పేరుకు ముందు చౌకీదార్‌ను తొలగించిన మోదీ

Narandra Modi Drops Chowkidar Prefix From Twitter Profile - Sakshi

న్యూఢిల్లీ : చౌకీదార్‌ చోర్‌ హై అంటూ ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా అ‍ఖండ భారతావని మరోసారి చౌకీదార్‌కే పట్టం కట్టింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ మరో సారి ఘన విజయం సాధించి రెండో సారి అధికారంలోకి వచ్చింది. ఎన్నికలకు రెండు నెలల ముందు మోదీ ‘మైనే భీ చౌకీదార్‌’ నినాదాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా మోదీతో సహా బీజేపీ నాయకులంతా తమ పేర్లకు ముందు చౌకీదార్‌ అని చేర్చుకున్నారు. ఫలితాల అనంతరం మోదీ తన పేరుకు ముందు చేర్చుకున్న ‘చౌకీదార్‌’ను తొలగించారు.

ఈ విషయం గురించి మోదీ మాట్లాడుతూ.. ‘‘చౌకీదార్‌’ అనే పదాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది. కేవలం ట్విటర్‌ పేరు నుంచి మాత్రమే చౌకీదార్‌ను తొలగించాను. కానీ ఈ పేరు నా జీవితంలో ఒక భాగమయ్యింది. నేను ఈ దేశానికి ‘చౌకీదార్‌’ అనే భావన నా నరనరాన జీర్ణించుకుపోయింది. భారత దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపంచడానికి నిరంతరం కృషి చేస్తాను. మిగతావారు కూడా ఇలానే చేయాలని కోరుకుంటున్నాను’ అని తెలిపారు. అంతేకాక ‘‘చౌకీదార్‌’ అనే పదం చాలా శక్తివంతమైంది. కులతత్వ, మతతత్వ, అవినీతి లాంటి దుష్ట శక్తుల నుంచి కాపాడే గొప్పబాధ్యత చౌకీదార్‌ మీద ఉంది’ అని తెలిపారు.

బీజేపీ ‘చౌకీదార్‌’ నినాదానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌​ ‘చౌకీదార్‌ చోర్‌ హై’ అనే నినాదాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఇవేవి కాంగ్రెస్‌ను ఓటమి నుంచి కాపాడలేకపోయాయి.

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top