సింగర్‌ చిన‍్మయిపై వేటు : మీటూ ఎఫెక్ట్‌?

Me Too Singer Chinmayi Tamil dubbing union membership axed - Sakshi

ప్రముఖ గాయని, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ చిన్మయి శ్రీపాద మీటూ పేరుతో ఇండియాలో విస్తృతమైన ఉద్యమానికి ఊతమిచ్చిన వారిలో ప్రధాన వ్యక్తిగా  పేర్కొనదగిన వ్యక్తి. ముఖ్యంగా తమిళ సినీరంగంలో పెద్దమనిషిగా, అవార్డు విన్నింగ్‌ రచయితగా, సెలబ్రిటీగా వెలుగొందుతున్న సినీ రచయిత వైరముత్తుపై లైంగిక ఆరోపణలు చేశారు. అంతేకాదు తన లాంటి అనేకమంది బాధితుల గోడును వెలుగులోకి తీసుకొచ్చారు. వారికి మద్దతుగా నిలిచారు. దీంతోపాటు ప్రముఖ నటుడు, తమిళనాడు ఫిలిం డబ్బింగ్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ రాధా రవిపై లైంగిక ఆరోపణలు చేసిన బాధితులకు కూడా చిన్నయి బహిరంగ మద్దతును ప్రకటించిన సంగతి తెలిసిందే.  అదే ఇపుడు ఆమెకు కష్టాలు తెచ్చి పెట్టింది.

తాజాగా తమిళ డబ్బింగ్‌ యూనియన్‌ నుంచి ఆమె సభ్యత్వానికి రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని చిన్నయి ట్విటర్‌ ద్వారా  వెల్లడించారు. తనను డబ్బింగ్‌ యూనియన్‌నుంచి  తొలగించారని ప్రకటించారు. అయితే ఈ రెండు సంవత్సరాలుగా తన డబ్బింగ్‌ ఫీజులోంచి 10శాతం ఎందుకు తీసుకున్నారని ఆమె ప్రశ్నించారు. తనపై వేటు నిర్ణయం కొనసాగితే, తమిళంలో 96లాంటి మంచి సినిమాలో హీరోయిన్‌ త్రిషకు చెప్పిన డబ్బింగ్‌ చివరిది అవుతుందని ఆమె ట్వీట్‌ చేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే తన సభ్యత్వాన్ని తొలగించడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే డబ్బింగ్‌  యూనియన్‌ ద్వారానే తనపై తొలి వేటు  తాను ముం‍దే అంచనా వేశానన్నారు. ఆరోపణలు వచ్చిన రాధారవిపై  ఎలాంటి చర్యలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. అటు ఈ పరిణామంపై నటి మంచు లక్ష్మి కూడా స్పందించారు.

ఇది ఇలా వుంటే ఈ ప్రమాదాన్ని చిన్మయి ముందే ఊహించారు.  తమిళ సినీ రంగంలో పేరొందిన నటుడు, యూనియన్‌ అధ్యక్షుడు రాధా రవి కారణంగా తన  డబ్బింగ్‌ కరియర్‌ ప్రమాదంలో పడనుందంటూ అక్టోబర్‌ 9న ఒక ట్వీట్‌ చేయడం  గమనార్హం.

మరోవైపు గత రెండు సంవత్సరాలుగా డబ్బింగ్‌ యూనియన్‌కు చెల్లించాల్సిన సభ్యత్వ రుసుమును చెల్లించకపోవడమే ఇందుకు కారణంగా  వివరించారు. మరి ఇన్నిరోజులుగా  పలు సినిమాలకు  చిన్మయి డబ్బింగ్‌ ఎలా చెప్పింది అన్న ప్రశ్నకు స్పందించిన సంఘం.. కేవలం పేరున్న ఆర్టిస్ట్‌ అన్నగౌరవంతోనే  ఆమెకు మినహాయింపు నిచ్చినట్టు చెప్పుకొచ్చారు.

కాగా సినీ నేపథ్యగాయనిగానే కాకుండా డబ్బింగ్‌ ఆర్టిస్టుగా చిన్మయి పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా తెలుగులో సమంత, తమిళంలో త్రిషలాంటి హీరోయిన్లకు చిన్మయి తన గొంతును  అరువిచ్చారు.  వారి నటనకు  చిన్మయి డబ్బింగ్‌ ప్రాణం పోసిందంటే అతిశయోక్తి కాదు.

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top