ఆ రాష్ట్రాల్లో పెట్రోల్‌పై ఐదు రూపాయలు తగ్గింపు | Sakshi
Sakshi News home page

ఆ రాష్ట్రాల్లో పెట్రోల్‌పై ఐదు రూపాయలు తగ్గింపు

Published Thu, Oct 4 2018 4:53 PM

Maharashtra, Gujarat Govts Announces Totally 5 Rupees Cut On Petrol Prices - Sakshi

వాహనదారులకు వాత పెడుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై కేంద్రం ఒక గంట క్రితమే గుడ్‌న్యూస్‌ చెప్పిన సంగతి తెలిసిందే. లీటరు పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఎక్సైజ్‌ డ్యూటీని రూ.1.50, ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు రూపాయిని తగ్గిస్తున్నట్టు ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారు. అంటే మొత్తం లీటరు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రూ.2.50 తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గడంతో, వెంటనే రాష్ట్రాలు సైతం పెట్రోల్‌, డీజిల్‌పై ఉన్న వ్యాట్‌ను తగ్గించాలని మంత్రి ఆదేశించారు. కేంద్ర మంత్రి ఆదేశాల మేరకు మహారాష్ట్ర, గుజరాత్‌ ప్రభుత్వాలు  వెంటనే పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించాయి. తమ ప్రభుత్వం కూడా పెట్రోల్‌, డీజిల్‌పై రూ.2.50 తగ్గించాలని నిర్ణయించిందని గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపాని ప్రకటించారు. కేంద్రం ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గింపు, తమ వ్యాట్‌ తగ్గింపుతో మొత్తంగా తమ రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఐదు రూపాయల మేర తగ్గనున్నట్టు పేర్కొన్నారు. 

విజయ్‌ రూపాని మాత్రమే కాక మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ సైతం ఇదే విధంగా నిర్ణయం తీసుకున్నారు. ‘పెట్రోల్‌, డీజిల్‌పై రూ.2.50 ధర తగ్గించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీకి కృతజ్ఞతలు. ఇది సామాన్య ప్రజానీకానికి అతిపెద్ద ఊరట. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా సామాన్య ప్రజానీకానికి లీటరు పెట్రోల్‌కు అదనంగా మరో రూ.2.50 ఊరట ఇవ్వాలని నిర్ణయించింది. అంటే మొత్తంగా మా రాష్ట్రంలో లీటరు పెట్రోల్‌ ధర రూ.5 తగ్గుతుంది’ అని దేవేంద్ర ఫడ్నవిస్‌ ట్వీట్‌ చేశారు. కాగా, ముంబైలోనే అ‍త్యధికంగా పెట్రోల్‌ ధర రూ.91ను క్రాస్‌ చేసింది. తాజాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్‌పై భారీ ఊరట ఇవ్వడంతో, ముంబై వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను రూ.2.50 తగ్గిస్తున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్‌ సింగ్‌ ప్రకటించారు. దీంతో మొత్తంగా తమ రాష్ట్రంలో కూడా పెట్రోల్‌, డీజిల్‌ ఐదు రూపాయలు చౌకగా లభ్యం కానున్నాయన్నారు. కేంద్రం ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గింపుతో ఇక రాష్ట్రాలు సైతం వ్యాట్‌ను తగ్గించి, వాహనదారులకు ఊరట ఇవ్వాల్సి ఉంది. 

Advertisement
Advertisement