ప్లాట్‌ఫామ్‌పై ఆహార పొట్లాలు.. ఎగబ‍డ్డ జనం!

Migrant Labourers Shoving Each Other For Food And Water Packets On Platform - Sakshi

పాట్నా: రైల్వే ప్లాట్‌ఫామ్‌పై పడేసిన ఆహారం, నీటి పొట్లాలకోసం పెద్దసంఖ్యలో వలస కార్మికులు ఎగబడ్డారు. భౌతిక దూరాన్ని సైతం పక్కన పెట్టి పొట్లాల కోసం తోసుకున్నారు. ఈ సంఘటన బీహార్‌ రాష్ట్రంలోని సమస్తిపూర్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే. కరోనా వైరస్‌‌ కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌కు సంబంధించిన సడలింపులు అమల్లోకి రావటంతో వలస కార్మికులు సొంత రాష్ట్రాలకు చేరుకునే మార్గం సుగమమైంది. వలస కార్మికుల కోసం ఆయా రాష్ట్రాలు రైళ్లను ఏర్పాటు చేసి మరీ తరలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొద్దిరోజుల క్రితం బీహార్‌కు చెందిన వలస కార్మికులు శ్రామిక్‌ రైలులో రాష్ట్రంలోని సమస్తిపూర్‌కు చేరుకున్నారు. (ఆక‌లి కేక‌లు: కుక్క కళేబరమే ఆహారం)

అక్కడ రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ఫామ్‌పై ఆహారం, నీటి పొట్లాలు పడేసి ఉండటం గమనించిన సదరు కార్మికులు ఒక్కసారిగా వాటి కోసం ఎగబడ్డారు. భౌతిక దూరాన్ని సైతం పట్టించుకోకుండా ఒకరిని ఒకరు తోసుకుంటూ అందిన కాడికి పొట్లాలను తీసుకెళ్లిపోయారు. కథిహార్‌ ఘటన చోటుచేసుకుని రెండు వారాలు గడవకముందే ఈ సంఘటన చోటుచేసుకోవటం గమనార్హం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ( ఇంటి పై క‌ప్పు మీద నాగుపాము)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top