ఒకే రోజు 9,851 కేసులు

India sees deadliest 24 hours with highest deaths - Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించడంతో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. 24 గంటల్లో 9,851 కేసులు, 273 మరణాలు నమోదు కావడం ఆందోళన పెంచుతోంది. శుక్రవారం నాటికి దేశ వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల 26 వేల 770కు చేరుకోగా, మృతుల సంఖ్య 6,348కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కోవిడ్‌–19 కేసుల్లో ప్రపంచ దేశాల్లో భారత్‌ ఏడో స్థానంలో ఉంది.

అమెరికా, బ్రెజిల్, రష్యా, బ్రిటన్, స్పెయిన్, ఇటలీ తర్వాత స్థానం భారత్‌దే. జూన్‌ 8 నుంచి ప్రార్థనామందిరాలు, మాల్స్‌ వంటి వాటిని ప్రారంభిస్తూ ఉండడంతో కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలున్నాయి. కేసులు ఇదే స్థాయిలో పెరిగితే త్వరలోనే ఇటలీని దాటిపోనుంది. ఇక కోవిడ్‌ రోగుల రికవరీ రేటు 48.27 శాతంగా ఉంది. అత్యధిక కేసుల్లో మహారాష్ట్ర (77,793), తమిళనాడు (27,256), ఢిల్లీ (25,004) మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.  మహారాష్ట్రలో ఇప్పటివరకు 2,710 మంది ప్రాణాలు కోల్పోగా ఆ తర్వాత గుజరాత్‌ (1,155), ఢిల్లీ (650) ఉన్నాయి.  

4 రోజుల్లో 900కు పైగా మరణాలు
కోవిడ్‌ కేసులు అధికంగా నమోదవుతున్నా మృతుల రేటు ఇప్పటి దాకా తక్కువగా ఉంది. కానీ ఇప్పుడు మరణాలు కూడా పెరిగిపోతున్నాయి. కరోనా వైరస్‌ తొలి మరణం మన దేశంలో మార్చి 12న సంభవించింది. ఆ తర్వాత మృతుల సంఖ్య వెయ్యికి చేరుకోవడానికి 47 రోజులు పట్టింది. కానీ ఇప్పుడు నాలుగు రోజుల్లోనే 900 పైగా మరణాల సంఖ్య నమోదు కావడం గమనార్హం.

∙చైనా రాజధాని బీజింగ్‌ నగరంలో అమలవుతున్న అత్యవసర పరిస్థితి తీవ్రతను రెండో స్థాయి నుంచి శనివారం మూడో స్థాయికి తగ్గించినట్లు యంత్రాంగం తెలిపింది. కరోనా మహమ్మారికి కేంద్ర బిందువైన వూహాన్‌లో కోవిడ్‌–19 పాజిటివ్‌ కేసులు లేవని తెలిపింది. వూహాన్‌లోని మొత్తం కోటి మందికీ కోవిడ్‌–19 పరీక్షలు జరపగా ఎవరికీ పాజిటివ్‌గా నిర్థారణ కాలేదని పేర్కొంది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top