ఎన్‌ఆర్‌సీపై ప్రధాని భరోసా

Narendra Modi assures no Indian citizen will be excluded from NRC - Sakshi

నిజమైన పౌరులందరికీ ఎన్‌ఆర్‌సీలో చోటు

అస్సాం ప్రజలకు ప్రధాని హామీ

ఇంఫాల్‌/సిల్చార్‌: నిజమైన పౌరులందరికీ జాతీయ పౌర రిజిస్టర్‌(ఎన్‌ఆర్‌సీ)లో చోటు దక్కుతుందనిఅస్సాం ప్రజలకు ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. పౌరసత్వ బిల్లుకు త్వరలోనే పార్లమెంటు ఆమోదం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల కోసం ఈశాన్య భారతంలో ప్రచారానికి మోదీ శుక్రవారం అస్సాంలో శంఖారావం పూరించారు. మణిపూర్‌లోనూ ఆయన పర్యటించి పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. అస్సాంలోని సిల్చార్‌ సమీపంలో నిర్వహించిన ‘విజయ సంకల్ప సమావేశం’లో మోదీ మాట్లాడారు. ‘ఎన్‌ఆర్‌సీని రూపొందిస్తున్నప్పుడు అనేకులు ఎదుర్కొన్న ఇబ్బందులు నాకు తెలుసు. కానీ నిజమైన పౌరులెవ్వరికీ అన్యాయం జరగదని నేను మీకు హామీనిస్తున్నా. ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో బీజేపీకి ఓట్లేసినందుకుగాను నేను ఈ రాష్ట్ర ప్రజలకు రుణపడి ఉన్నా’ అని అన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ మొత్తం 100 రోజుల్లో 20 రాష్ట్రాల్లో ప్రచారం నిర్వహించనున్నారు.

పనితీరును మార్చేశాం..
2014లో తాము అధికారంలోకి వచ్చాక దేశంలో ప్రభుత్వ సంస్థలు, ఉద్యోగుల పనితీరును మార్చేశామని మోదీ మణిపూర్‌లో చెప్పారు. ఈ ఈశాన్య రాష్ట్రంలో మోదీ ఎనిమిది కీలక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి మరో నాలుగింటికి శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వాలు శంకుస్థాపనలు చేసి వదిలేసిన రూ. 12 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను మేం ముందుకు తీసుకెళ్లాం. గత 4 దశాబ్దాల్లో మణిపూర్‌కు అభివృద్ధి ఫలాలను నాటి ప్రభుత్వాలు దక్కనివ్వలేదన్నారు. త్వరలో ఈశాన్య రాష్ట్రాల రాజధానుల మధ్య రైల్వే అనుసంధానత కల్పిస్తామని మోదీ చెప్పారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top