కథువా కేసు: ఆ చిన్నారికి న్యాయం జరిగింది!

little soul got justice, says ex cop who probed Kathua Case - Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపిన కథువా అత్యాచార కేసులో చిన్నారి బాధితురాలికి న్యాయం చేకూరడం తనకు ఆనందం కలిగించిందని ఈ కేసు విచారణకు నేతృత్వం వహించిన జమ్మూకశ్మీర్‌ మాజీ పోలీసు అధికారి రమేశ్‌కుమార్‌ జల్లా తెలిపారు. ‘ఆ చిన్నారి ఆత్మకు న్యాయం జరగడం ఆనందంగా ఉంది’ అని ఆయన పేర్కొన్నారు. కథువా రేప్‌ కేసులోని ఏడుగురు నిందితుల్లో ఆరుగురిని దోషులుగా నిర్ధారిస్తూ.. పఠాన్‌కోట్‌ స్పెషల్ కోర్టు సోమవారం తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఆలయ పూజారి సాంజీ రామ్‌, ఇద్దరు పోలీసు అధికారులు దీపక్‌ ఖజూరియా, ప్రవేష్‌కుమార్‌లకు కోర్టు జీవిత ఖైదు విధించింది. ఇదే కేసులో దోషులుగా తేలిన ముగ్గురు పోలీసు అధికారులు సురేందర్‌ వర్మ, హెడ్‌ కానిస్టేబుల్‌ తిలక్‌ రాజ్‌, ఆనంద్‌ దత్తాలకు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. 

కథువా అత్యాచార కేసు.. అప్పుడు అధికారంలో ఉన్న పీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో తీవ్ర విభేదాలకు కారణమైన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసు దర్యాప్తులో తమ బృందానికి ఎలాంటి రాజకీయ ఒత్తిడి ఎదురుకాలేదని రమేశ్‌కుమార్‌ జల్లా మీడియాతో పేర్కొన్నారు. క్రైమ్‌ బ్రాంచ్‌ సీనియర్‌ సూపరింటెండెంట్‌గా వ్యవహరించిన ఆయన గత నెలలో పదవీ విరమణ తీసుకున్నారు. ‘నేను ఇప్పుడు రిటైరయ్యాను. ఇప్పుడు నన్ను ఎవరూ ఏమీ చేయలేను. నమ్మండి నేను చెప్పేది నిజం. ఏ వర్గం నుంచి మాకు ఒత్తిడి ఎదురుకాలేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు, బీజేపీ, పీడీపీ ఇలా ఏ ఒక్కరి నుంచి మాకు ఒత్తిడి రాలేదు’ అని ఆయన పేర్కొన్నారు. ఈ అత్యాచార కేసుకు మతపరమైన ముద్ర వేసేందుకు ప్రయత్నించారని, కానీ, అప్పటి మంత్రుల నుంచి కానీ, అధికార వ్యవస్థ నుంచి కానీ ఎలాంటి ఒత్తిళ్లు ఎదురవ్వలేదని ఆయన వివరించారు. మీడియాలో విభిన్నమైన కథనాలు రావడం తమను ఒత్తిడికి గురిచేసిందని, అయినా దానిని తాము పెద్దగా పట్టించుకోలేదని తెలిపారు.

జమ్ముకశ్మీర్‌లోని కథువా జిల్లాలో గతేడాది జనవరిలో ఎనిమిదేళ్ల బాలికను అత్యంత దారుణంగా ఆలయంలోనే అత్యాచారం చేసి.. హత్య చేయడం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన విషయం విదితమే. బాధితురాలికి మత్తు పదార్థాలు ఇచ్చి, సామూహిక అత్యాచారం, హత్య చేసిన ఘటన కలకలం రేపింది. బాలికను గ్రామంలోని ఓ దేవాలయంలో బంధించి నిందితులు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. నాలుగు రోజుల తర్వాత అత్యంత దారుణ పరిస్థితిలో బాలిక మృతదేహం బయటపడింది. పాశవికమైన ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు,. నిరసనలు హోరెత్తాయి.

ఈ కేసులో గ్రామ పెద్ద సాంజి రామ్‌, అతని కొడుకు విశాల్‌, మైనర్‌ మేనల్లుడితోపాటు ఇద్దరు స్పెషల్‌ పోలీస్ ఆఫీసర్లు దీపక్‌ ఖజురియా, సురేందర్ వర్మలను క్రైంబ్రాంచ్ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అలాగే సాంజిరామ్‌ నుంచి  నాలుగు లక్షలు లంచం తీసుకుని ఆధారాలను ధ్వంసంచేశారనే ఆరోపణలపై కానిస్టేబుల్ తిలక్‌రాజ్‌, సబ్ ఇన్సిపెక్టర్‌ ఆనంద్‌ దత్తా కూడా అరెస్టయ్యారు. జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో.. కేసు విచారణను సుప్రీంకోర్టు పఠాన్‌కోట్‌ కోర్టుకు బదిలీ చేసింది.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top