దేశంలోని అమెరికా, ఇజ్రాయెల్ రాయబార కార్యాలయాల పేల్చివేతకు కుట్ర పన్నిన ఐఎస్‌ఐ ఏజెంట్, శ్రీలంక..
పాక్ శిక్షణతోనే పేలుళ్లకు కుట్ర పన్నినట్లు కోర్టులో సాకిర్ వెల్లడి
సాక్షి, హైదరాబాద్: దేశంలోని అమెరికా, ఇజ్రాయెల్ రాయబార కార్యాలయాల పేల్చివేతకు కుట్ర పన్నిన ఐఎస్‌ఐ ఏజెంట్, శ్రీలంక జాతీయుడైన ఉగ్రవాది మహమ్మద్ సాకిర్ హుస్సేన్‌కు చెన్నైలోని ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. చెన్నైలోని అమెరికా కాన్సులేట్, బెంగళూరులోని ఇజ్రాయిల్ కాన్సులేట్‌లను పేల్చి వేసేందుకు పేలుడు పదార్ధాలను తరలించడం, నకిలీ కరెన్సీని చలామణిలోకి తెచ్చారనే ఆరోపణలపై ఇతనితోపాటు మరో ఇద్దరిపై గత నెలలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అభియోగాలు మోపింది.
కేసును విచారించిన కోర్టు సాకిర్‌కు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.1,000 జరిమానా విధించిందని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఐజీ రవిశంకర్ అయ్యన్నార్ తెలిపారు. తనకు శిక్షణనిచ్చింది పాకిస్తాన్ ఐఎస్‌ఐ విభాగమని, దాని ప్రేరణతోనే ఉగ్రవాదిగా మారినట్లు జాకీర్ కోర్టులో బహిరంగంగా ఒప్పుకున్నాడని, ఇది దేశ చరిత్రలోనే తొలిసారని ఆయన వెల్లడించారు. శ్రీలంకకు చెందిన ఆర్మీ అధికారి అబిద్‌సిద్దిఖీతోపాటు నితిన్ అని పేరు మార్చుకున్న మరో అధికారి.. సాకిర్‌కు ఉగ్రవాద కార్యకలాపాలపై శిక్షణ నిచ్చారని ఆయన వివరించారు.