నారీ శక్తి సైనిక శక్తి

India is cultural diversity and military might on display - Sakshi

అంబరాన్నంటిన గణతంత్ర వేడుకలు

ఎన్నో తొలి ఘటనలు, ఆకట్టుకున్న ప్రదర్శనలు  

న్యూఢిల్లీ: భారతదేశ 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు రాజధాని న్యూఢిల్లీలోని రాజ్‌పథ్‌లో ఘనంగా జరిగాయి. శీతాకాలం వేళ ఆదివారంనాడు సూర్యకిరణాల వెచ్చదనం మధ్య త్రివిధ బలగాలు నిర్వహించిన 90 నిమిషాల పెరేడ్‌ అణువణువునా దేశభక్తిని నింపుతూ రోమాలు నిక్కబొడిచేలా సాగింది. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెప్పే భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, మన సైనిక సత్తాని ప్రపంచానికి చాటి చెప్పే ఆయుధ ప్రదర్శనలు, సామాజిక, ఆర్థిక పురోగతిని తెలిపే శకటాలు, మహిళా సాధికారతను చాటి చెప్పే విన్యాసాలతో పెరేడ్‌ దేశానికే గర్వకారణంగా నిలిచింది.

రాజ్‌పథ్‌లో గోవా, మేఘాలయ తదితర రాష్ట్రాల శకటాల ప్రదర్శన

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ యుద్ధ స్మారక కేంద్రం దగ్గర నివాళులర్పించడం దగ్గర్నుంచి గగనతలంలో త్రివిధ బలగాలకి సంకేతంగా హెలికాప్టర్లు చేసే విన్యాసాల వరకు ఎన్నో తొలి ఘటనలకు ఈ వేడుకలు సాక్షీభూతమయ్యాయి. బ్రెజిల్‌ అధ్యక్షుడు జెయిర్‌ బోల్సనోరా ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసి పెరేడ్‌ని తిలకించారు. రాజ్‌పథ్‌లో పెరేడ్‌ మొదలు కావడానికి ముందు జాతీయ గీతం బ్యాండ్‌ని వాయించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ జాతీయ జెండాను ఆవిష్కరించే సమయంలో 21 సార్లు గాల్లోకి తుపాకులు పేల్చి సైనికులు గౌరవ వందనం సమర్పించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా ఇతర  ప్రముఖులు ఈ ఉత్సవానికి హాజరయ్యారు.  

యుద్ధస్మారక కేంద్రం వద్ద ప్రధాని నివాళులు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం ఉదయం పెరేడ్‌ ప్రారంభం కావడానికి ముందు కొత్తగా నిర్మించిన జాతీయ యుద్ధ స్మారక కేంద్రం వద్ద నివాళులర్పించారు.  ఏటా ఇండియా గేట్‌ దగ్గరున్న అమర్‌ జ్యోతి జవాన్‌ వద్ద నివాళుల ర్పించడం సంప్రదాయంగా వస్తోంది.

కాషాయ బాందినీ ప్రింట్‌ తలపాగాతో..
జాతీయ వేడుకల సమయంలో ప్రధానమంత్రి మోదీ రంగుల తలపాగా ధరించే సంప్రదాయాన్ని కొనసాగించారు. తెల్ల రంగు పైజామా, కుర్తా, దానిపైన నీలం రంగు జాకెట్, కాషాయ రంగులో వీపు మీదుగా జారేలా ఉండే బాందినీ ప్రింట్‌ తలపాగా ధరించారు. రాజస్తాన్, గుజరాత్‌లలో ఇలాంటి తలపాగాలను ధరిస్తారు.

ఆకట్టుకున్న శకటాలు
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాల మేళవింపుతో, సామాజిక బాధ్యతను గుర్తు చేసేలా, ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి వెళ్లేలా, మన సైనిక పాటవాన్ని చాటేలా మొత్తం 22 శకటాల ప్రదర్శన ఆద్యంతం మనోహరంగా సాగింది. కప్పల్ని కాపాడాలని గోవా శకటాన్ని రూపొందిస్తే, హిమాచల్‌ ప్రదేశ్‌ కులు దసరా ఉత్సవాన్ని, ఒడిశా రథయాత్రను ప్రతిబింబించేలా శకటాల్ని రూపొందించాయి. వాయుసేనకు చెందిన శకటం తేజస్‌ యుద్ధ విమానాలు, ఆకాశ్, అస్త్ర క్షిపణుల్ని ప్రదర్శించింది. ఇక జల్‌ శక్తి మంత్రిత్వ శాఖ 2024కల్లా ప్రతీ గ్రామానికి కుళాయి కనెక్షన్‌ ఇస్తామని చాటిచెప్పే శకటాన్ని ప్రదర్శించింది.    

