సూర్యుడిపై ఇస్రో పరిశోధనలు! 

ISRO researches on sun - Sakshi

వచ్చే ఏడాది ఆదిత్య–ఎల్‌1 ప్రయోగం? 

కరోనాలో వేడి పెరుగుదలకు కారణాలపై అధ్యయనం 

కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ 

శ్రీహరికోట (సూళ్లూరుపేట): సూర్యుడిపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సన్నద్ధమవుతోంది. ఇందుకోసం శ్రీహరికోట నుంచి పీఎస్‌ఎల్‌వీ–ఎక్స్‌ఎల్‌ రాకెట్‌ ద్వారా ఆదిత్య–ఎల్‌1 ఉపగ్రహాన్ని పంపేందుకు ఇస్రో ప్రణాళికలు సిద్ధంచేస్తోంది. భారత ప్రభుత్వం నుంచి ఇందుకు అనుమతిరావడంతో 2018–19లో దీనిని ప్రయోగించే అవకాశం ఉంటుందని గతంలోనే ఇస్రో చైర్మన్‌ ఏఎస్‌ కిరణ్‌కుమార్‌ నర్మగర్భంగా తెలిపారు. ఈ ఉపగ్రహంలో యాస్‌పెక్స్, సూట్, వెల్సి, హెలియోస్, పాపా, సోలెక్స్‌ అనే ఆరు ఉపకరణాలను (పేలోడ్స్‌) అమర్చి పంపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఉపగ్రహాన్ని భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాగ్రేంజియన్‌ బిందువు–1 (ఎల్‌–1)లోకి చేరుస్తారు. అక్కడి నుంచి ఎలాంటి అవరోధాలు, అడ్డంకులు లేకుండా సూర్యుడ్ని నిరంతరం పరిశీలించడానికి వీలవుతుంది.

సూర్యుడి వెలుపలి వలయాన్ని కరోనా అంటారు. సూర్య గోళానికి వేల కిలోమీటర్ల దూరం వరకు ఇది విస్తరించి ఉంటుంది. అక్కడ ఉష్ణోగ్రత దాదాపు పది లక్షల డిగ్రీల కెల్విన్‌ (అంటే 999726.85 డిగ్రీల సెల్సియస్‌) వరకు ఉంటుంది. సూర్యుడి అంతర్భాగ ఉష్ణోగ్రత ఆరు వేల కెల్విన్‌ డిగ్రీల వరకు ఉంటుంది. కరోనాలో వేడి పెరిగిపోతుండడానికి కారణం అంతు చిక్కడంలేదు. దీంతో సౌర గోళంలో సౌర గాలులు, జ్వాలలు, రేణువుల తీరుతెన్నులపై ఆదిత్య–ఎల్‌1 ద్వారా పరిశో«ధనలు చేయడానికి ఇస్రో నడుం బిగించింది.

సౌర తుపాన్‌ సమయంలో వెలువడే రేణువుల వల్ల భూమిపై సమాచార వ్యవస్థకు అవరోధాలు ఏర్పడుతుంటాయి. దీంతోపాటు కాంతి మండలం (ఫొటోస్ఫియర్‌), వర్ణ మండలాలను (క్రోమోస్ఫియర్‌) అధ్యయనం చేసి సమాచారాన్ని సేకరిస్తారు. వచ్చే ఏడాదికల్లా దీనిని సిద్ధం చేయాలని ఇస్రో శాస్త్రవేత్తలు కసరత్తు చేస్తున్నారు. బెంగళూరులోని ఉపగ్రహాల తయారీ కేంద్రంలో ఆదిత్య–ఎల్‌1ను తయారు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top