హక్కుల పరిరక్షణే చట్టసభల కర్తవ్యం 

Madhusudhana Chary Participated In Commonwealth Parliamentary Review Meeting - Sakshi

కామన్వెల్త్‌ పార్లమెంటరీ సమీక్షలో స్పీకర్‌ మధుసూదనాచారి 

సాక్షి, న్యూఢిల్లీ : సమాజంలో అసమానతల్లేకుండా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా విధి విధానాలు రూపొందించి చట్టాలను అమలు చేయడమే చట్టసభల ప్రధాన కర్తవ్యమని అసెంబ్లీ స్పీకర్‌ మధుసూదనాచారి అన్నారు. సోమవారం ఢిల్లీలో లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ అధ్యక్షతన జరిగిన కామన్వెల్త్‌ పార్లమెంటరీ సమీక్షలో పలు రాష్ట్రాల అసెంబ్లీల స్పీకర్లు, మండలి చైర్మన్లు పాల్గొన్నారు. ప్రజల హక్కులను పరిరక్షించేందుకు సభలను నడపాలని మధుసూదనాచారి పేర్కొన్నారు. గత కామన్వెల్త్‌ పార్లమెంటరీ సమీక్షలో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలుపై సమావేశంలో చర్చించారు. తదుపరి సమావేశం జూన్‌ 2న ముంబైలో నిర్వహించనున్నట్లు తెలిపారు.

తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో రాష్ట్ర అసెంబ్లీ పనితీరు ప్రశంసనీయమని సుమిత్రా మహాజన్‌ కొనియాడినట్లు పేర్కొన్నారు. చట్టసభల్లో ఎదురవుతున్న సమస్యలు, ఇతర అంశాల పరిష్కారానికి ఇలాంటి సమావేశాలు ఉపయోగపడుతాయని మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ అన్నారు. అన్ని రాష్ట్రాల స్పీకర్లు, మండలి చైర్మన్లతో ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించాలని కోరడంపై సుమిత్రా మహాజన్‌ సానుకూలంగా స్పందించారని చెప్పారు. సమాజంలోని అసమానతల తొలగింపునకు విశేష కృషి చేసి దేశానికి దశ, దిశ చూపిన మహనీయులు జ్యోతిబా పూలే, బీఆర్‌ అంబేడ్కర్‌ అని మధుసూదనాచారి, స్వామిగౌడ్‌ కొనియాడారు. తెలంగాణ పూలే బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జ్యోతిబా పూలే, అంబేడ్కర్‌ల జయంతి వేడుకలను ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఘనంగా నిర్వహించారు.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top