పత్రికా స్వేచ్ఛలో మరింత దిగజారిన భారత్‌

India Slipped In 2018 World Press Freedom Index - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : 2018 సంవత్సరానికి గాను రిపోర్టర్స్‌ వితౌట్‌ బోర్డర్స్‌ (ఆర్‌ఎస్‌ఎఫ్‌) బుధవారం వెల్లడించిన ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీలో భారత్‌ స్థానం 136 నుంచి 138వ స్ధానానికి పడిపోయింది. జర్నలిజంపై కత్తికట్టినట్టు వ్యవహరిస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామిక వ్యవస్థకు విఘాతం కలుగుతోందని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. భారత్‌లో పరిస్థితి మరింత దిగజారిందని.. రాడికల్‌ జాతీయవాదులు ఆన్‌లైన్‌ క్యాంపెయిన్‌లో జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని చెలరేగుతున్నారని. మోదీ జాతీయవాదంతో ఇబ్బందికర పరిస్థితి తలెత్తిందని ఆర్‌ఎస్‌ఎఫ్‌ పేర్కొంది.

హిందూ జాతీయవాదులుగా చెప్పుకునే కొందరు ప్రధాన స్రవంతి మీడియాపై నియంత్రణ విధిస్తూ, జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని భౌతిక దాడులకూ తెగబడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. గత ఏడాదిలో ముగ్గురు పాత్రికేయులను హత్య చేశారని పేర్కొంది. భారత్‌లో పత్రికా స్వేచ్ఛ పతనానికి ప్రధాని నరేంద్ర మోదీ ట్రోల్‌ ఆర్మీలే కారణమని ఆర్‌ఎస్‌ఎఫ్‌ నివేదిక పేర్కొంది. ప్రభుత్వానికి కొరుకుడు పడని జర్నలిస్టులను ప్రాసిక్యూట్‌ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. కశ్మీర్‌ లాంటి ప్రాంతంలో మీడియా కవరేజ్‌ సంక్లిష్టంగా మారిందని పేర్కొంది. విదేశీ పాత్రికేయులను ఆ ప్రాంతంలో పనిచేయనీయడం లేదని, తరచూ ఇంటర్‌నెట్‌ డిస్‌కనెక్ట్‌ అవుతోందని తెలిపింది. కేంద్ర ప్రభుత్వ లాలూచీతో స్ధానిక పత్రికల్లో పనిచేసే కశ్మీరీ జర్నలిస్టులను పోలీసులు టార్గెట్‌ చేస్తున్నారని పేర్కొంది.

పత్రికా స్వేచ్ఛలో ముందున్న యూరప్‌

ఇక పత్రికా స్వేచ్ఛ సూచీలో అమెరికా రెండు స్ధానాలు కోల్పోయి 45వ స్ధానంతో సరిపెట్టుకుంది. గత ఏడాది తరహాలోనే ఈసారి కూడా యూరప్‌ దేశాలే పత్రికా స్వేచ్ఛలో ముందున్నాయి. ఈ సూచీలో నార్వే తొలి స్ధానంలో నిలవగా, స్వీడన్‌ రెండవ స్ధానాన్ని దక్కించుకుంది. నెదర్లాండ్స్‌, ఫిన్‌లాండ్‌, స్విట్జర్లాండ్‌లు తొలి ఐదు స్ధానాల్లో నిలిచాయి. కెనడా నాలుగు స్ధానాలు ఎగబాకి 18వ స్ధానంలోకి దూసుకువచ్చింది. కెనడాలో మెరుగైన పత్రికా స్వేచ్ఛకు సానుకూల వాతావరణం నెలకొందని నివేదిక కితాబిచ్చింది. ఇక ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీలో ఉత్తర కొరియా అట్టడుగున నిలవగా, తుర్కమెనిస్థాన్‌, సిరియా, చైనాలు తర్వాతి స్ధానాల్లో ఉన్నాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top