
నాగాలాండ్
కోహిమా: దేశవ్యాప్తంగా చట్టసభల్లో మహిళా శక్తి వెల్లి విరుస్తుంటే, నాగాలాండ్ అసెంబ్లీ మాత్రం అందుకు విరుద్ధమైన రికార్డు సొంతం చేసుకుంది. ఇప్పటివరకు ఆ రాష్ట్ర శాసనసభలో మహిళా సభ్యురాలే అడుగుపెట్టకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. జాతీయ అక్షరాస్యత (65 శాతం) కంటే నాగాలాండ్‌లో స్త్రీల అక్షరాస్యత (76 శాతం) ఎక్కువ. 2016 గణాంకాల ప్రకారం... ప్రభుత్వ ఉద్యోగాల్లో 23.5 శాతం, ప్రైవేట్‌రంగంలో 49 శాతం మహిళలు పనిచేస్తున్నారు. 1963లో రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం 30 మంది మహిళలే పోటీ చేసినా అందులో ఒక్కరూ గెలుపొందలేదు. అయితే 1977 లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం రానో ఎం షాజియా అనే మహిళ గెలుపొంది రాష్ట్రం నుంచి పార్లమెంట్‌కు వెళ్లిన ఏకైక మహిళగా నిలిచారు.
ఈసారి బరిలో అయిదుగురే...
ఈ నెల 27న నాగాలాండ్‌లో 60 శాసనసభా స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 227 మంది బరిలో నిలవగా వారిలో కేవలం అయిదుగురే మహిళా అభ్యర్థులున్నారు. బీజేపీ, ఆ పార్టీ మిత్రపక్షం నేషనల్ డెమొక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్‌డీపీపీ)ల నుంచి చెరో మహిళా అభ్యర్థిని పోటీ చేస్తున్నారు. నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ) ఇద్దరిని బరిలో నిలపగా, స్వతంత్ర అభ్యర్థిగా మరొకరు పోటీచేస్తున్నారు. 2013 ఎన్నికల్లో ఇద్దరే మహిళలు పోటీ చేశారు. నాగాలాండ్‌లో గ్రామాభివృద్ధి బోర్డుల్లో మహిళలకు 25 శాతం రిజర్వేషన్లు ఉన్నా ముఖ్యమైన అంశాలపై వారు కీలకంగా వ్యవహరించ లేకపోతున్నారు.
వారికి వారసత్వంగా ఆస్తులను పొందే హక్కు కూడా లేదు. రాష్ట్రంలో మహిళా రిజర్వేషన్ల సాధనకు ‘నాగా మదర్స్ అసోసియేషన్’ (ఎన్‌ఎంఏ) అనే మహిళా సంస్థ న్యాయపోరాటం చేస్తోంది. 2016లో ఈ సంస్థ పిటిషన్ పైనే స్పందించిన సుప్రీంకోర్టు 33 శాతం మహిళా రిజర్వేషన్లతో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పురుషుల ఆధిపత్యంలోని గిరిజన మండళ్లు వ్యతిరేకించడంతో పాటు ఆందోళనలు చెలరేగడంతో అది కార్యరూపం దాల్చలేదు. ‘ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో మేము ఆశించిన మార్పు వస్తుందని నమ్ముతున్నాం. కొందరే పోటీ చేస్తున్నా వారిలో కనీసం ఒకరు గెలుపొంది కొత్తమార్పునకు నాంది పలుకుతారని ఆశిస్తున్నాం ’ అని ఎన్‌ఎంఏ అధ్యక్షురాలు అబేయు మేరు చెప్పారు.