెక్కలు చూపించే, పన్ను ఎగవేసే కంపెనీలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నోట్లరద్దు తర్వాత అక్రమాలకు పాల్పడినట్లు తేలిన లక్షకు పైగా కంపెనీల రిజిస్ట్రేషన్లను రద్దుచేశామని స్పష్టం చేశారు. నల్లధనాన్ని దాచటంలో సహకరించినవారిపైనా కొరడా ఝుళిపిస్తామన్నారు.ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టెడ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ) వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్‌ స్టేడియంలో శనివారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో సీఏలను ఉద్దేశించి మోదీ మాట్లాడారు.


‘మీ క్లయింట్లను పన్ను పరిధిలోనుంచి బయటపడేశామని గొప్పలు చెప్పుకోవటం కన్నా.. వారంతా పన్ను చెల్లించేలా పనిచేస్తామని ప్రతిజ్ఞ చేయాలి’ అని సీఏలకు ప్రధాని సూచించారు. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్‌ పథకంతోపాటుగా దేశాన్ని లూటీ చేసిన వారినుంచి భారత ఆర్థిక వ్యవస్థను స్వచ్ఛ పరిచే కార్యక్రమాన్ని కూడా చేపట్టిందన్నారు. ఓ రాజకీయ పార్టీగా ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవటం కష్టమేనని అయితే.. దేశం కోసం ఎవరో ఒకరు చొరవతీసుకుంటేనే ముందడుగు పడుతుందని మోదీ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఏలతోపాటుగా ఆర్థికమంత్రి జైట్లీ, జీఎస్టీ కౌన్సిల్‌ సభ్యులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.



అంతా సీఏల చేతుల్లోనే!

జీఎస్టీ అమల్లో తద్వారా నవభారత నిర్మాణంలో సీఏల పాత్ర కీలకమని మోదీ అన్నారు. ‘దేశాభివృద్ధిలో మీరంతా భాగస్వాములు కావాలి’ అని ప్రధాని పిలుపునిచ్చారు. ‘అప్పుడు స్వాతంత్య్ర పోరాటంలో చాలా మంది న్యాయవాదులు కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు దేశ ఆర్థిక ప్రగతి ప్రయాణంలో సీఏలు కూడా మూలస్తంభంగా నిలవాలి’ అని ప్రధాని కోరారు. దశాబ్దాలుగా ప్రజల సొమ్మును లూటీ చేస్తున్న వారు.. ఆ మొత్తాన్ని తిరిగి ప్రజలకు చెల్లించాల్సిందేనన్నారు. నోట్లరద్దు నిర్ణయం వెలువడిన తర్వాత అందరికన్నా ఎక్కువగా కష్టపడి పనిచేసింది సీఏలేనని చమత్కరించారు.


నల్లధనం ఉన్న వారిని గుర్తించినట్లయితే.. సీఏలు వారిని హెచ్చరించాలని మోదీ సూచించారు. ‘దేశవ్యాప్తంగా ఏడాదికి రూ.10లక్షల ఆదాయం దాటిన వాళ్లు కేవలం 32 లక్షల మందే ఉన్నారని లెక్కలు చెబుతున్నాయి. కానీ కొన్ని కోట్ల మంది ఉన్నతశ్రేణి ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ఉన్నారు. రెండున్నరకోట్ల మంది విదేశీ పర్యటనలకు వెళ్లారు. వీరందరి సంగతేంటి’ అని మోదీ ప్రశ్నించారు. గత 11 ఏళ్లుగా దేశంలో అక్రమాలకు పాల్పడిన సీఏలపై విచారణ సందర్భంగా కేవలం 25 మందినే దోషులుగా గుర్తించారని.. కేవలం ఇంతమందే అక్రమాలకు పాల్పడ్డారా అనే అనుమానం వస్తుందన్నారు. చాలా ఏళ్లుగా సీఏలకు సంబంధించి 1,400 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తుచేశారు.



ఒక్కదెబ్బతో లక్ష కంపెనీలు ఔట్‌!

పెద్దనోట్ల రద్దు నిర్ణయం తర్వాత 3 లక్షలకుపైగా రిజిస్టర్‌ అయిన కంపెనీల లావాదేవీలు అనుమానాస్పదంగా గుర్తించామని మోదీ తెలిపారు. ‘డీమానిటైజేషన్‌ తర్వాత అక్రమాలకు పాల్పడినట్లు తేలిన లక్ష కంపెనీల రిజిస్ట్రేషన్‌ను ఒక్కదెబ్బతో రద్దుచేశాం. మరో 37వేల షెల్‌ కంపెనీలను గుర్తించాం. వాటిపైనా కఠినమైన చర్యలు తప్పవు’ అని మోదీ హెచ్చరించారు.


సీఏలు సమాజ ఆర్థిక ఆరోగ్యాన్ని కాపాడటాన్ని బాధ్యతగా తీసుకోవాలని కోరారు. క్లయింట్లు నిజాయితీగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. సీఏల ఒక్క తప్పుడు ఆడిట్‌ కారణంగా లక్షల మంది ఇన్వెస్టర్ల జీవితాలపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. ‘మీ సంతకం ప్రధాని సంతకం కంటే శక్తివంతమైంది. మీ సంతకాన్ని ప్రభుత్వం కూడా విశ్వసిస్తుంది. అందుకే దీన్ని సరిగ్గా వినియోగిస్తూ.. కోట్లమంది ప్రజల సొమ్ము అవినీతిపరుల పాలుకాకుండా కాపాడాల్సిన బాధ్యత మీదే. మీ సంతకాన్ని దుర్వినియోగం చేయకండి’ అని ప్రధాని సూచించారు.



‘స్విస్‌’ లో తగ్గిన జమ

కేంద్ర ప్రభుత్వం నవంబర్‌ 8న నోట్లరద్దు చేపట్టాక స్విస్‌ బ్యాంకుల్లో భారతీయులు జమచేసుకునే డబ్బు 45 శాతం తగ్గిందని మోదీ వెల్ల డించారు. గతంలో కన్నా 2013లో (యూపీఏ హయాం) పెద్దమొత్తంలో భారతీయుల డబ్బు పలు అకౌంట్లలో జమైందన్నారు. వచ్చే రెండేళ్లలో స్విట్జర్లాండ్‌ అధికారులు భారత్‌కు సమాచారం ఇవ్వటం మొదలుపెట్టాక నల్లధనం దాచుకున్న వారంతా ఇబ్బందులు పడతారని మోదీ సుతిమెత్తగా హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాలుగు అతిపెద్ద అకౌంటింగ్‌ సంస్థల్లో ఒక్క భారత సంస్థ కూడా లేకపోవటం బాధాకరమన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top