న్యాయం.. 23 ఏళ్లు వాయిదా!

Lajpat Nagar bomb accused acquitted after 24 years  - Sakshi

శ్రీనగర్‌: వారి జీవితంలోని విలువైన కాలమంతా జైలు నాలుగు గోడలమధ్యే గడిచిపోయింది. దాదాపు 23 ఏళ్ల పాటు జైళ్లో నిర్బంధించి, ఇప్పుడు తీరిగ్గా నిర్దోషులేనంటూ వారిని విడుదల చేశారు. కశ్మీర్‌కు చెందిన మొహమ్మద్‌ అలీ భట్, లతీఫ్‌ అహ్మద్‌ వాజా, మీర్జా నాసర్‌ హుస్సేన్‌ల విషాదమిది. లజపతినగర్‌ మార్కెట్‌ పేలుళ్లలో హస్తం ఉందంటూ వీరిని మొదట 1996లో ఢిల్లీ పోలీసులు నేపాల్‌లో అరెస్ట్‌ చేశారు. అనంతరం ఓ బస్సును పేల్చారనే ఆరోపణలపై రాజస్తాన్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లజపత్‌ నగర్‌ కేసుకు సంబంధించి వీరిని 2012లో ఢిల్లీ హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. రాజస్తాన్‌ బస్సు కేసు నుంచి బయటపడకపోవడంతో ఆ తరువాతా వారు జైల్లోనే మగ్గాల్సి వచ్చింది.

తాజాగా రాజస్తాన్‌ హైకోర్టు సైతం వారిని నిర్దోషులంటూ తీర్పు ఇవ్వడంతో.. ఎట్టకేలకు 23 ఏళ్ల విలువైన జీవితాన్ని కోల్పోయిన అనంతరం  స్వేచ్ఛాప్రపంచంలోకి రాగలిగారు. కశ్మీరీ ఉపకరణాలను అమ్మి జీవనం గడిపేందుకు నేపాల్‌ వెళ్లిన వారిని 1996లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ’నేపాల్‌లో ఉన్న సామాన్యులమైన మేం ఢిల్లీలో, రాజస్తాన్‌లో బాంబు పేలుళ్లకెలా బాధ్యులమవుతాం? మమ్మల్ని చిత్రహింసలు పెట్టారు. తెల్లకాగితాలపై సంతకాలు పెట్టించుకుని మమ్మల్ని బలిపశువులను చేశారు’ అని శ్రీనగర్‌కు చెందిన వాజా ఆవేదన వ్యక్తం చేశారు. భట్‌ జైళ్లో ఉన్న సమయంలోనే తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయాడు. ఇంటికి వెళ్లగానే మొదట భట్‌ స్మశానవాటికకు వెళ్లి తన తల్లిదండ్రుల సమాధుల వద్ద చిన్నపిల్లాడిలా ఏడ్చాడు. ‘నా సగం జీవితాన్ని కోల్పోయాను. నాకు జరిగిన అన్యాయానికి ఎవరు బాధ్యులు?’ అనే భట్‌ ప్రశ్నకు ఎవరి వద్దా సమాధానం లేదు. మాలాంటి అమాయకులు ఇంకా జైళ్లలో చాలామంది ఉన్నారని ఈ ముగ్గురు చెబుతున్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top