జీశాట్-18 ప్రయోగం సక్సెస్

జీశాట్-18 ప్రయోగం సక్సెస్


సమాచార రంగంలో విప్లవాత్మక మార్పునకు బీజం

ఫ్రెంచ్ గయానాలోని అంతరిక్ష కేంద్రం నుంచి నింగిలోకి

డీటీహెచ్, టెలికం రంగాల్లో సేవల వేగవంతం

ఇస్రో ప్రయోగాల్లో మరింత ముందడుగు

 


 జీశాట్-18

 రాకెట్: ఏరియాన్ 5 ఈసీఏ, వీఏ231

 మొత్తం బరువు: 3404 కేజీలు

 జీవితకాలం: 15 సంవత్సరాలు

 వినియోగ శక్తి: 6474 వాట్ల సౌరశక్తి,

 144 ఏహెచ్ లిథియం-అయాన్ బ్యాటరీలు -2




త్వరలో బరువైన రాకెట్ల ప్రయోగం

ఇన్నాళ్లూ తేలికైన ఉపగ్రహాలను మాత్రమే పంపిస్తున్న ఇస్రో.. జీశాట్ వంటి బరువైన ఉపగ్రహాలను పంపేందుకు 1981 నుంచి ఏరియన్‌స్పేస్ కేంద్రాన్ని వినియోగించుకుంటోంది. అయితే.. ఈ ప్రయోగాలనూ సొంతంగా చేపట్టేందుకు స్వదేశీ పరిజ్ఞానంతో జీఎస్‌ఎల్‌వీ ఎంకే-3ని రూపొందిం చింది. దీనిపై ప్రయోగాత్మకంగా జరిపిన పరీక్షలు విజయవంతమవటంతో.. 3.4 టన్నుల బరువు కలిగిన జీశాట్-19 ఉపగ్రహాన్ని డిసెంబర్లో పంపేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే.. ముందుగా నిర్ణయించినట్లు ఇస్రో జీశాట్-17, జీశాట్-11 ప్రయోగాలు కూడా కౌరు అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచే వచ్చేఏడాది ఆరంభంలో జరగనున్నాయి. ఇవి భారత్‌కు కీలకమైన ప్రయోగాలు.

 

శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత సమాచార సేవలను మరింత వేగవంతం చేసేందుకు ఉద్దేశించిన ఉపగ్రహం జీశాట్-18 ప్రయోగం విజయవంతమైంది. ఫ్రెంచ్ గయానాలోని (దక్షిణ అమెరికా) కౌరు అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి గురువారం ఈ ప్రయోగం జరిగింది. దీని ద్వారా రానున్న రోజుల్లో టీవీ, టెలికమ్యూనికేషన్స్, వీశాట్, డిజిటల్ ఉపగ్రహ వార్తా సేకరణ వంటి విషయాల్లో విప్లవాత్మక మార్పులు అందుబాటులోకి రానున్నాయి. వాతావరణం సహకరించకపోవటంతో ప్రయోగం ఒకరోజు ఆలస్యమైన సంగతి తెలిసిందే.

 

గురువారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో.. యూరోపియన్ లాంచర్ ‘ఏరియన్-5 వీఏ-231’ కౌరు కేంద్రం నుంచి బయలు దేరింది. 32 నిమిషాల తర్వాత ఆస్ట్రేలియా ఆపరేటర్ ఎన్‌బీఎన్‌కు సంబంధించిన ‘స్కై మస్టర్-2’ను ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. కాసేపటికే అత్యంత శక్తివంతమైన జీశాట్-18ను కూడా కక్ష్యలోకి పంపించింది. భూ స్థిర కక్ష్యలోకి ప్రవేశించిన ఈ జీశాట్-18 మాస్టర్ కంట్రోలింగ్ కమాండ్ కర్ణాటకలోని హసన్ నుంచి జరగనుంది.

 

డిజిటల్ కమ్యూనికేషన్‌కు ఊతం

జీశాట్-18 సమాచార ఉపగ్రహంతో దేశంలో డిజిటల్ మల్టీమీడియా, మొబైల్ కమ్యూనికేషన్ రంగంలో అత్యంత సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుంది. ఈ ఉపగ్రహంలో 24 సీబ్యాండ్, 12 ఎక్సెటెండెడ్ సీబ్యాండ్ ట్రాన్స్‌పాండర్లు, 12 కేయూ బ్యాండ్ ట్రాన్స్‌పాండర్లతో పాటు 2 కేయూ బీకాన్ బ్యాండ్ ట్రాన్స్‌పాండర్లను అమర్చి పంపారు. అయితే ఇప్పటికే  12 ఇస్రో సమాచార ఉపగ్రహాలు అంతరిక్ష కక్ష్యలో పనిచేస్తూ 235 ట్రాన్స్‌పాండర్లతో దేశవ్యాప్తంగా డీటీహెచ్ ప్రసారాలు, టెలికం సేవలు అందిస్తున్నాయి.

 

అయితే సమాచార రంగంలో రోజు రోజుకు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు 500 ట్రాన్స్‌పాండర్ల దాకా డిమాండ్ వుండగా, ఇస్రో పరిధిలో 235 టాన్స్‌పాండర్లు పనిచేస్తున్నాయి. అయితే సమాచార రంగంలో ఉన్న అవసరాన్ని తీర్చేందుకు వచ్చే మూడునాలుగేళ్లలో మరో 450 టాన్స్‌పాండర్లును అందుబాటులోకి తేవడాన్ని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. జీశాట్-18 ద్వారా శాటిలైట్ ఫోన్స్ అభివృద్ధి, డిజిటల్ మల్టీ మీడియా, మొబైల్ కమ్యూనికేషన్‌లో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయని ఇస్రో ప్రకటించింది.



 

రాష్ట్రపతి, ప్రధాని శుభాకాంక్షలు

జీశాట్ ప్రయోగం విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. ‘భారత అంతరిక్ష ప్రయోగ చరిత్రలో మరో మైలురాయిని అందుకున్నారు. ఇస్రోకు శుభాకాంక్షలు’ అని ప్రధాని ట్వీట్ చేశారు. ‘సమాచార ఉపగ్రహ ప్రయోగం విజ యవంతమైనందుకు ఇస్రోకు హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని రాష్ట్రపతి ప్రణబ్ కూడా ట్వీట్ చేశారు. భారత్‌కు ఇది కీలకమైన ప్రయోగమని.. పనిచేసే కాలవ్యవధి పూర్తయిన ఉపగ్రహాల స్థానంలో కొత్తవాటిని పంపించి దేశంలో సమాచార రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నట్లు ఇస్రో చైర్మన్ కిరణ్ తెలిపారు. ఏరియన్ స్పేస్‌కు కిరణ్ శుభాకాంక్షలు తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top