జన్మాష్టమి రోజు వచ్చే ‘రాక్షసుడి’ కథ!!

Monster Appear To Help Udupi Sick People In Udupi Here Is The Story - Sakshi

కట్‌పడి రవి ... ఓ దినసరి కూలి.. అయితేనేం సాయం చేయాలనే గుణం మాత్రం మెండు.. అందుకే ఏడాదికోసారి భిన్న రూపాల్లో దర్శనమిస్తూ ఉంటాడు. అలా 15 లక్షల రూపాయలు సంపాదించాడు.

మెక్సికన్‌ డ్రామా ‘పాన్స్‌ లేబిరింత్’ సినిమాలో.. తన వాళ్ల  కష్టాలను తీర్చడానికి వనదేవత ప్రత్యక్షమవుతుంది. దుష్టపాలనను అంతం చేసి.. బానిస బతుకులకు విముక్తి కలిగిస్తుంది. అలాగే ‘ద అమేజింగ్‌ స్పైడర్‌’  సినిమాలో ఓ పెద్దబల్లి... అమెరికన్‌ కామెడీ హర్రర్‌ ‘క్రాంపస్‌’  సినిమాలోని మేక ముఖం గల ఓ వింత రాక్షసి ఆకారం... ఇవన్నీ బాగా పాపులర్‌ అయిన సినిమా పాత్రలు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకని పెదవి విరవకండి. ఎందుకంటే ఇటువంటి వింత ఆకారాలే ఎంతో మంది చిన్నారులకు ప్రాణం పోశాయి... పోస్తున్నాయి. అదెలా అనుకుంటున్నారా.. అయితే మీరు రవి కట్‌పడి కథ తెలుసుకోవాల్సిందే..

దినసరి కూలీ ఏం చేయగలడు!?
కర్ణాటకలోని ఉడిపి జిల్లాకు చెందిన 35 ఏళ్ల దినసర కూలీ రవి కట్‌పడి. రోజంతా శ్రమిస్తే అతడికి దక్కే వేతనం 450 నుంచి 550 రూపాయలు. అయితే చికిత్సకు డబ్బులు అందక మరణించే చిన్నారుల గురించి వింటే అతడి మనస్సు చలించిపోయేది. వారికి సాయం చేయాలని ఎంతగానో ఆరాటపడేవాడు. కానీ ఓ దిసనరి కూలీగా అతడేం చేయగలడు? ఎంతమందిని కాపాడగలడనే ప్రశ్నలతో సతమతమయ్యేవాడు. అప్పుడే అతడికి ఓ ఆలోచన తట్టింది. చిన్నారులను కాపాడటం కోసం.. హాలీవుడ్‌ సినిమాల్లోని ఆర్ట్‌వర్క్‌ను ఉపాధి మార్గంగా ఎంచుకున్నాడు. సోషియో ఫాంటసీ సినిమాల్లో ఉండే విభిన్న పాత్రలు ధరించడం అలవాటుగా మార్చుకున్నాడు. 

ప్రతీ ఏడాది శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున.. సరికొత్త రూపంలో దర్శనమిస్తూ... ఉడిపిలోని ఇంటింటికీ తిరుగుతూ.. తన ఆహార్యాన్ని ప్రదర్శించి డబ్బు యాచించేవాడు. అలా 2013 నుంచి సుమారు 15 లక్షల రూపాయలు సంపాదించాడు. ఈ విధంగా వినూత్న వేషధారణతో ముందుకు సాగుతున్న రవి... చిన్నారుల క్యాన్సర్‌ ట్రీట్‌మెంట్‌కు, హృద్రోగులకు, చర్మ సంబంధ వ్యాధులతో బాధపడేవారి చికిత్స కోసం.. ఈ డబ్బునంతా ఖర్చు చేసి పెద్ద మనసు చాటుకున్నాడు.

తనలా ఆలోచించే మరికొందరి సాయంతో..
రవి చదివింది కేవలం తొమ్మిదో తరగతి వరకే. పైగా చేసేది భవన నిర్మాణ కూలీగా.. మోటు పని. మరి ఇలాంటి వ్యక్తి అచ్చంగా హాలీవుడ్‌ క్యారెక్టర్లను పోలి ఉండేలా వేషం వేయడం, అందరినీ ఆకర్షించడం అంత తేలికైన పని కాదు. అందుకే తనలాంటి ఆలోచనలు గల మరికొంత మంది సాయం కోరాడు. వారి సాయంతో ఆర్ట్‌వర్క్‌ టీమ్‌ను తయారు చేసుకుని... 2013 నుంచి సుమారు 15 లక్షల రూపాయలు సంపాదించాడు.

మరిన్ని నిధులు కావాలి..
‘ గతేడాది వరకు రవి కేవలం ఉడిపి వరకే పరిమితమయ్యాడు. కానీ తన ఆశయాన్ని నెరవేర్చుకోవడం కోసం ఈసారి జిల్లా వ్యాప్తంగా పర్యటించాలనుకున్నాడు. ప్రస్తుతం తలసేమియా బాధితుల కోసం 27 లక్షల రూపాయల అవసరం ఉంది. అందుకే సోషల్‌ మీడియాను వినియోగించుకోవాలనుకుంటున్నాం. రవి ఉదారత గురించి వివరిస్తున్నాం. తద్వారా మరికొంత మంది దాతలు ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. దాంతో చిన్నారుల కష్టాలు కాస్తైనా తగ్గుతాయి’ అని రవి ఆర్ట్‌ టీం మెంబర్‌ సుచిత్‌ వ్యాఖ్యానించాడు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top