
‘ఆమె డబ్బంతా చిత్తయిందని ఏడుస్తోంది’
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీ, సీపీఎం దుమ్మెత్తిపోశాయి.
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీ, సీపీఎం దుమ్మెత్తిపోశాయి. పెద్ద నోట్ల రద్దు విషయంపై ఆమె చేస్తున్న ఆందోళన వెనుక వేరే ఉద్దేశం ఉందన్నాయి. నారదా, శారదా కుంభకోణం ద్వారా వెనుకేసుకున్న డబ్బంతా చిత్తుకాగితాల మాదిరిగా మారిపోవడంతోనే ఆమె ఆందోళన బాట పట్టారని పేర్కొన్నాయి. పెద్ద నోట్ల రద్దును ప్రకటన వెలువడిన దగ్గర నుంచే మమత వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. తొలుత నిర్ణయాన్ని వెనుకకు తీసుకోవాలని చెప్పిన ఆమె అనంతరం కొద్ది రోజులపాటు ప్రభుత్వం నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని కోరారు.
ఇందులో భాగంగానే ఆమె పలు నిరసనల ర్యాలీలు, ఆందోళనల్లో పాల్గొంటున్నారు. పెద్ద నోట్ల రద్దును ఖండిస్తూ ఢిల్లీలో కేజ్రీవాల్ నిర్వహించిన కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక సభలో కూడా ఆమె పాల్గొని మోదీ నిర్ణయాన్ని తప్పుబట్టారు. అయితే, ఆమె చేస్తున్న హడావుడిని తప్పుబడుతూ తాజాగా ప్రధాని మోదీ విమర్శలు ఎక్కుపెట్టారు. కుంభకోణాల్లో నిందితులైనవారా తనను తప్పుబట్టేదని పరోక్షంగా శారదా స్కాంను ఉద్దేశించి అన్నారు. సోమవారం కాంగ్రెస్, సీపీఎం లు కూడా అదే వరుసలో చేరి పెద్ద నోట్లపై సామాన్యుల తరుపున తెగ పోరాడుతున్న మభ్యపెడుతున్న మమత ముందు నారదా, శారదా స్కామ్లలో నిందితులైన ఆమె పార్టీ నేతలు ఎలాంటి తప్పుచేయనివారిగా బయటకు రావాలని డిమాండ్ చేశారు.
‘ సమస్య ఉన్న నీళ్లలో మమత చేపలుపట్టాలనుకుంటుంది. పెద్ద నోట్ల రద్దుతో నిజంగా ఇబ్బందులు పడుతున్న వారిపట్ల ఆమె మొసలి కన్నీరు కార్చడం ఆపాలి. నిజంగా ఆమె సామాన్యుడి గురించి బాధపడితే అదే సామాన్యుల సొమ్మును దోచుకున్న వారి దగ్గర నుంచి తిరిగి ఎందుకు ఆ మొత్తం రాబట్టడం లేదు? ఆమె సొంత పార్టీకి చెందిన ఎంపీలే ఈ కుంభకోణంలో నిందితులుగా ఉన్నారు. కుంభకోణాల్లో ఉన్నవారు నల్లధనం, పెద్ద నోట్ల రద్దుపై మాట్లాడొద్దు. చిట్ ఫండ్స్ ద్వారా అక్రమ సొమ్ములు వచ్చిపడ్డాయి. వాస్తవానికి అవన్నీ చెల్లని చిత్తుకాగితాల్లాగ మారేసరికి ఆమె మొసలి కన్నీరు కారుస్తున్నారు’ అని కాంగ్రెస్ నేత అబ్దుల్ మన్నన్, సీపీఎం నేత సుజన్ చక్రవర్తి ఆరోపించారు.