
ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు
దోషులుగా తేలినా నిక్షేపంగా ప్రజా ప్రతినిధులుగా కొనసాగడానికి వీలు కల్పిస్తూ కేంద్రం చేసిన వివాదాస్పద ఆర్డినెన్స్‌పై వ్యతిరేకత ఉధృతరూపం దాలుస్తోంది.
న్యూఢిల్లీ: దోషులుగా తేలినా నిక్షేపంగా ప్రజా ప్రతిని ధులుగా కొనసాగడానికి వీలు కల్పిస్తూ కేంద్రం చేసిన వివాదాస్పద ఆర్డినెన్స్‌పై వ్యతిరేకత ఉధృతరూపం దాలుస్తోంది. విపక్షాలకు తోడుగా కేంద్ర మంత్రులు కూడా నిరసన గళం విప్పుతున్నారు. ప్రభుత్వ చర్య ప్రజాస్వామ్యంపై ప్రజల విశ్వాసాన్ని అంతం చేస్తుం దని కేంద్ర మంత్రి మిలింద్ దేవ్‌రా వ్యాఖ్యానించారు. ఏదైనా ఒక కేసులో ఒక ప్రజాప్రతినిధిని దోషిగా కింది కోర్టు ప్రకటిస్తే.. పై కోర్టులో అప్పీలు చేసుకుని స్టే తెచ్చుకోవడానికి మూడు నెలల గడువు ఇచ్చే ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనను సుప్రీంకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే.
కానీ, దోషులుగా తేలినా పై కోర్టులో అప్పీలు చేసుకుని ప్రజాప్రతినిధులుగా కొనసాగేందుకు వీలు కల్పిస్తూ కేంద్రం ఆర్డినెన్స్ తెచ్చింది. దీనిపై కేంద్ర మంత్రి దేవ్‌రా తన అభ్యంతరం వ్యక్తం చేశారు. చట్టాన్ని పక్కన పెట్టి దోషులైన ఎంపీలు, ఎమ్మెల్యేలను వారి పదవులలోనే కొనసాగించేలా అనుమతిస్తే ఇప్పటికే ప్రజాస్వామ్యంపై ప్రజల్లో సడలిన విశ్వాసాన్ని అంతం చేస్తుందంటూ దేవ్‌రా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ ఆర్డినెన్స్‌పై ఏకాభిప్రాయం వస్తే మంచిదంటూ ఇప్పటికే కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ పేర్కొన్న విషయం తెలిసిందే.
ఆర్డినెన్స్ చట్టవిరుద్ధం: ఆర్డినెన్స్‌పై సంతకం చేయవద్దంటూ బీజేపీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి విజ్ఞప్తి చేసింది. అగ్రనేత అద్వానీ, లోక్‌సభలో విపక్ష నేత సుష్మాస్వరాజ్, రాజ్యసభలో విపక్షనేత అరుణ్ జైట్లీ గురువారం రాష్ట్రపతిని కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. డిమాండ్‌ను పరిశీలించి ఒక నిర్ణయం తీసుకుంటామని రాష్ట్రపతి తమకు చెప్పినట్లు సమావేశం అనంతరం సుష్మ మీడియాకు తెలిపారు.
మంత్రులకు రాష్ట్రపతి పిలుపు: విపక్షాల అభ్యంతరాల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి షిండే, న్యాయ మంత్రి కపిల్ సిబల్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్‌ను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ పిలిచి ఆర్డినెన్స్‌పై ప్రశ్నలు సంధించారు. ఆర్డినెన్స్ తీసుకురావాల్సిన అవసరంపై ప్రభుత్వ వివరణ వచ్చాక, న్యాయనిపుణుల సలహాలను అనుసరించి నిర్ణయం తీసుకోవాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ఆర్డినెన్స్‌ను ఆయన వెనక్కి పంపే అవకాశాలు కూడా లేకపోలేదని భావిస్తున్నారు.