పూర్వాంచల్‌లో పోటాపోటీ | Maurya focuses on BJP's OBC-connect plan in Purvanchal | Sakshi
Sakshi News home page

పూర్వాంచల్‌లో పోటాపోటీ

Mar 4 2017 2:06 AM | Updated on Mar 29 2019 9:31 PM

పూర్వాంచల్‌లో పోటాపోటీ - Sakshi

పూర్వాంచల్‌లో పోటాపోటీ

ఉత్తర్‌ప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల ఆరో దశ పోలింగ్‌ శనివారం జరగనుంది.

► నేడే పోలింగ్‌
► బీజేపీకి తలనొప్పిగా హిందూ యువవాహిని


సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌: ఉత్తర్‌ప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల ఆరో దశ పోలింగ్‌ శనివారం జరగనుంది. నేపాల్, బిహార్‌లతో సరిహద్దును పంచుకుంటున్న పూర్వాంచల్‌ ప్రాంతంలోని జిల్లాలతో కలిపి మొత్తం ఏడు జిల్లాల్లోని 49 సీట్లకు నేడు పోలింగ్‌ జరగనుంది. బాగా వెనుకబడిన ఈ ప్రాంతంలో యాదవులు, ముస్లింలు, యాదవేతర ఎంబీసీ (అత్యంత వెనుకబడిన వర్గాలు)లు ఎక్కువమంది ఉన్నారు. బహుజన్ సమాజ్‌ పార్టీ ఇక్కడ బలహీనంగా ఉందని విశ్లేషకులు అంటున్నారు. పోటీ బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీల మధ్యనేనని వారి అభిప్రాయం. ఇక్కడ 2012 ఎన్నికల్లో ఎస్పీ 27, బీఎస్పీ 9 సీట్లు కైవసం చేసుకోగా బీజేపీకి 7, కాంగ్రెస్‌కు 4, ఇతరులకు రెండు సీట్లు దక్కాయి.

బీఎస్పీ నుంచి ముక్తార్‌ అన్సారీ పోటీ
పూర్వాంచల్‌లోని మూడు జిల్లాల్లో పేరుమోసిన నేరగాడు ముక్తార్‌ అన్సారీ ఎన్నికల ముందు బీఎస్పీలో చేరి మవూ జిల్లా సాదర్‌ నుంచి పోటీచేస్తున్నారు. ఆయన 1996 నుంచి వరుసగా నాలుగుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. మొదటిసారి బీఎస్పీ తరఫున, తర్వాత రెండుసార్లు స్వతంత్రుడిగా గెలిచారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి నుంచి బీఎస్పీ తరఫున పోటీచేసి ఓడిపోయారు. ఘాజీపూర్‌ జిల్లా మహ్మదాబాద్‌ బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్‌రాయ్‌ హత్యకేసులో నిందితునిగా ముక్తార్‌ 2005 నవంబర్‌ నుంచీ జైల్లోనే ఉన్నారు. ఎస్పీలో చేరడానికి ముక్తార్‌ ప్రయత్నాన్ని సీఎం అఖిలేశ్‌ అడ్డుకోవడంతో బీఎస్పీలో చేరారు.

పది సీట్ల పెద్ద జిల్లా ఆజంగఢ్‌
గతంలో కేంద్ర మాజీ మంత్రి చంద్రజీత్‌ యాదవ్, మాజీ సీఎం రాంనరేష్‌ యాదవ్‌ వంటి హేమాహేమీలు ఆజంగఢ్‌ జిల్లా నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. ముస్లింలు, యాదవులు పెద్ద సంఖ్యలో ఉన్న ఈ జిల్లాలోని పది సీట్లకు బీజేపీ, ఎస్పీ మధ్య పోటీ నెలకొంది. సీట్ల రీత్యా ఇది అతి పెద్ద జిల్లా కాగా, గోరఖ్‌పూర్‌(9), కుషీనగర్‌(8) తర్వాత స్థానాల్లో ఉన్నాయి.

బీజేపీ ఓట్లు చీల్చే హిందూ యువవాహిని అభ్యర్థులు..
హిందువులను రెచ్చగొడుతూ, ముస్లింలను కించపరిచే వ్యాఖ్యలు చేసే ఎంపీ యోగి ఆదిత్యనాథ్‌ కొంత అసంతృప్తితో ఉన్నా బీజేపీ తరఫున ప్రచారం చేస్తున్నారు. ఆయన ఆశీస్సులతో పనిచేసే హిందూ యువసేన చీలికవర్గం గోరఖ్‌పూర్‌ జిల్లా, దాని చుట్టు పక్కల దాదాపు డజను సీట్లలో పోటీచేస్తూ బీజేపీని దెబ్బతీస్తోంది.

యువవాహిని రాష్ట్ర అధ్యక్షుడు సునీల్‌ సింగ్‌ను ఇప్పటికే ఆదిత్యనాథ్‌ బహిష్కరించారు. క్షత్రియ వర్గానికి చెందిన యోగి అత్యంత వివాదాస్పద నేత. మాజీ ప్రధాని, అప్పటి కాంగ్రెస్‌ యంగ్‌టర్క్‌ గ్రూపు నేత అయిన చంద్రశేఖర్‌ది బలియా జిల్లా. బాగా వెనుకబడిన ఈ ప్రాంతాల్లో గత ఐదేళ్లలో అభివృద్ధి లేకపోవడంతో పరిస్థితి బీజేపీకి కాస్త అనుకూలంగా ఉంది. ఎస్పీ 2012 ఎన్నికల్లో ఈ ప్రాంతంలో సాధించిన స్థానాలే మెజారిటీ అందించాయి.

స్వామిప్రసాద్‌ మౌర్యకు బీజేపీ సీనియర్ల నుంచి ఇబ్బందులు..
2012 మార్చి నుంచి వరుసగా నాలుగేళ్లు బీఎస్పీ తరఫున అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా పనిచేసిన మాజీ మంత్రి స్వామిప్రసాద్‌ మౌర్య కిందటి జూన్ లో బీజేపీలో చేరారు. ఇప్పుడు కుషీనగర్‌ జిల్లా ముఖ్యపట్టణం పడరౌనా నుంచి ఆయన మూడోసారి పోటీచేస్తున్నారు. ఆయన బీఎస్పీలో ఉండగా బ్రాహ్మణులు, హిందువులను దూషిస్తూ చేసిన ప్రసంగాల్లోని మాటలతో కూడిన కరపత్రాలను హిందూ జాగరణ్‌ మంచ్‌లోని అసమ్మతివర్గం పంపిణీచేస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement