
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన నృపేంద్ర మిశ్రా పదవీ విరమణ కార్యక్రమం ఢిల్లీలో ఘనంగా జరిగింది. ఆయన గత ఐదేళ్ల పాటు కేంద్ర ప్రభుత్వంలో సీనియర్ అధికారిగా సేవలు అందించారని ‘ప్రభుత్వానికి విలువైన నిధి, కష్టపడి పనిచేసే స్వభావం ఉన్న వ్యక్తి, పని పట్ల ఉండే అంకితభావం గొప్పదని, సీనియర్ పౌర సేవకుడిగా ఆదర్శప్రాయమైన వృత్తిని నిర్వహించారని’ అభినందిస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో కొనియాడింది. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని ‘తాను ఢిల్లీకి వచ్చిన కొత్తలో నృపేంద్ర ఓ గైడ్‌లా వ్యవరించారని, భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకున్న గొప్ప అధికారని, పలు సమస్యలను తన నైపుణ్యంతో పరిష్కరించారని’ కార్యక్రమం అనంతరం మోదీ ట్విటర్‌లో పేర్కొన్నారు. మోదీ ట్వీట్‌పై స్పందించిన నృపేంద్ర.. ‘నూతన భారతదేశ నిర్మాణంలో పనిచేసే అవకాశం లభించిందని భావించినట్టు’ తెలిపారు.
నృపేంద్ర మిశ్ర 1967 బ్యాచ్ ఉత్తర ప్రదేశ్ కేడర్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్. ఆయన టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా, టెలికాం సెక్రటరీ ఆఫ్ ఇండియా, ఎరువుల శాఖకు కార్యదర్శిగా సేవలు అందించారు. 2014లో ప్రధాని మోదీ కార్యాలయంలో ప్రధాన కార్యదర్శిగా చేరడంతో ఆయనకు కేబినెట్ ర్యాంక్ లభించింది. ఆయన టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్)లో పని చేస్తూ పలు నిబంధనలను సవరించారు. అనంతరం 2009లో ట్రాయ్ చైర్మన్‌గా వైదొలిగారు. కాగా ఆయన పదవీ విరమణ పొందినప్పటికీ జూన్ 11న నరేంద్ర మోదీ సార్వత్రిక ఎన్నికల్లో భారీ విజయం సాధించడంతో రెండవసారి ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.