కుండపోత.. కర్షకుడి కడుపుకోత | Heavy rain causes massive crop damage | Sakshi
Sakshi News home page

కుండపోత.. కర్షకుడి కడుపుకోత

Mar 19 2026 5:10 AM | Updated on Mar 19 2026 5:48 AM

Heavy rain causes massive crop damage

రాష్ట్రంలో గాలివాన బీభత్సం 

నేలవాలిన పంటలు.. నీట మునిగిన కల్లాలు 

పిడుగుపాటుకు నలుగురి మృత్యువాత

సాక్షి, నెట్‌వర్క్‌/సాక్షి, అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో బుధవారం గాలివాన బీభత్సం సృష్టించింది. మధ్యాహ్నం వరకు ఎండ మండిపోగా ఒక్క­సారిగా వాతావరణం మారిపోయి, గాలి దుమా­రం మొదలైంది. కొద్దిసేపటికి ఆకాశం మేఘా­వృతమై ఈదురు గాలులతో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. గాలి­వాన ధాటికి పంటలు నేల వాలాయి. కల్లాల్లో ఆర­బెట్టిన మిర్చి, మొక్కజొన్న తడిచి ముద్దయ్యాయి. ఎన్టీఆర్‌ జిల్లాలోని నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు, మైలవరం నియోజకవర్గాల్లో పంట నష్టం అధికంగా ఉంది. 

అకాల వర్షాలకు అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రాజధాని ప్రాంతం అమరావతిలో వర్షం దంచికొట్టింది. తాడేపల్లి, తుళ్లూరు, తాడికొండ మండలాల్లో వడగండ్ల వాన పడింది. ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో భారీ వర్షంతో డ్రెయిన్లు పొంగిపొర్లాయి. చా­ట్రా­యి మండలంలో వర్షం బీభత్సం సృష్టించింది. ఆగిరిపల్లిలో 24 మి.మీ వర్షపాతం నమోదైంది. అల్లూరి జిల్లా ముంచంగిపుట్టులో భారీ వర్షానికి జీడి, మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. నంద్యాల జిల్లా, ఆత్మకూరు మండలంలో వడగండ్ల వర్షం మినుము, మొక్కజొన్న, మిర్చి, కంది పంటలను కోలుకోలేని దెబ్బతీసింది. 

కందిపంట పూత రాలిపోవటంతో రైతులు కన్నీరుమున్నీరవుతు­న్నారు. తిరుపతి నగరంలో బుధవారం రాత్రి గంటపాటు జోరు వాన కురిసింది. తిరుపతి నగ­రం, తిరుపతి రూరల్‌ మండలం, రేణిగుంట మండ­లాల్లో బుధవారం రాత్రి 8 గంటల నుంచి 9 వరకు కుండపోత వర్షం పడింది. కాగా, రాష్ట్రంలో రానున్న మూడు రోజులు ఓ వైపు ఎండలు, మ­రోవైపు పిడుగులతో కూడిన వర్షాలతో విభిన్న వాతా­వరణం ఉంటుందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వ­హణ సంస్థ ఎండీ ప్రఖర్‌ జైన్‌ వెల్లడించారు. 

ద్రోణి, నైరుతి దిశ నుంచి వీచే గాలుల ప్రభావంతో గురువారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూ­రు, బాపట్ల, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. విశాఖ, అనకాపల్లి, కాకినాడ, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షా­లు కురిసేందుకు అవకాశం ఉందని తెలిపారు.   

కూలీల బతుకులపై ‘పిడుగు’ 
కుండపోత వర్షంతో పిడుగుపాటుకు గురై రాష్ట్రవ్యాప్తంగా నలుగురు మరణించారు. గుంటూరు జిల్లా తుళ్లూరులో పిడుగు పడి శ్రీనివాసరావు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. చేబ్రోలు మండలం కొత్త రెడ్డిపాలెం గ్రామంలో పిడుగుపాటుకు పొలంలో పనిచేస్తున్న ఇరువురికి గాయాలయ్యాయి. 

ప్ర­కా­శం జిల్లా కురిచేడు మండలం వీరపాలెంలో మిర్చి కోతలకు పొలానికి వెళ్లిన కాటూరి సుబ్బరత్నమ్మ పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందింది. బాపట్ల జిల్లాలో పిడుగుపాటుతో పెర­వలి వనజ మృతి చెందింది. వైఎస్సార్‌ కడప జిల్లా  చిన్నాయపల్లెకి చెందిన గుర్రాల నారాయణ రెడ్డి(55) పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement