‘భారత కుబేరుడు’.. టీ కొట్టు యజమాని

Indian Richest Couple Visited 23 Countries By Selling Tea - Sakshi

టీ అమ్ముతూ 23 దేశాల పర్యటన

కల సాకారం చేసుకున్న కేరళ దంపతులు

కొచ్చి : కలలను సాకారం చేసుకోవాలని అందరూ అనుకుంటారు. కానీ, ఆ దిశగా నిర్విరామంగా కృషి చేసి విజయం సాధించేది కొందరే. కేరళకు చెందిన విజయన్‌ దంపతులు ఈ కోవకు చెందినవారే. తమ చిన్ననాటి కలలను సాకారం చేసుకోవడానికి వీరు చేస్తున్న కృషిని మహింద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహింద్రా కొనియాడారు. ప్రపంచ పర్యటనే లక్ష్యంగా గత 55 ఏళ్లుగా టీ కొట్టు నిర్వహిస్తూ.. విదేశాలు చుట్టివచ్చిన ఈ 70 ఏళ్ల వృద్ధ దంపతులు నిజమైన ‘భారత కుబేరులు’ అంటూ కితాబిచ్చారు. ఈ ఆదర్శ దంపతుల విదేశీ యాత్రలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ఆనంద్‌ వారిపై ప్రశంసలు కురిపించారు.

రోజూ రూ.300 పొదుపుతో..
కొచ్చిలో ఉన్న విజయన్‌ దంపతుల టీ స్టాల్‌ ఫేమస్‌. రోజూ 350 మందికి క్యాటరింగ్‌ చేస్తారు. తమ కలలను నెరవేర్చుకునే క్రమంలో వీరు రోజూ రూ.300 పొదుపు చేస్తారు. తక్కువ మొత్తంలో ఖర్చులు పెడుతూ విదేశాల్లో పర్యటిస్తారు. ఇప్పటికే సింగపూర్‌, అర్జెంటీనా, పెరు, స్విట్జర్లాండ్‌, బ్రెజిల్‌ లాంటి 23 దేశాలను చుట్టివచ్చిన విజయన్‌ దంపతులు మరిన్ని దేశాల్లో పర్యటించడానికి ప్రణాళిక కూడా సిద్ధం చేసుకున్నారు. ‘దేశదేశాలు చుట్టి రావాలన్నది నా చిన్ననాటి కల. అందుకోసం సొమ్ము కావాలి. దానికోసమే నిలకడగా ఆదాయాన్నిచ్చే టీ వ్యాపారాన్ని ఎంచుకున్నాను’ అని చెప్పుకొచ్చారు విజయన్‌.

1963 లో ప్రారంభమైన విజయన్‌ టీ స్టాల్‌కు విదేశీ యాత్రికుల తాకిడీ ఎక్కువే. ఇతర దేశాలు తిరిగిన అనుభవాల్లోంచి ఏం నేర్చుకున్నారన్న ప్రశ్నకు ‘మన దృక్పథం, మైండ్‌, మన సంస్కృతిలో మార్పులు చోటుచేసుకుంటాయి’ అని బదులిచ్చాడు. జీవితంలో జీవించేందుకు డబ్బు ఒక్కటే కాదు.. గొప్ప సంకల్పం కూడా ఉండాలని చాటిచెప్తున్న ఈ వృద్ధ దంపతులు నిజంగా గ్రేట్‌ కదా.. ఏమంటారు..!!

ఈసారి తప్పకుండా వెళ్తా..
సంపద విషయంలో ఈ దంపతులు ఫోర్బ్స్‌ లిస్టులో లేకపోవచ్చు. కానీ, నా ఉద్దేశంలో విజయన్‌ దంపతులు భారతదేశంలోనే అత్యంత సంపన్నులు అని ఆనంద్‌ మహింద్రా పేర్కొన్నారు. ఈసారి కొచ్చి వెళ్లినప్పుడు అక్కడ టీ తీసుకుని, వారి పర్యటనల విశేషాలు తెలుసుకుంటానని ట్వీట్‌ చేశారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top