తట్టుకోలేకపోతున్నా: గంభీర్‌

Kashmir problem Gautam Gambhir has a solution - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కశ్మీర్‌లో జరుగుతున్న పరిణామాలపై టీమిండియా క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ మరోసారి తనదైన శైలిలో స్పందించారు. కశ్మీర్‌ సమస్యకు తన దగ్గర పరిష్కారం ఉందని, అది అమలు చేస్తే తప్పకుండా ఫలితం ఉంటుందని చెబుతున్నాడు. రాజకీయ నేతలను ఎలాంటి సెక్యూరిటీ లేకుండా కశ్మీర్‌లో వదిలేయాలని, అప్పుడే వారికి సైనికుల సమస్యలు ఏంటో తెలుస్తాయని అంటున్నాడు. 

‘తట్టుకోలేకపోతున్నా... రాళ్ల దాడి చేసేవారితో ఇంకా కూర్చుని చర్చలు జరిపే అవకాశముందని భారత్‌ భావిస్తోందా?. ఒక్కసారి వాస్తవ పరిస్థితిని గ్రహించాలి. రాజకీయ మద్ధతు లభిస్తే మన సైనిక దళాలు, సీఆర్పీఎఫ్‌ సత్తా ఏంటో, ఫలితాలు ఎలా ఉంటాయో చూడొచ్చు’ అంటూ ఓ ట్వీట్‌ చేశాడు. ఇక తన దగ్గర కశ్మీర్‌ సమస్యకు పరిష్కారం ఉందంటూ చెబుతూ... ‘సమస్యాత్మక ప్రాంతాల్లోకి రాజకీయ నాయకులను వారి కుటుంబాలతో సహా ఎలాంటి రక్షణ లేకుండా వదిలేయాలి. అలా నివసించిన వారినే 2019 ఎన్నికల్లో పోటీకి అనుమతించాలి. అప్పుడే వారికి కశ్మీర్‌ అంటే ఏంటో?.. సైనికుల బాధలు ఏంటో తెలుస్తాయి’ అంటూ మరో ట్వీట్‌ చేశాడు. 

కాగా, ఇటీవల కశ్మీర్‌లో సీఆర్పీఎఫ్‌ వాహనంపై స్థానికులు రాళ్ల దాడి చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియోను ప్రముఖ జర్నలిస్ట్‌ ఆదిత్య రాజ్‌ కౌల్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘నౌహట్టాలో సీఆర్పీఎఫ్‌ వాహనాన్ని లక్ష్యంగా ఎంచుకొని రాళ్ల దాడి చేశారు. ఒకవేళ ఆ వాహనం తలుపులు తెరిస్తే పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. కశ్మీర్‌లోని ఏ మీడియా ఈ ఘటనను బయటకు చూపించదు’ అంటూ ఆయన ట్వీట్‌ చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top