బంగారం, వెండి మాస్క్‌లకు గిరాకీ!

Masks Made Of Gold And Silver On Sale In Tamil Nadu - Sakshi

విలువైన లోహాలతో క్రేజీ మాస్క్‌లు

చెన్నై : కరోనా వైరస్‌ వ్యాప్తితో ప్రజలు బయటకు అడుగుపెడితే మాస్క్‌లు తప్పనిసరి కావడంతో మార్కెట్‌లో వెరైటీ మాస్క్‌లు దర్శనమిస్తున్నాయి. బంగారం, వెండి వంటి ఖరీదైన లోహాలతో చేసిన మాస్క్‌లకు సైతం ఆదరణ పెరుగుతోంది. మాస్క్‌లను ఆభరణంగా వాడవచ్చని, ఆ తర్వాత దాన్ని కరిగించి ఇతర ఆభరణాలు చేయించుకోవచ్చని కోయంబత్తూరు జిల్లాకు చెందిన ఓ జ్యూవెలర్‌ షాప్‌ యజమాని రాధాకృష్ణన్‌ ఆచార్య చెబుతున్నారు. 18 క్యారెట్‌, 22 క్యారెట్‌ హాల్‌మార్క్‌ గోల్డ్‌తో తాము మాస్క్‌లు తయారుచేస్తామని నాణ్యతకు పూర్తి భరోసా ఇస్తామని అన్నారు. వెండి మాస్క్‌ను 15,000 రూపాయలకు, బంగారు మాస్క్‌లను 2,75,000 రూపాయల నుంచి ఆఫర్‌ చేస్తున్నామని తెలిపారు. ఈ మాస్క్‌లను పూర్తిగా చేతితోనే తయారు చేస్తామని, ఈ రంగంలో తనకు 35 ఏళ్ల అనుభవం ఉందని రాధాకృష్ణన్‌ వివరించారు. 0.66 ఎంఎం మందం కలిగిన బంగారు తీగలను చుట్టే ప్రక్రియ ఒక్కటే మెషీన్‌పై చేస్తామని తెలిపారు.చదవండి : కోవిడ్‌-19 : మరోసారి పాజిటివ్‌ వస్తే!

బెంగళూర్‌, హైదరాబాద్‌తో పాటు ఉత్తరాది నుంచి తమకు ఆర్డర్లు వచ్చాయని చెప్పారు. ఇప్పటి వరకూ బంగారు, వెండి మాస్క్‌ల కోసం 9 ఆర్డర్లు వచ్చాయని వెల్లడించారు. ప్రతిరోజూ వీటికోసం పెద్దసంఖ్యలో ఆర్డర్లు వస్తున్నాయని తెలిపారు. గంటల తరబడి ఈ మాస్క్‌లను ధరించడంలో అసౌకర్యం గురించి ప్రస్తావించగా ఈ మాస్క్‌లు క్లాత్‌ వంటి అనుభూతిని ఇస్తాయని, మాస్క్‌ పైభాగంలో లోపల ఖరీదైన లోహం వాడతామని చెప్పారు. మాస్క్‌లో ఉండే పలు లేయర్లను క్లాత్‌తో చేయడంతో వీటిని ఉతికి తిరిగి వాడుకోవచ్చన్నారు. అయితే వీటిని గట్టిగా వంచడం వంటివి చేయరాదని అన్నారు. అవసరమైతే స్వర్ణకారుడిని సంప్రదించచి క్లాత్‌ మెటీరియల్‌ను మార్చుకోవచ్చన్నారు. ఈ మాస్క్‌లకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ నెలకొందని అన్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top