ఎన్నో ఫస్ట్‌లు  
రాజ్‌పథ్‌లో జరిగిన పెరేడ్‌ని మహిళా కమాండర్‌ కెప్టెన్‌ తాన్యా షెర్గిల్‌ ముందుండి నడిపించారు. అందరూ పురుషులే పాల్గొన్న ఈ మార్చ్‌కి ఒక మహిళా అధికారి నేతృత్వం వహించడం ఇదే తొలిసారి.  

► సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీసు ఫోర్స్‌ (సీఆర్‌పీఎఫ్‌)కు చెందిన మహిళా బైకర్లు తొలిసారిగా ఇచ్చిన ప్రదర్శన ఉత్కంఠభరితంగా సాగింది. ఇన్‌స్పెక్టర్‌ సీమ నాగ్‌ నేతృత్వంలో డేర్‌ డెవిల్‌ స్టంట్‌ ప్రదర్శన సాగింది. నడుస్తున్న బైక్‌ పైభాగాన నిల్చొని సీమ సెల్యూట్‌ సమర్పించడం ఈ షోకే హైలైట్‌.

► జమ్మూ కశ్మీర్‌ కేంద్ర పాలిత ప్రాంతంగా ఆవిర్భవించిన తర్వాత తొలిసారిగా రిపబ్లిక్‌ డే పెరేడ్‌లో పాల్గొని ‘‘తిరిగి గ్రామానికి’’అన్న థీమ్‌తో శకటాన్ని ప్రదర్శించింది. ఈ శకటం ముందుభాగంలో కశ్మీర్‌ చేతి వృత్తులను ప్రతిబింబించేలా శాలువా అల్లుతున్న కార్మికుడ్ని ఉంచారు.  

► రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఒ) గత ఏడాది రూపొందించిన ఉపగ్రహ విధ్వంసక క్షిపణి (ఏశాట్‌)ని ఈ సారి పెరేడ్‌లో తొలిసారిగా ప్రదర్శించారు. మిషన్‌ శక్తిలో భాగంగా మన క్షిపణి వ్యవస్థ సత్తా దీంతో తెలుస్తుంది.  

► ధనుష్‌ శతఘ్నులను తొలిసారిగా రిపబ్లిక్‌ డే పెరేడ్‌లో ప్రదర్శించారు. 155ఎంఎం/45 కాలిబర్‌ సామర్థ్యం కలిగిన ఈ శతఘ్ని పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. 36.5కి.మీ. దూరం వరకు ధనుష్‌ కచ్చితంగా లక్ష్యాలను ఛేదిస్తుంది.  

► కొత్తగా మన అమ్ముల పొదిలో వచ్చి చేరిన చినూక్, అపాచీ భారీ యుద్ధ హెలికాప్టర్లు తొలిసారిగా పెరేడ్‌లో ప్రదర్శించాయి. మారుమూల ప్రాంతాల్లో భారీ లోడ్లను కూడా చినూక్‌ మోసుకుపోగలదు. ఇక అపాచి హెలికాప్టర్‌ గగనతలం నుంచి గగనతలానికి, నింగి నుంచి నేలకి కూడా క్షిపణుల్ని ప్రయోగించే సత్తా ఉంది.  

► నీలాకాశంలో జరిగే వైమానిక విన్యాసాలు రోమాలు నిక్కబొడుచుకునేలా సాగాయి. 40 విమానాలు త్రిశూల్‌ ఆకారంలో విన్యాసాలు చేయడంతో మొదలై త్రివిధ దళాలకి గుర్తుగా మూడు ఏఎల్‌హెచ్‌ హెలికాప్టర్లు ’VIP’ ఆకారంలో వచ్చాయి. ఈ ప్రదర్శనని ఇలా నిర్వహించడం ఇదే తొలిసారి.

17 వేల అడుగుల ఎత్తులో..
న్యూఢిల్లీ: 17 వేల అడుగుల ఎత్తు.. మైనస్‌ 20 డిగ్రీల ఉష్ణోగ్రత.. మోకాళ్ల లోతు మంచు.. జాతీయ జెండాను ఎగురవేసేందుకు ఇండో–టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ (ఐటీబీపీ)లకు ఇవేవీ అడ్డంకి కాలేదు. 71వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా లదాఖ్‌లో ‘వందేమాతరం.. భారత్‌ మాతా కీ జై’ నినాదాల నడుమ మువ్వన్నెల జెండాను రెపరెపలాడించారు.

దాదాపు రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది. సైనికులను కీర్తిస్తూ పలువురు యూజర్లు కామెంట్లు చేశారు. దేశానికి నిజమైన హీరోలు మీరే అంటూ ఒకరు.. మిమ్మల్ని చూస్తే
గర్వంగా ఉంది.. గణతంత్ర వేడుకలు జరుపుతున్న హీరోలు అంటూ ఇంకొకరు అని కొనియాడారు.

గణతంత్ర వేడుకల్లో మోదీ ధరించిన తలపాగాలు


పరేడ్‌లో ఆకాశ్‌ క్షిపణి 


బైక్‌పై సీఆర్పీఎఫ్‌ మహిళా జవాన్ల విన్యాసం

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top