
భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లా దిల్వారీ గ్రామానికి చెందిన ఉదయ్ మూడు సంవత్సరాల క్రితం పారిపోయాడు. అయితే లాక్‌డౌన్ నేపథ్యంలో చనిపోయాడనుకున్న కొడుకు తిరిగి రావడంతో అతని కుటుంబసభ్యుల ఆనందానికి అవదులు లేకుండా పోయాయి. ఈ విషయమై బీజవర్ పోలీస్‌స్టేషన్ సబ్ ఇన్స్‌పెక్టర్ సీతారాం మాట్లాడుతూ.. ' 2017లో ఉదయ్ తప్పిపోయాడంటూ అతడి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాం. కాగా మా విచారణలో అతడి వయస్సు ఉన్న శవం ఒకటి దొరికింది. దీంతో ఉదయ్ తల్లిదండ్రులను పిలిచి శవాన్ని గుర్తించమని అడిగాం. చనిపోయిన వ్యక్తి ముఖం సరిగా కనపడకపోవడంతో అతను వేసుకున్న దుస్తులు, వయస్సు అదే కావడంతో తమ కొడుకు చనిపోయాడని భావించిన తల్లిదండ్రులు ఆ శవానికి అంత్యక్రియలు నిర్వహించారంటూ' పేర్కొన్నాడు.
('వాడంటే నాకు ఇష్టం లేదు.. అందుకే చంపేశా')
అయితే లాక్‌డౌన్ కారణంతో కాలినడకనే ఉదయ్ ఇంటికి చేరుకున్నాడు. ' మూడేళ్ల క్రితం మా ఊర్లో దొంగతనం చేశానంటూ కొందరు నాపై ఆరోపించి కేసు పెడతామని భయపెట్టారు. దీంతో నేను గ్రామం వదిలి ఢిల్లీ పారిపోయాను. లాక్‌డౌన్ కారణంగా తప్పని సరి మళ్లీ గ్రామానికి రావాల్సి వచ్చింది. నేను చనిపోయానని బాధపడుతున్న తల్లిదండ్రులకు నా రాక ఎంతో సంతోషం కలిగించింది. గ్రామానికి చేరుకున్న వెంటనే అందరూ నన్ను గుర్తుపట్టారంటూ' ఉదయ్ చెప్పుకొచ్చాడు. ఇప్పటివరకు 4426 కరోనా కేసులు నమోదవ్వగా, మృతుల సంఖ్య 237కు చేరుకుంది.