వారిద్దరి మధ్య విభేదాలకు రూ. 4 కారణమైన వేళ!!

Mahatma Gandhi Criticised Kasturba Gandhi Over Ashram Rules - Sakshi

నిజాన్ని నిర్భయంగా చెప్పడంలోనూ, తప్పు చేసిన వారిని విమర్శించడంలోనూ గాంధీజీ ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు. పొరపాటు చేసినా సరే... నిర్మొహమాటంగా ఒప్పుకొనే తత్త్వం బాపూజీ సొంతం. ఈ విషయంలో భార్య కస్తూర్భాను కూడా ఆయన మినహాయించలేదు. కస్తూర్భా గొప్పదనాన్ని మాత్రమే కాదు ఆమె చేసిన పొరపాట్ల గురించి కూడా ఆయన నిజాయితీగా చెప్పేవారు. అయితే అందులో అంతర్లీనంగా ఓ సందేశం కూడా దాగి ఉండేది. అందుకు సంబంధించిన చిన్న ఉదాహరణ...

1929లో నవజీవన్‌ పత్రికలో గాంధీజీ రాసిన వ్యాసం సంక్షిప్తంగా...
‘రెండేళ్ల క్రితం.. కస్తూర్భా తన దగ్గర రెండు వందల రూపాయలు అట్టిపెట్టుకుంది. కానుకల ద్వారా తనకి ఆ డబ్బు వచ్చింది. అయితే ఇలా ఓ వ్యక్తి డబ్బును దాచుకోవడం అనేది ఆశ్రమ నియమాలకు విరుద్ధం. ఈ విషయం తెలిసి కూడా తను అలా చేయడం నన్నెంతగానో బాధించింది. అయితే ఇంతకన్నా బాధించే విషయం ఏంటంటే తన వద్ద డబ్బు ఉన్న సంగతి నా దగ్గర దాచిపెట్టడం. ఈ విషయం బయటపడటం కూడా కొంత విచిత్రంగా జరిగింది. ఓరోజు ఆశ్రమంలో దొంగలు పడ్డారు. వారు సరాసరి కస్తూర్భా గదిలోకి వెళ్లారు. అక్కడ వాళ్లకేమీ దొరకలేదు. కానీ నాకు మాత్రం కస్తూర్భా చేసిన పొరపాటు తెలిసిపోయింది. దీంతో వెంటనే ఆమెను మందలించాను. తను కాస్త బాధ పడినా ఇంకెప్పుడూ ఇలా చేయనని నాతో చెప్పింది.

కానీ ఆ పొరపాటును పునరావృతం చేసి నా నమ్మకం సన్నగిల్లేలా చేసింది. అప్పుడు రెండొందల రూపాయలు అయితే ఇప్పుడు కేవలం నాలుగు రూపాయలే. తనకు తెలిసిన వారెవరో బహుమతి రూపంలో నాలుగు రూపాయలు ఇచ్చారు. ఆ డబ్బులను ఆశ్రమ ఖర్చుల కోసం ఇవ్వకుండా తన దగ్గరే పెట్టుకుంది. దీనిని నేను దొంగతనంగానే భావిస్తాను. అవును ‘బా’  పొరపాటు చేయడమే కాదు దొంగతనం చేసినట్లు కూడా. గట్టిగా నిలదీసిన తర్వాత ఈ విషయం గురించి నాకు చెప్పింది. తప్పని తెలిసినా కూడా తనకున్న ఈ అలవాటును మార్చులేకపోయాను అంది. అయితే ఈసారి తను బలంగా నిర్ణయించుకుంది. నాకు మాట కూడా ఇచ్చింది. ఇలాంటివి పునరావృతం అయితే ఆశ్రమం నుంచి, నా జీవితం నుంచి వెళ్లిపోతానని శపథం బూనింది. కానీ అలాంటి పరిస్థితి రాకుండా తనెంతో జాగ్రత్తపడింది. పశ్చాత్తాపాన్ని మించిన గొప్ప గుణం ఉండదు కదా’ అంటూ గాంధీజీ తన భార్యలోని రెండు లక్షణాల గురించి ఒకే వ్యాసంలో రాసుకొచ్చారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top