మీవల్లే జైల్లో శశికళ.. రూప సెల్ఫీపై చర్చ

IPS D Roopa Praises Subramanian Swamy - Sakshi

సాక్షి, బెంగళూరు : శశికళ పరప్పన అగ్రహార జైల్లో శశికళ వీఐపీ సదుపాయాలపై నివేదికతో ఐపీఎస్‌ అధికారిణి రూప వార్తల్లోకెక్కారు. అప్పటి నుంచి తరచూ ఆమె వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. తాజాగా ఆమె చేసిన ఓ ట్వీట్‌ విమర్శలకు దారితీసింది. బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామిని పొగుడుతూ ఆయనతో దిగిన ఓ సెల్ఫీని ఆమె ట్వీట్‌ చేయగా.. అది చర్చనీయాంశమైంది.

‘మీరు(సుబ్రహ్మణ్య స్వామి) చాలా గొప్ప వ్యక్తి సార్‌. మీరే గనుక ఫిర్యాదు చేయకుంటే మాత్రం ఆ వ్యక్తి అసలు జైలుకి వెళ్లే వారు కాదేమో. మీ స్ఫూర్తితోనే ఆమె జైల్లో చేసిన అక్రమాలు నేను బయటపెట్టా’  అని రూప ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే ఆ ట్వీట్‌పై పలువురు విమర్శలు మొదలుపెట్టారు. ‘మీరు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు’ అంటూ ఓ వ్యక్తి రీట్వీట్‌ చేయగా... రూప దానికి స్పందించారు. ‘నేను  జైలు రిపోర్టు అందజేయగానే నన్ను బదిలీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కర్ణాటక పోలీస్‌ శాఖ ప్రవర్తించింది. అప్పుడు ఎవరూ ప్రశ్నించరు. కానీ, ఇప్పుడు ఓ స్పూర్తిదాయాక వ్యక్తితో ఫోటో దిగితే రాజకీయాలు చేస్తున్నారు. ఇది సరికాదు’  అని ఆమె పేర్కొన్నారు.

కాగా, జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న సుబ్రహ్మణ్య స్వామి ఫిర్యాదుతో తేనెతుట్టే కదిలింది. సుమారు రెండు దశాబ్దాలపాటు జరిగిన విచారణ అనంతరం బెంగళూరు కోర్టు గతేడాది ఫిబ్రవరిలో జయలలిత ఆమె సన్నిహితురాలు శశికళను కోర్టు దోషులుగా తేల్చింది. అయితే అప్పటికే జయలలిత మరణించగా, శశికళ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఇదిలా ఉంటే శశికళకు జైల్లో వీఐపీ ట్రీట్‌ మెంట్‌ అందిందని.. అందుకోసం అధికారులు రూ. 2 కోట్లు లంచం తీసుకున్నారంటూ జైల్లో డీఐజీగా ఉన్న రూప సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఆ ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన కర్ణాటక  హోం శాఖ.. ఆపై రూపను వేరే విభాగానికి బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top