నేడు జస్టిస్‌ చలమేశ్వర్‌ పదవీ విరమణ

Justice Chalameshwar retires today - Sakshi

గోప్యతా హక్కు సహా పలు కీలక తీర్పులిచ్చిన బెంచ్‌లలో సభ్యుడు

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు జడ్జీల్లో ప్రధాన న్యాయమూర్తి తరువాత అత్యంత సీనియర్‌ అయిన జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ శుక్రవారం పదవీ విరమణ చేయనున్నారు. శనివారంతో ఆయనకు 65 ఏళ్లు పూర్తవుతున్నాయి. జస్టిస్‌ చలమేశ్వర్‌ సుమారు ఏడేళ్లు సుప్రీంకోర్టులో జడ్జీగా విధులు నిర్వర్తించారు. తన కోసం వీడ్కోలు సమావేశం నిర్వహించొద్దని ఆయన సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌కు ఇది వరకే విజ్ఞప్తి చేశారు. ముక్కుసూటి మనిషిగా పేరొందిన చలమేశ్వర్‌ పలు చారిత్రక తీర్పులు వెలువరించిన బెంచ్‌లలో సభ్యుడిగా పనిచేశారు.

జనవరి 12న జస్టిస్‌ రంజన్‌ గొగోయ్, జస్టిస్‌ ఎంబీ లోకూర్, జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్‌లతో కలసి జస్టిస్‌ చలమేశ్వర్‌ సంయుక్త మీడియా సమావేశం నిర్వహించి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా కేసులను కేటాయిస్తున్న తీరును తప్పుపట్టడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. గోప్యతా హక్కు ప్రాథమిక హక్కుల్లో అంతర్భాగమని చారిత్రక తీర్పునిచ్చిన 9 మంది జడ్జీల సుప్రీం ధర్మాసనంలో జస్టిస్‌ చలమేశ్వర్‌ కూడా ఉన్నారు.  ఇటీవల ఉత్తరాఖండ్‌ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జోసెఫ్‌ కురియన్‌ పేరును సుప్రీం జడ్జి పదవికి ప్రతిపాదించిన ఐదుగురు సభ్యుల కొలీజియంలోనూ ఉన్నారు.

కృష్ణా జిల్లా నుంచి అత్యున్నత స్థానానికి..
1953, జూన్‌ 23న ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా, మొవ్వ మండలం, పెద్ద ముత్తెవి గ్రామంలో జన్మించిన చలమేశ్వర్‌..మచిలీపట్నంలో పాఠశాల విద్య పూర్తిచేశారు. చెన్నైలోని లయోలా కళాశాలలో బీఎస్సీ(భౌతికశాస్త్రం) అభ్యసించారు. 1976లో విశాఖపట్నంలోని ఆంధ్రా వర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1995లో ఏపీ ప్రభుత్వ అదనపు అడ్వకేట్‌ జనరల్‌గా నియమితులయ్యారు. 1999లో ఏపీ హైకోర్టులో జడ్జిగా పదోన్నతి పొందా రు. 2007లో గౌహతి హైకోర్టు సీజేగా, 2010లో కేరళ హైకోర్టు సీజేగా నియమితులయ్యారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top