లవ్ జిహాద్‌పై హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్య

Kerala HC on Love Jihad Alleges Case - Sakshi

సాక్షి, తిరువనంతపురం : లవ్‌ జిహాద్‌ వ్యవహారంపై కేరళ హైకోర్టు గురవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.  మతాంతర వివాహాలన్నింటిని 'లవ్ జీహాద్' గా అభివర్ణించలేమని న్యాయస్థానం అభిప్రాయపడింది. అదే సమయంలో మత మార్పిడి కేంద్రాలను రాజ్యాంగ విరుద్ధమని బెంచ్‌ వ్యాఖ్యానించింది. 

తన భార్యను బలవంతంగా తీసుకెళ్లిన ఆమె తల్లిదండ్రులు 'ఘర్ వాపసీ' అంటూ మతం మార్పించారని ఎర్నాకులంకు ఓ ముస్లిం యువకుడు కోర్టును ఆశ్రయించాడు. అయితే అన్ని వివాహాలనూ లవ్ జిహాద్ లేదా ఘర్ వాపసీగా భావించలేమని కోర్టు పిటిషనర్‌కు తెలిపింది. ప్రతి మతాంతర వివాహాన్నీ.. మత కోణంలో పరిశీలించడం సాధ్యపడదని జస్టిస్ వీ చిదంబరేష్, జస్టిస్ సతీష్ నినాన్ లతో కూడిన ధర్మాసనం వివరించింది. ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని చెబుతూ.. మరో రూపంలో కేసు దాఖలు చేయాలని సూచించింది.

మరోపక్క తాను ఓ క్రిస్టియన్ యువకుడిని పెళ్లి చేసుకోగా, తన తల్లిదండ్రులు ఇంట్లో బంధించారని ఓ ఆయుర్వేద వైద్యురాలు కోర్టును ఆశ్రయించింది. ఈ కేసుతోనే మత మార్పిడి కేంద్రాలు వెలుగు చూడగా.. తక్షణమే వాటిని గుర్తించి మూసివేయించాలని న్యాయస్థానం కేరళ పోలీస్‌ శాఖను ఆదేశించింది. కేరళ రాష్ట్రంలోనే ఈ తరహా మత మార్పిడులు, ఘర్ వాపసీలు అధికంగా జరుగుతుండటం గమనార్హం. మతాంతర వివాహాల అనంతరం వారిని ఉగ్రసంస్థల్లోకి పంపిస్తున్నారన్న ఆరోపణలు వెలువెత్తాయి. దీంతో జాతీయ దర్యాప్తు సంఘం(ఎన్‌ఐఏ) రంగంలోకి దిగి విచారణ చేపట్టింది. దర్యాప్తులో గత ఏడాది వ్యవధిలో ఇటువంటి 90 వివాహాలు జరిగాయని వెల్లడికాగా, వీటిలో 23 ‘పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్ ఇండియా’ అనే ఇస్లామిక్‌ రాడికల్‌ గ్రూప్‌కు నేతృత్వంలో జరగటం విశేషం.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top