నేలపాలైన పాల కోసం కుక్కలతో....

Man And Dogs Sharing Spilt Milk In Agra Shows Lockdown Desperation - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కట్టడికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతున్న క్రమంలో పొట్టనింపుకునేందుకు నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆకలి రుచి ఎరగదు.. నిద్ర సిగ్గు ఎరగదని... ఈ సంఘటన ఈ నానుడిని మరోసారి గుర్తు చేస్తుంది. నేలపై ఒలికిపోయిన పాలను ఒకవైపు మనిషి ఎత్తిపోసుకునేందుకు ప్రయత్నిస్తే... ఇంకోవైపు కుక్కల గుంపు ఆబగా జుర్రుకోవడం అందరి మనసులను కలచివేసేదే. విషయం ఏమిటంటే.. ఆగ్రాలో తాజ్‌మహల్‌కు ఆరు కిలోమీటర్ల దూరంలో సోమవారం ఉదయం ఓ భారీ పాల వ్యాను బోల్తా పడింది. దీంతో బోలెడన్ని పాలు నేలపై ఒలికిపోయాయి.

లాక్‌డౌన్‌ కారణంగా తగినంత ఆహారం దక్కని కుక్కల గుంపు ఈ పాలను తాగుతూండగానే...ఓ మనిషి ఈ పాలను ఎలాగైనా వాడుకోవచ్చు అన్న అంచనాతో ఓ మట్టి కుండలో వాటిని చేతులతోనే నింపుకునే ప్రయత్నం కనిపించింది. కమాల్‌ ఖాన్‌ అనే వ్యక్తి ఈ విషాద దృశ్యాన్ని వీడియోలో బంధించి ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. కరోనా వైరస్‌ కట్టడి కోసం మార్చి ఆఖరు వారంలో అకస్మాత్తుగా దేశవ్యాప్తంగా మూడు వారాల లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో పలువురు వలస కూలీలు స్వస్థలాలకు చేరుకునేందుకు ఇబ్బంది పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చాలామందికి తినడానికి తిండి కూడా దక్కడం లేదు.

దేశవ్యాప్తంగా కొన్ని చోట్ల శిబిరాలు ఏర్పాటు చేసి వలస కూలీలకు ఆహారం అందించే ప్రయత్నం జరుగుతున్నా.. కొందరు ఇప్పటికీ తిండికి అల్లాడిపోతూనే ఉన్నారు. కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు మూడువారాల లాక్‌డౌన్‌ ముగిసిన క్రమంలో మరో రెండు వారాల పాటు పొడిగించిన క్రమంలో దేశవ్యాప్తంగా అసంఘటిత రంగంలో పనిచేసే లక్షలాది మందిని తీవ్ర పేదరికంలోకి నెట్టివేసింది. పని కోల్పోయిన వలస కార్మికులు వేలాది కిలోమీటర్లు నడుస్తూ స్వస్ధలాలకు చేరుకోగా, మరికొందరు నగరాలు, పట్టణాల్లో చిక్కుకుపోయి పూటగడవని స్ధితిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 80 కోట్ల మంది పేదలకు ప్రత్యక్ష నగదు బదిలీతో పాటు సబ్సిడీపై ఆహార ధాన్యాలు సమకూర్చింది. మరోవైపు భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు 11,000 దాటగా 377 మందికి పైగా మరణించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top