
బంగ్లాకు మానవతాసాయం
బంగ్లాదేశ్‌కు వస్తున్న రోహింగ్యాలను ఆదుకునేందుకు మానవతాదృక్ఫథంతో భారత్ చేయూత అందిస్తోంది.
న్యూఢిల్లీ : మయన్మార్ నుంచి వేల సంఖ్యలో బంగ్లాదేశ్‌కు వస్తున్న రోహింగ్యాలను ఆదుకునేందుకు మానవతాదృక్ఫథంతో భారత్ చేయూతను అందిస్తోంది. రోహింగ్యా శరణార్థులను ఆదుకునేందుకు పునరావాస సాయం కింద భారత్ ఆహార పదార్థాలను అందిస్తోంది.
పాలు, పళ్లు, చక్కెర, ఉప్పు, వంటనూనెలు, టీ, బిస్కెట్లు, దోమతెరలు, ఇతర అవసరమైన పదార్థాలతో గురువారం ఉదయం ఒక కంటెయినర్ బంగ్లాదేశ్‌కు బయలుదేరింది. ఈ కంటెయినర్ ఈ రోజు రాత్రి చిట్టిగాంగ్ చేరుకునే అవకాశం ఉంది. భారత్-బంగ్లాదేశ్ మధ్య ఉన్న స్నేహసంబంధాల వల్ల ఆ దేశంలో ఏ సమస్య వచ్చినా భారత్ వేగంగా స్పందిస్తుందని విదేశాంగ శాఖ తెలిపింది. బంగ్లాకు ఎటువంటి సహాయం కావాలన్నా వెంటనే అందిస్తామని కూడా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
మయన్మార్‌లో నెలకొని ఉన్న ఉద్రక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడి నుంచి సుమారు 3 లక్షల 80 వేల ముంది రోహింగ్యాలు బంగ్లాదేశ్‌కు వలసవచ్చినట్లు అంచనాలు ఉన్నాయి. రోహింగ్యా మిలిటెంట్లు మయన్మార్‌లోని పోలీస్ అవుట్ పోస్ట్‌లపై దాడి చేయడంతో హింస చెలరేగిందని తెలుస్తోంది.