
ముంబైలో భారీ వర్షాలతో స్ధంభించిన జనజీవవం
సాక్షి, ముంబై : భారీ వర్షాలతో ముంబై జలమయమైంది. గురువారం ఉదయం నుంచి కుండపోత వర్షాలతో నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో మోకాలిలోతున నీరు నిలిచిపోయింది. ఖర్, సియోన్, వొర్లి ప్రాంతాలు భారీ వర్షాలకు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో నగరంలో జనజీవనం స్థంభించింది. బొంబయి మున్సిపల్ కార్పొరేసన్ తమ అధికారులకు శని, ఆదివారాల్లో సెలవలను రద్దు చేసింది.
గురువారం నుంచి దక్షిణ మహారాష్ట్ర, కర్ణాటక, గోవాల్లో రుతుపవనాల ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తాయన్న వాతావరణ కేంద్రం అంచనాలతో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. భారీ వర్షాల నేపథ్యంలో జెట్ ఎయిర్‌వేస్‌కు చెందిన లండన్-ముంబై విమానాన్ని గురువారం దారిమళ్లించారు. అధిక వర్షపాతం నమోదవుతున్న ప్రాంతాల ప్రజలు ప్రయాణాలకు దూరంగా ఉండాలని పశ్చిమ రైల్వే ప్రయాణీకులను హెచ్చరించింది.