వెరైటీ ప్రచారం : పేరు ఆమెది.. ఫోటో అతనిది

In Karnataka A Political Party Replaced Women Candidates With Male Photos - Sakshi

బెంగళూరు : మహిళా సాధికారత గురించి పెద్ద పెద్ద లెక్చర్‌లు ఇచ్చే నాయకులు మహిళలు రాజకీయాల్లోకి వస్తామంటే మాత్రం పెద్దగా సంతోషించరు. దేశ జనభాలో సగం ఉన్న మహిళలు.. రాజకీయాల్లో మాత్రం కనీసం ఒక శాతం కూడా లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం దేశంలోని మహిళా రాజకీయ ప్రతినిధులు ఎందరంటే వేళ్ల మీద లెక్కించి చెప్పగల్గే పరిస్థితి. ఒకవేళ మహిళలు రాజకీయాల్లోకి వచ్చినా పెత్తనం చెలాయించేది మాత్రం వారి కుటుంబంలోని పురుషులు. కేవలం పేరు మోసిన కుటుంబాల నుంచి వచ్చిన ఆడవారు మాత్రమే తమ రాజకీయ హోదాని సరిగ్గా వినియోగించుకోగల్గుతున్నారు. 

ఇది మన దేశమంతటా సర్వసాధణంగా కనిపించే దృశ్యం. కానీ కర్ణాటకలోని ఓ రాజకీయ పార్టీ మాత్రం ఏకంగా ప్రచారం నుంచే మహిళా అభ్యర్థులు స్థానంలో వారి  కుటుంబాల్లోని మగవారి ఫోటోలను ముద్రించి ప్రచారం చేస్తున్నారు. ఈ సంఘటన మంగళూరు ఉల్లాల్‌లో చోటు చేసుకుంది. మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా ‘సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా’(ఎస్‌డీపీఐ) తన పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులు వివారాలతో కూడిన పాంప్లేట్‌ రూపొందించింది. అయితే ఆ పాంప్లేట్లలో మహిళలకు కేటాయించిన వార్డుల్లో వారి పేర్ల పక్కన ఖాళీ ఫోటో వచ్చే చోట ఖాళీగా వదిలి, ఆ పక్కనే సదరు మహిళా అభ్యర్థుల కుటుంబాలకు చెందిన మగవారి ఫోటోలను ముద్రించారు.

అయితే ఇక్కడ ఆసక్తికర అంశం ఏంటంటే ఎస్‌డీపీఐ పార్టీ ‘మహిళా సాధికారత’ తన సిద్ధాంతంగా ప్రచారం చేసుకోంటోంది. అటువంటి పార్టీ మహిళా అభ్యర్థుల స్థానంలో వారి ఫోటోలను ప్రచురించకపోగా.. వారి కుటుంబానికి చెందిన మగవారి ఫోటోలను ముద్రించి విమర్శల పాలవుతోంది. ట్విటర్‌లో పోస్టు చేసిన ఈ పాంప్లేట్‌కు నెటిజన్లు వారిదైన శైలిలో కామెంట్‌ చేస్తున్నారు. ‘ఇదేనా మీరు ప్రచారం చేసిన మహిళా సాధికారత’, ‘మహిళా సాధికారతకు అసలు సిసలు నిదర్శనం ఇదే’ అంటూ కామెంట్‌ చేస్తోన్నారు.

ఈ విషయం గురించి ఎస్‌డీపీఐ పార్టీ నాయకుడు ఒకరు మాట్లాడుతూ.. అభ్యర్థుల ఫోటోలు ముద్రించాలనే నిబంధనేం లేదు. ఓటర్లకు వారి అభ్యర్థుల గురించి తెలుసన్నారు. సమయానికి మహిళా అభ్యర్థుల ఫోటోలు లభించకపోవడంతో.. వారి కుటుంబానికి చెందిన పురుషుల ఫోటోలు ముద్రించాం అని తెలిపారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top