ఏడాదిలో పీఎంల మ్యూజియం  

Mahesh Sharma Says PMs Museum Will Complete In One Year - Sakshi

శంకుస్థాపన చేసిన కేంద్రమంత్రులు

రూ. 271 కోట్ల వ్యయంతో నిర్మాణం  

మొత్తం మూడు అంతస్తులు, ప్రతి అంతస్తులోనూ గ్యాలరీ

అభ్యంతరం వ్యక్తం చేసిన మాజీ ప్రధాని మన్మోహన్‌

అయినాసరే ముందుకే...  

న్యూఢిల్లీ: దేశరాజధానిలో దేశ ప్రధానమంత్రులతో కూడిన మ్యూజియం ఏడాదిలోగా పూర్తవనుంది. దీనిని తీన్‌మూర్తి ఎస్టేట్స్‌లో ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ప్రధానమంత్రిగా మోదీ హయాంలో చేపట్టిన కార్యక్రమాల వివరాలను కూడా పొందుపరచనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి మహేశ్‌ శర్మ సోమవారం వెల్లడించారు. దీనిని రూ. 271 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. 10,975,36 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మితమయ్యే ఈ మ్యూజియం ఇప్పటిదాకా ఫ్రధానమంత్రి పదవుల్లో ఉన్నవారు చేపట్టిన కార్యక్రమాల వివరాలకు వేదికవనుంది. బేస్‌మెంట్‌ కలిపి మొత్తం మూడు ఫ్లోర్‌లను నిర్మిస్తారు. ఇందులో ప్రతి ఫ్లోర్‌లోనూ గ్యాలరీలు ఉంటాయి. ‘సంవత్సరంలోగా దీనిని నిర్మిస్తాం. చరిత్ర అంతా ఇందులో అందుబాటులో ఉంటుంది’ అని శర్మ ఈ సందర్బంగా చెప్పారు. దీనిని ఇప్పటిదాకా పీఎం పదవుల్లో కొనసాగినవారందరికీ అంకితం చేస్తారా అని అడగ్గా అందుకు అవునని ఆయన జవాబిచ్చారు.
 
మన్మోహన్‌ అభ్యంతరం చెప్పినా... 
మ్యూజియం నిర్మాణ ప్రతిపాదనపై మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. గత నెలలో ప్రధానమంత్రి మోదీకి ఓ లేఖ కూడా రాశారు. తీన్‌మూర్తి భవన్‌... వాస్తవానికి నెహ్రూ మెమోరియల్‌ మ్యూజియం అండ్‌ లైబ్రరీ (ఎన్‌ఎంఎంఎల్‌)అని, ఇప్పుడు మ్యూజియాన్ని నిర్మించడమంటే ఈ మెమోరియల్‌ ఏర్పాటు ఉద్దేశాన్ని దెబ్బతీయడమే అవుతుందని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. అందువల్ల ఎన్‌ఎంఎంఎల్‌ జోలికి వెళ్లొద్దని కోరారు. ప్రస్తుతమున్న మ్యూజియం... చరిత్రకు, వారసత్వ సంపదకు ప్రతీక అని మన్మోహన్‌ తన లేఖలో పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం ఆయన విన్నపాన్ని ఖాతరు చేయలేదు.
 
పీఎంలు వ్యక్తులు కాదు: శర్మ 
అయితే కాంగ్రెస్‌ అభ్యంతరాన్ని కేంద్ర మంత్రి శర్మ తోసిపుచ్చారు. ప్రధానులు వ్యక్తులు కాదని, వారు సంస్థల వంటివారని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ముగ్గురు మాజీ ప్రధానులకే స్మారకాలు ఉన్నాయని, జవహర్‌లాల్‌ నెహ్రూ, లాల్‌బహదుర్‌ శాస్త్రి, ఇందిరాగాంధీలకు మాత్రమే పరిమితమయ్యాయని అన్నారు. ఈ మ్యూజియం భావి ప్రధానులకు కూడా చోటు కల్పిస్తుందని ఆయన వివరించారు. ఈ స్థలం ప్రభుత్వానిదని, కొంతభాగాన్ని ఎన్‌ఎంఎంఎల్‌కు కేటాయించారని, 23 ఎకరాల భూమి ఇంకా ఉందని, అందువల్ల ఆ స్థలాన్ని వాడుకోవాలని నిర్ణయించామని,  ఇందులో తప్పేముందని  ఆయన ప్రశ్నించారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top