నేను రాను; ప్రధాని మోదీకి దీదీ లేఖ | Sakshi
Sakshi News home page

నేను రాను; ప్రధాని మోదీకి దీదీ లేఖ

Published Fri, Jun 7 2019 12:54 PM

Mamata Banerjee Says It Will Be Fruitless Over NITI Aayog Meeting - Sakshi

కోల్‌కతా : గత కొంతకాలంగా ప్రధాని నరేంద్ర మోదీ విధానాలపై విమర్శలు గుప్పిస్తున్న పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రణాళిక సంఘాన్ని భ్రష్టుపట్టించి, దాని స్థానంలో నీతి ఆయోగ్‌ను తీసుకువచ్చారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నీతి ఆయోగ్‌కు ఎటువంటి అధికారాలు లేవని, అందుకే తాను కౌన్సిల్‌ సమావేశానికి హాజరుకాబోనని స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి మూడు పేజీల లేఖ రాశారు.

‘దురదృష్టవశాత్తూ.. ప్రణాళిక సంఘం స్థానంలో జనవరి 1, 2015లో నీతీ ఆయోగ్‌ అనే కొత్త సంస్థను ఏర్పాటు చేశారు. ఆర్థిక అంశాల్లో రాష్ట్రాలకు ఎటువంటి అధికారాలు కట్టబెట్టకుండా నిబంధనలు తెచ్చారు. రాష్ట్రాలకు ఇందులో ఎటువంటి ప్రాధాన్యం ఉండదు. సలహాలు, సూచనలకు మద్దతు లభించదు. కాబట్టి ఇటువంటి సంస్థ సమావేశాలకు హాజరవ్వడం వల్ల ఉపయోగం లేదు. ఈ క్రమంలో జరిపే చర్చలు ఫలప్రదం కావు’ అని మమత తన లేఖలో పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాల్లో అభివృద్ధికై నిధులు విడుదల చేసేలా తమకు కొన్ని అధికారాలు కట్టబెట్టాలని అడిగినా మోదీ ప్రభుత్వం పట్టించుకోలేదంటూ విమర్శించారు.

కాగా జూన్‌ 15న నీతి ఆయోగ్‌ కౌన్సిల్‌ తొలి సమావేశం జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సంస్థ పునర్‌ వ్యవస్థీకరణకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో రాజీవ్‌ కుమార్‌ నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడిగా కొనసాగనున్నారు. రక్షణ శాఖమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, హోం మంత్రి అమిత్‌ షా, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌, వ్యవసాయ,  రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ ఇందులో ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా చేరనున్నారు. ప్రధాన మోదీ చైర్మన్‌గా వ్యవహరించే నీతి ఆయోగ్‌లో కే సరస్వత్‌, రమేష్‌ చాంద్‌, డాక్టర్‌ వీకే పాల్‌ సభ్యులుగా ఉంటారు. అన్ని రాష్ట్రాల సీఎంలు, లెఫ్టినెంట్‌ గవర్నర్లు ఈ భేటీకి హాజరుకానున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement