ఏడుగురు రోహింగ్యాలు వెనక్కి

India to Send 7 Rohingyas Back to Myanmar - Sakshi

న్యూఢిల్లీ: అస్సాంలో అక్రమంగా నివాసముంటున్న ఏడుగురు రోహింగ్యాలను గురువారం భారత్‌ దేశం నుంచి పంపించివేసింది. వారి స్వదేశమైన మయన్మార్‌కు పంపించింది. భారత్‌నుంచి రోహింగ్యా ముస్లింలను పంపించేయడం ఇదే తొలిసారి. 2012లో వీరిని గుర్తించి విదేశీయుల చట్టం కింద అరెస్టు చేశారు. అప్పటి నుంచి వీరంతా అస్సాంలోని కచార్‌ జైల్లోనే ఉన్నారు. ‘ఏడుగురు మయన్మార్‌ దేశస్తులను నేడు భారత్‌ నుంచి బహిష్కరించాం. మయన్మార్‌–మణిపూర్‌ సరిహద్దుల్లోని మోరే వద్ద ఆ దేశ అధికారులకు వీరిని అప్పగించాం. మయన్మార్‌ దౌత్యవేత్తలు కూడా వీరిని తమ దేశస్తులుగా గుర్తించారు.ఈ ఏడుగురికి ట్రావెల్‌ డాక్యుమెంట్లను కూడా ఇచ్చారు’ అని అస్సాం అదనపు డీజీ భాస్కర్‌ మహంతా పేర్కొన్నారు.  

సీజేఐ గొగోయ్‌ పచ్చజెండా: వీరిని పంపించే విషయంలో చివరి నిమిషం వరకు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. తమను పంపించేయవద్దంటూ ఈ ఏడుగురిలో ఒకరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే గురువారం ఉదయం ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీం.. వీరి విజ్ఞప్తిని తిరస్కరించింది. వీరంతా (26 నుంచి 32 ఏళ్ల లోపు వారే) అక్రమంగా భారత్‌లో ఉంటున్నందున పంపించాల్సిందేనని ఆదేశించింది. ‘వీరి విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకోబోం. పిటిషన్‌ను కొట్టివేస్తున్నాం. మయన్మార్‌ కూడా వీరిని తమ పౌరులుగా గుర్తించింది’ అని సీజేఐ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. విడుదలైన తర్వాత వీరంతా అస్సాం ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, దేశంలో 14వేలకు పైగా రోహింగ్యాలు ఉన్నారని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగం తెలిపిందని గతేడాది ప్రభుత్వం పార్లమెంటులో వెల్లడించింది. అయితే కేంద్ర ప్రభుత్వ సంస్థల వివరాల ప్రకారం దేశంలో 40వేలకు పైగా రోహింగ్యా ముస్లింలు ఉన్నారని తేలింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top